
వానల్లేక కంది పోతున్న కంది రైతు
చినుకు పడక వేరుశనగ రైతు చింత!
ఆంధ్రప్రదేశ్ లో మే నెలలో కురిసిన తొలకరి వానలకు వేసిన పంటలు కునారిల్లుతున్నాయి. వర్షాభావంతో బావురంటున్నాయి. విత్తిన వేరుశనగ చేలు నెర్రెలు బారుతున్నాయి. కంది, పత్తి పంటలు వాన చినుకుల కోసం ఎదురుచూస్తున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 50 రోజులు కావొస్తున్నా వానజాడ కానరాక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
జూలై మూడో వారం వచ్చినా ఆశించిన స్థాయిలో వర్షాలు పడడం లేదు. ఖరీఫ్ సీజన్‌లో సాధారణ వర్షపాతం 575 మిల్లీమీటర్లు కాగా, ఇప్పటి వరకు 100 ఎంఎంకు మించలేదు. 30 శాతానికి పైగా లోటు వర్షపాతం నమోదైంది. 9 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా, 13 జిల్లాల్లో లోటు, 4 జిల్లాల పరిధిలో అత్యధిక లోటు వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో జూలై 18 నుంచి వరుసగా మూడు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ ప్రకటించడం కాస్తంత ఊరట కలిగించే విషయం.
ఈ నెలాఖరు వరకు ఇదే స్థితి కొనసాగేలా కన్పిస్తోంది. ఒక డ్రై స్పెల్ (పొడి వాతావరణం) అంటే వరుసగా 21 రోజుల పాటు వానలు లేకపోవడం. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై దాదాపు 45 రోజులు కావస్తోంది. దాదాపు 153 మండలాల్లో ఒకటి కంటే ఎక్కువగా డ్రైస్పెల్స్ ఏర్పడ్డాయి. నెల్లూరుతో సహా రాయలసీమ జిల్లాల్లో 98, కోస్తా జిల్లాల్లో 37, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో 9, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 5, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 4 చొప్పున మండలాల్లో ఒకటి కంటే ఎక్కువగా నమోదైన డ్రైస్పెల్స్ సాగుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
సాగు నామమాత్రమేనా...
ఖరీఫ్ సాధారణ పంటల సాగు విస్తీర్ణం 80 లక్షల ఎకరాలు. ఈ ఏడాది ఖరీఫ్‌లో 86.47 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్దేశించారు. 38.87 లక్షల ఎకరాల్లో వరి, 14.30 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 14.10 లక్షల ఎకరాల్లో పత్తి, 9.35 లక్షల ఎకరాల్లో అపరాల సాగు లక్ష్యంగా అంచనా వేశారు. జూలై మూడో వారం వచ్చినా పంటల సాగు కనీసం 15 శాతం దాటలేదు. 12 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగయ్యాయి. 5 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడగా, 4 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. మిగిలిన పంటలన్నీ కలిపి 3 ఎక్షల ఎకరాలు దాటలేదు.
నెల్లూరు జిల్లాలో మాత్రమే 1.27 లక్షల ఎకరాలు సాగు లక్ష్యం కాగా, ఇప్పటికే రికార్డు స్థాయిలో 2 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. నెల్లూరు తర్వాత తిరుపతిలో 80 శాతం, కర్నూలులో 40 శాతం విస్తీర్ణంలో పంటలు సాగ య్యాయి. మిగిలిన ఏ జిల్లాలోనూ 15–20 శాతం దాటలేదు. గోదావరి, కృష్ణా డెల్టాల కింద సాగునీరు ఇచ్చామని గొప్పలు చెబుతున్నా.. ఒక్క తూర్పు గోదావరిలోనే 20 శాతం విస్తీర్ణంలో పంటలు సాగవ్వగా, మిగిలిన జిల్లాల్లో 1–10 శాతం లోపే ఉన్నాయి.
కష్టాల్లో వేరుశనగ సాగు
ఖరీఫ్ సీజన్‌లో వరి తర్వాత అత్యధికంగా సాగయ్యేది వేరుశనగ పంట. రాయలసీమ జిల్లాల్లో నూటికి 70–80 శాతం విస్తీర్ణంలో ఈ పంటే సాగవుతుంది. ఏటా 18 లక్షల ఎకరాల్లో సాగయ్యే ఈ పంటను ఈ ఏడాది 14.30 లక్షల ఎకరాలకు కుదించారు. సాధారణంగా ఈ పంట సాగు జూలై నెలాఖరులోగా పూర్తవుతుంది. కానీ ఈ ఏడాదిలో ఇప్పటికీ పట్టుమని 2 లక్షల ఎకరాల్లోనూ విత్తనం వేయని దుస్థితి. వరి, వేరుశనగ తర్వాత ఎక్కువగా సాగయ్యేది పత్తి. గతేడాది ఆశించిన ధరలు లేకపోవడంతో ఈసారి పత్తి సాగుపై రైతులు విముఖత చూపారు. దీంతో ఇప్పటి వరకు 4 లక్షల ఎకరాల్లోనే పత్తి సాగైంది.
వాడిపోతున్న పత్తి, వేరుశనగ..
వర్షాధారిత ప్రాంతాలలో సాగు చేసిన ప్రత్తి, వేరు శనగ, అపరాలు ఎండి పోతున్నాయి. కాలువల క్రింద ఎద పై సాగు చేసిన వరి, కొన్ని ప్రాంతాలలో వరి నారు మడులు నీరందక ఎండి పోతున్నాయి.
కంది, వేరుశనగ జరగవలసిన సాధారణ సాగు కంటే తక్కువ జరిగినది.
గత ఖరీఫ్ లో 16/7/2024 నాటికి జరిగిన సాగు కంటే ఈ ఖరీఫ్ లో 16/7/2025 నాటికి లక్ష ఎకరాల్లో సాగు తగ్గింది. ఈ సీజన్ లో ఇప్పటికి 9,67,484 హెక్టార్లలో పంటలు వేయాల్సి ఉంటే ఇప్పటికి 7,21,014 హెక్టార్లలో పంటలు వేసినట్టు వ్యవసాయ శాఖ వారం వారం విడుదల చేసే నివేదికలో పేర్కొంది.
నంద్యాల, సత్య సాయి, అనంతపురం, అన్నమయ్య, కడప, చిత్తూరు, పల్నాడు, బాపట్ల, గుంటూరు, కృష్ణా, కోనసీమ, కాకినాడ జిల్లాలలో సాగు తగ్గింది.
రాష్ట్రంలో69.26% మంది రైతుల సరా సరి భూమి ఒక ఎకరం. ఆ తరువాత 19.31% మంది రైతుల సరాసరి భూమి 3.5 ఎకరాలు. రాష్ట్రంలో 88.57% మంది రైతులు ఈ సన్న, చిన్న కారు రైతులే. వీరిలో చాలా మంది రైతులు స్వయంగా భీమా ప్రీమియం చెల్లించ లేక కవరేజ్ కి రారు..
ప్రధాన మంత్రి ఫసల్ బీమాలో కరువు మూలం గా సాగు జరగకపోతే 25% నష్ట పరిహారం ఇవ్వాలి అనే నిబంధన ఉండేది. ప్రస్తుతం ఈ నిబంధన తొలగించారని చెబుతున్నారు. ఈ కారణాల మూలం గా లోటు వర్షపాత జిల్లాలలోని రైతులు తీవ్రంగా నష్ట పోతారు.ఈ రోజుకు రాష్ట్రం మొత్తం సగటు లోటు వర్ష పాతం -32.49% నమోదైనది. ఈ ఖరీఫ్ లో ప్రకృతి అనుకూలించక రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో రైతుల పరిస్థితి తీవ్ర ఆందోళన కరంగా ఉన్నది.
ఓ మోస్తరు వర్ష సూచన..
ఇటువంటి పరిస్థితుల్లో రైతులకు కాస్తంత ఊరట కలిగించే అంశాన్ని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జూలై 18న ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
ఇక 19న ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
•శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
జూలై 20న కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
పరిస్థితులు అనుకూలించి వర్షాలు పడితే రైతులు ఊపిరి పీలుస్తారు. లేకుంటే ఇబ్బందులు పడక తప్పదని రైతులు వాపోతున్నారు.
Next Story