ఏపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకునేందుకు వస్తున్న వైఎస్ షర్మిల కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీందో జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆగిపోయి ధర్నాకు దారితీసింది.
ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ప్రభుత్వం చెప్పిందా? లేక పోలీసులే చేశారా? తెలియదు కానీ ఏపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకునేందుకు విజయవాడ వచ్చిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ఎనికేపాడు వద్ద జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. షర్మిల కాన్వాయిని అడ్డుకున్న పోలీసులు డౌన్‌డౌన్, సీఎం డౌన్‌డౌన్ అంటూ నినాదాలతో కార్యకర్తలు హోరెత్తించారు. ఉదయం 11 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక విమానంలో చేరుకున్న షర్మిల, పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు విజయవాడ బందరు రోడ్డులోని ఆహ్వానం కళ్యాణ మండపానికి బయలుదేరారు.
షర్మిలకు స్వాగతం పలికేందుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు బైకులు, కార్లతో షర్మిల కాన్వాయ్‌ను ఫాలో అయ్యారు. రోడ్డుపై వేల మంది ర్యాలీగా రావడాన్ని చూసిన పోలీసులు షర్మిల కారును అడ్డుకున్నారు. దీందో సుమారు అరగంటసేపు ఆందోళన జరిగింది. జాతీయ రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా ఆగిపోయింది. ఆందోళన కొనసాగుతున్నంతసేపు షర్మిల కార్లోనే కూర్చున్నారు. ఆమె కూడా కిందకు దిగి ధర్నాలో కూర్చుందామని ప్రయత్నించడంతో నాయకులు సర్థిచెప్పారు. పోలీసులకు కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తరువాత పోలీసులు వదిలేయడంతో కళ్యాణ మండపానికి షర్మిల, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేరుకున్నారు.
అనవసరమైన రచ్చ పోలీసులు ఎందుకు చేశారనే విషయంపై ముఖ్యమంత్రి ఆరా తీసినట్లు సమాచారం. ఎంత మంది వచ్చినా ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తూ పంపించాలే కానీ కార్లను ఎందుకు ఆపేశారనేది పెద్ద చర్చకు దారి తీసింది.
Next Story