ఎన్నికల్లో అప్పుడప్పుడు దుర్ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఎన్నికల సమయంలో పోలింగ్‌కు ముందు అనారోగ్యం వశాత్తు లేదా యాక్సిడెంట్లు వంటి సంఘటనలు చోటు చేసుకొని అభ్యర్థులు ప్రాణాలు కోల్పోతుంటారు. సరిగ్గా అలాంటి దుర్ఘటనే కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజక వర్గంలో చోటు చేసుకుంది. 2014 ఎన్నికల సమయంలో ఇదే సంభవించింది. నాడు ప్రచారం జోరుగా సాగుతోంది. నామినేషన్‌ల ప్రక్రియ కూడా పూర్తి అయింది. అభ్యర్థులు నామినేషన్‌లు కూడా దాఖలు చేశారు. స్వీకరణ గడువు ముగిసింది. ఇక నామినేషన్‌ల ఉపసంహరణ ప్రక్రియ కూడా పూర్తి అయింది. ఇక పోలీంగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియలు మాత్రమే మిగిలాయి. మే 7న పోలీంగ్, మే 16న ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది. వీటికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది. సరిగ్గా నామినేషన్‌ల ఉపసంహరణ తర్వాత రోజు చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో శోభా నాగిరెడ్డి దుర్మరణం చెందారు.
ప్రమాదం ఇలా
శోభానాగిరెడ్డి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా ఆళ్లగడ్డ నుంచి రంగంలోకి దిగారు. నామినేషన్‌లు కూడా దాఖలు చేశారు. శోభానాగిరెడ్డి సీనియర్ పొలిటీషియన్ కావడంతో ఆళ్లగడ్డతో పాటు ఇతర నియోజక వర్గాలకు వైఎస్‌ఆర్‌సీపీ తరఫున ప్రచారానికి వెళ్లే వారు. అందులో భాగంగా 2014 ఏప్రిల్ 23న వైఎస్‌ఆర్‌సీపీ అధినేత సోదరి వైఎస్ షర్మిల నంద్యాలలో జనభేరి సభ నిర్వహించారు. అందులో శోభానాగిరెడ్డి కూడా పాల్గొని క్రియా శీలకంగా వ్యవహరించారు. రాత్రి సుమారు పదిన్నర గంటల సమయంలో శోభానాగిరెడ్డి వైఎస్ షర్మిలకు వీడ్కోలు పలికిన తర్వాత ఆమె ఆళ్లగడ్డకు బయలు దేరారు. నంద్యాల నుంచి ఆళ్లగడ్డకు సుమారు 42కిమీ దూరం ఉన్న రోడ్డు మార్గంలో తన డస్టర్ వాహనంలో ఆమె బయలు దేరారు. దీబగుంట్ల సమీపంలోని జాతీయ రహదారిపైన స్థానిక రైతులు ధాన్యం ఆరబోసి ఉన్నారు. అదే రోడ్డుపైన స్పీడుగా వస్తున్న ఆమె వాహనం అదపు తప్పి బోల్తాపడింది. దీంతో వాహనం లోపల నుంచి శోభానాగిరెడ్డి ఎగిరిపడ్డారు. దీంతో పక్కటెముకలకు తీవ్ర గాయాలపాలైన ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లారు. హుటాహుటిన ఆమెను నంద్యాలలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితులు విషమించడంతో అక్కడ నుంచి హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఏప్రిల్ 24 ఉదయం శోభానాగిరెడ్డి మరణించారు.
17వేల మెజారిటీతో
అభ్యర్థి శోభానాగిరెడ్డి మరణించినా నిబంధనల ప్రకారం పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. ముందుగానే శోభానాగిరెడ్డి నామినేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో ఆళ్లగడ్డకు ఎన్నికలు నిర్వహించారు. టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన గంగుల ప్రభాకరరెడ్డి కంటే 17వేలకు పైచిలుకు ఓట్ల మెజారిటీతో శోభానాగిరెడ్డి గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. శోభానాగిరెడ్డి మరణించినా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజక వర్గ ప్రజలు ఆమెకు ఓట్లేసి గెలిపించడం విశేషం.
1996లో రాజకీయాల్లోకి ఎంట్రీ
నాటి ఉమ్మడి కర్నూలు జిల్లాలోని సీనియర్ రాజకీయ నాయకుల్లో భూమా శోభానాగిరెడ్డి ఒకరు. భూమ నాగిరెడ్డి ఆమె భర్త. 1996లో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. 1997లో జరిగిన ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1999లో జరిగిన ఎన్నికల్లో కూడా ఆళ్లగడ్డ నుంచే టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. తర్వాత నంద్యాల పార్లమెంట్‌కు మారారు. 2004లో నంద్యాల పార్లమెంట్‌కు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడి పోయారు. తర్వాత ఆమె పార్టీ మారారు. టీడీపీని వీడీ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009లో అదే పార్టీ అభ్యర్థిగా ఆళ్లగడ్డ నుంచి బరిలోకి దిగిన ఆమె 27వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం అయిన తర్వాత వైఎస్‌ఆర్‌సీపీలోకి వెళ్లారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లోను ఆమె ఆళ్లగడ్డ నుంచి గెలుపొందారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగానే ఆమె 2014 ఎన్నికల్లో బరిలోకి దిగారు.