ఢిల్లీ వేదికగా ఎపిసిసి చీఫ్ వైయస్ షర్మిల సమరం మొదలుపెట్టారు. ప్రత్యేక హోదా వచ్చే వరకు తన పోరాటం ఆగదని ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్పనిసరిగా ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తూ పలువురు అధికార, ప్రతిపక్ష నేతలను ఢిల్లీలో శుక్రవారం కలుస్తున్నారు. ఇప్పటికే కొందరు నేతలను షర్మిల కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, అందుకోసం మీరంతా కృషి చేయాలని, బిజెపి ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలని ఆమె సమరం మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం ఢిల్లీ చేరి ముఖ్య నాయకులను కలుస్తున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని లేకుంటే ఏ విధమైన అభివృద్ధి ఉండదని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పలుమార్లు చెప్పిన విషయాన్ని షర్మిల గుర్తు చేశారు. షర్మిలకు పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వగానే ఆమె మొదట ప్రత్యేక హోదా పైనే నోరు విప్పారు. ఆ తర్వాత పోలవరం ఇతర ప్రాజెక్టులకు నిధులు, ప్రత్యేక రైల్వే జోన్, రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు, మరికొన్ని అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులను సమరానికి సిద్ధం చేశారు.