పూర్తిగా నీరసించిన కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో కాస్త జీవం పోశారు వైఎస్ షర్మిల. 2024 ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ పార్టీ తరపున ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను పోటీలో ఉంచి గర్జించారు. అధికార వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా, అదే స్థాయిలో టీడీపీ కూటమికి వ్యతిరేకంగా ప్రశ్నల వర్షం కురిపించారు. తాను కాపాడిన వైఎస్సార్‌సీపీ ఇప్పుడు ప్రజలను కాపాడలేకపోతున్నదని, అటువంటి పార్టీనీ వీడాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. కడప పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా షర్మిల పోటీ చేసి అవినాష్‌రెడ్డిని ఓడించాలని పిలుపు నివ్వడంతో పాటు మా చిన్నాన్న చావుకు కారణమైన అవినాష్‌ను పార్లమెంట్ మెట్లు ఎక్కకుండా చూడాలని ఓటర్లను కోరారు. తన వంతుగా కాంగ్రెస్ పార్టీ మేలుకొలుపు కోసం రాష్ట్రమంతా చుట్టుముట్టారు. వైఎస్సార్ హావ భావాలతో అడుగులు వేసిన షర్మిల ప్రసంగాలు పలువురిని ఆకట్టుకున్నాయి. రాహుల్ గాంధీని ఎన్నికల ప్రచారానికి పిలిపించి రాష్ట్ర సమస్యలపై హామీలు ఇప్పించడంలో సక్సెస్ అయ్యారు.
ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిలరెడ్డి ప్రచారం ఉత్తర భారత దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీకి అవసరమని కాంగ్రెస్ భావించినట్లు సమాచారం. పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు కూడా సోనియా గాంధీకి సమాచారం ఇచ్చారు. షర్మిలతో కొన్ని రాష్ట్రాల్లో ప్రచారం చేయిస్తే బాగుంటుందనే సూచనకు సోనియాతో పాటు రాహుల్ కూడా సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం ముగిసినందున ఓట్ల లెక్కింపు వరకు సమయం ఉండటంతో కాంగ్రెస్ పార్టీకి ఉత్తరాదిలో బలం పెరగాలంటే యువకులైన వారితో మంచి ప్రచారం చేయడం కూడా ముఖ్యమేనని భావిస్తున్నారు.
వైఎస్ షర్మిలను కడప నుంచి గెలిపించాలని వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ విడుదల చేసిన వీడియో ఉత్తరాధి రాష్ట్రాల్లో వైరల్ అయింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా విజయమ్మ విడుదల చేసిన వీడియోపైనే చర్చ సాగుతోంది. ఆంధ్ర ప్రదేశ్‌లో అంతగా జనం పట్టించుకోకపోయినా నార్త్ ఇండియా వారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఆసక్తిగా చూస్తున్నారని అర్థమైంది. ఈ వీడియో ప్రభావం కూడా దేశంలోని కాంగ్రెస్ నేతలపై ఉందని ప్రచారం జరుగుతోంది. వైఎస్సార్‌కు కాంగ్రెస్‌లో ఒక చరిష్మా ఉండేదని, ఆ చరిష్మా ఇప్పుడు వైఎస్ షర్మిలకు ఉపయోగపడుతోందనే ప్రచారం కూడా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌లో ఎటువంటి నిర్ణయమైనా తీసుకోవచ్చనే స్వేచ్చను సోనియా గాంధీ షర్మిలకు ఇచ్చినట్లు సమాచారం. అందుకే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఎంపికలోనూ ఆమె స్వతహాగా నిర్ణయాలు తీసుకుని నేరుగా కాంగ్రెస్ అధిష్టానానికి జాబితాను సమర్పించింది. అదే జాబితాను కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ఆమోదించింది.
వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ పార్టీలో మంచి ప్రయారిటీ ఇవ్వడం వల్ల ఆమెను రాజకీయంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఉపయోగించుకోవాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉందని సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించేందుకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు దక్కే అవకాశాలు ఉన్నాయని, మిగిలిన నియోజకవర్గాల్లో మూడు నుంచి ఐదు శాతం వరకు ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది.