షర్మిల వైపే తల్లి విజయమ్మ
x

షర్మిల వైపే తల్లి విజయమ్మ

విజయమ్మ షర్మిల వైపేనని తేలి పోయింది. ఇప్పటి వరకు అన్నా, చెల్లెలు ఇద్దరూ నా బిడ్డలే అనుకున్న విజయమ్మ చివరకు షర్మిల వైపునకు మొగ్గు చూపింది.


వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సతీమణి వైఎస్‌ విజయమ్మ ఎవరి పక్షాన నిలబడుతారని ఇప్పటి వరకు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది. కొడుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పక్షాన ఉంటారా? కుమార్తె వైఎస్‌ షర్మిల వైపు నిలబడతారా అనే సస్పెన్స్‌ నెలకొంది. తాజాగా వైఎస్‌ విజయమ్మ శనివారం విడుదల చేసిన వీడీయోతో కూతురు వైఎస్‌ షర్మిల పక్షానే నిలబడినట్లు తేలి పోయింది. వైఎస్‌ షర్మిలకు ఓట్లేసి గెలిపించాలని ఆమె కోరడంతో ఈ సస్పెన్స్‌కు ఫుల్‌ స్టాప్‌ పెట్టారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌ కావడంతో పాటు సంచలనంగాను మారింది.

ఆ వీడియోలో ఏమి చెప్పారంటే
నేను మీ విజయమ్మను. రాజశేఖర్‌రెడ్డి గారిని అభిమానించే వారికి, ప్రేమించే వారికి, యావత్‌ కడప లోక్‌ సభ నియోజక వర్గం ప్రజలందరికీ నా విన్నపం. రాజశేఖర్‌రెడ్డి గారిని ఏ విధంగా అభిమానించారో, ఏ విధంగా అక్కున చేర్చుకున్నారో, ఆయన ఊపిరి ఉన్నంత వరకు ప్రజా సేవలు మీ కోసమే అంకితమయ్యారు. ఈ రోజు రాజశేఖర్‌రెడ్డి గారి ముద్దు బిడ్డ షర్మిలమ్మ కడప పార్లమెంట్‌కు పోటీ చేస్తోంది. ఆయనను ఎలా ఆదరించారో ఈ రోజు ఆ బిడ్డను ఆశీర్వదించమని, గెలిపించి పార్లమెంట్‌కు పంపమని, మిమ్మలందరినీ కోరుతున్నాను.
జగన్‌ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి దూరంగానే ఉన్న విజయమ్మ
ముఖ్యమంత్రిగా జగన్‌ బాధ్యతలు స్వీకరించిన నెల రోజుల తర్వాత నుంచి జగన్‌కు తల్లి విజయమ్మ దూరంగానే ఉంటూ వచ్చారు. అప్పటి వరకు వైఎస్‌ఆర్‌సీపీకి గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మ ఆ పార్టీకి, ఆ పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు జగన్‌ పాల్గొన్న వైఎస్‌ఆర్‌సీపీ సభలోనే వేదిక మీద ఆమె ప్రకటించారు. నేను పేరుకు మాత్రమే పార్టీకి గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నాను. నాకు తెలియకుండానే నా పేరుతో ప్రకటనలు విడుదల అవుతున్నాయి. అలాంటప్పుడు నేను ఆ పార్టీకి గౌరవ అధ్యక్షురాలిగా ఉండి కూడా ఉపయోగం లేదు. అంటూ వేదికపై నాడు విజయమ్మ ప్రకటించడం విశేషం.
జగన్, షర్మిలకు మనస్పర్థలు
ఈ నేపధ్యంలోనే అన్న జగన్, చెల్లి షర్మిల మధ్య మనస్పర్థలు వచ్చి, చెల్లెలు షర్మిల తెలంగాణకు వెళ్లి పోయారు. అక్కడ వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీని స్థాపించి అధికార కేసీఆర్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ స్థాయిలో ఆందోళనలు నిర్వహించారు. షర్మిలకు అండగా తల్లి విజయమ్మ ఉంటూ వచ్చారు. తర్వాత షర్మిల వైఎస్‌ఆర్‌ తెలంగణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. అన్న జగన్‌కు వ్యతిరేకంగా 2024 ఎన్నికల్లో ప్రచారం ప్రారంభించారు. ఎప్పటికైనా ఈ రాష్ట్రానికి కాంగ్రెస్‌పార్టీనే అవసరమని తన నాన్న పేరును తన అన్న జగనే కావాలని ఎఫ్‌ఐఆర్‌లో చేర్పించారని, ఇందులో కాంగ్రెస్‌ కుట్ర లేదని ప్రజలకు చెబుతూ వస్తున్నారు. కడప పార్లమెంటుకు కాంగ్రెస్‌ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఆమె ప్రచారం ప్రారంభించే ముందు తండ్రి వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులు అర్పించి విజయమ్మను కలిసి ఆశీర్వదించమని కోరారు. తన కుమారుడుని ఎలాగైతే గెలిపించి అధికారంలోకి తీసుకొచ్చావో, అలాగే తన కూతురు షర్మిలమ్మను కూడా గెలిపించాలని ఏసు ప్రభువును కోరుకుంటూ షర్మిలను ఆశీర్వదించారు.
వివేకా హత్య ప్రధాన అస్త్రంగా
కడప ఎన్నికల ప్రచారంలో వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య ప్రధాన అస్త్రంగా మారింది. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా కడప నుంచి పోటీ చేస్తున్న అవినాష్‌రెడ్డే హత్యకు కారణమని, సీబీఐ రూపొందించిన రిపోర్టులే ఇందుకు సాక్షమని షర్మిల, ఆమె చెల్లెలు సునీత ప్రజలకు చెబుతూ వచ్చారు.
అమెరికా వెళ్లిన విజయమ్మ
ప్రచారం జరుగుతుండగానే విజయమ్మ అమెరికా వెళ్లి పోయారు. షర్మిల కుమారుడు రాజారెడ్డి వద్ద ఉంటున్నారు. ఏపిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు అన్నా, చెల్లెళ్ల మధ్య జరుగుతున్న జరుగుతున్న రాజకీయ పోరును ఆమె అమెరికా నుంచి ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నారు. మనసులోని బాధను బయట పెట్టక పోయినా, అన్నా చెల్లెళ్ల మధ్య స్పర్థలు రావడం, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్‌ తల్లి, చెల్లెళ్లు, బావను దూరంగా పెట్టడంతో తన బాధను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితికి విజయమ్మ వెళ్లి పోయారు.
ముఖ్యమంత్రి జగన్‌ కొన్ని చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఇప్పుడు మీ కుటుంబం అంతా ఎందుకు కలిసి లేరని ప్రశ్నిస్తే నేను, నా భార్య, నా పిల్లలే కదా ఫ్యామిలీ అని చెప్పడం విశేషం. రెండు రోజుల క్రితం షర్మిల కడపకు కాంగ్రెస్‌ పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ రాజశేఖర్‌రెడ్డి బిడ్డగా కొంగు చాటి ఓట్లు అడగడం బాధగా ఉందని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో విజయమ్మ షర్మిలకు ఓట్లేసి గెలిపించాలని అమెరికా నుంచి వీడియో చేసి పంపడం విశేషం.
Read More
Next Story