
రావణాసురుడికి 9 తలలేనా..!
రావణాసురుని 10 తలల్లో ఒకటి మాయమైంది. ఈ విగ్రహ తయారీదారుడితో పాటు ముక్కంటి ఆలయ పాలకమండలి అధికారుల నిర్లక్ష్యం భక్తుల మనోభావాలను దెబ్బతీశాయి.
ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్- తిరుపతి
రావణాసురుడికి 10 తలలు ఉంటాయనేది పండితులకే కాదు పామరులకు కూడా తెలుసు. విగ్రహం తయారు చేసిన స్థపతి, అర్చకులకు ఆ మాత్రం ఈ జ్ఞానం లేకుండా పోయింది. దాతల పొరబాటు, ధర్మకర్తల మండలి నిర్లక్ష్యం, పదితలల రావణాసురుడు కాస్తా తొమ్మిది తలల రావణుడిగా మారిపోయాడు.
పాలకమండలి చైర్మన్ సభ్యులు దేవస్థానం సిబ్బంది రావణాసురుడి విగ్రహంలోని పది తలల్లో ఒకటి లేదనేది ఏమాత్రం గమనించకుండా దాతలకు స్వామి అమ్మవార్ల దర్శనాలు చేయించి తీర్థప్రసాదాలు అందించారు. భక్తులు గమనించి ఈ విషయం చెప్పిన తర్వాత నాలిక కరుచుకున్న పాలకమండలి, దేవస్థానం అధికారులు తిరిగి ఆ పల్లకిని దాతలు తిరిగి అప్పగించి మరో తల అతికించి తీసుకురావాలని పంపించారు. పురాణాలు, ఇతిహాసాలపై అధికారులు, శ్రీకాళహస్తీశ్వరయ్య పండితులు సిబ్బందికి కూడా అవగాహన లేకుండా పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
దేశంలోని జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటిగా. భూకైలాస్ గా విరాజిల్లుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయం వద్ద ఈ అపశృతి చోటుచేసుకుంది. .శ్రీకాళహస్తి దేవస్థానం లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. మార్చి ఆరో తేదీన రావణాసురుడి వాహన సేవ జరగనుంది. ఇందుకోసం హైదరాబాద్ కు చెందిన జ్యోతి, శ్రీకాళహస్తి సమీపంలోని ఊరందూరు గ్రామానికి చెందిన ధర్మయ్య సహకారంతో రావణాసురుడి పల్లకి వాహనాన్ని తయారు చేయించారు.
ఆ వాహనంలో రావణాసురుడికి 9 తలలుమాత్రమే ఉండడం గమనించని శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరాలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు పల్లకి వాహనం వద్ద ఫోటోలకు ఫోజులిచ్చారు. విగ్రహాన్ని తయారుచేసే సమయంలో స్థపతి, వాహనం అందుకున్న ధర్మకర్తల మండలి సిబ్బంది తప్పును గ్రహించలేకపోయారు.
కొసమెరుపు: శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయానికి రావణాసురుని విగ్రహాన్ని అందజేసే సమయంలో విగ్రహ రూపశిల్పి కుమార్, స్వామివారి వాహన సేవలో నిత్యం తలమునకలుగా ఉండే దేవస్థానం ఇంజనీరింగ్ శాఖ అధికారులు, వర్క్ ఇన్స్పెక్టర్ సూర్య ప్రతాప్, పసుపులేటి కామేశ్వరరావు, పరిచారకులు చందు శర్మ కూడా ఉన్నారు.
Next Story