కుప్పం నుంచి నేను నిల్చుందామనుకుంటున్నాను, నాకు ఓటేస్తారా? అంటూ భువనేశ్వరి మాట్లాడిన మాటలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఊరికే అన్నానన్నా సోషల్‌ మీడియా ఊరుకోలేదు.


‘నిజం గెలవాలి యాత్రలో మిమ్మల్ని అందర్ని చూసి కుప్పంకు వచ్చిన తరువాత ఇప్పుడు నాకొక కోరిక కలిగింది. చంద్రబాబునాయుడును 35 ఏళ్ల నుంచి ఆయనపై నమ్మకంతో ఎమ్మెల్యేగా చేశారు. అవునా కాదా.. (జనం నుంచి అవును అంటూ చప్పట్లు) ఇప్పుడు నాకొక కోరిక కలిగింది. ఆయన్ను కొంచెం రెస్ట్‌ తీసుకోమని నేను నిల్చుందామనుకుంటున్నా. సో.. ఎవరికి చంద్రబాబునాయుడు కావాలో చేతులు ఎత్తండి. అందరు చేతులు ఎత్తారు. నాకూ.. (జనం భువనేశ్వరికి కూడా చేతులు ఎత్తారు) ఇద్దరు కుదరదు కదమ్మా.. ఎవరో ఒక్కలే ఉండాలి. నేను ఊరికనే అంటున్నా. నేను ఏది చేసినా నా మనసుకు తోచే ది చేస్తా’ను అన్నారు నారా భువనేశ్వరి.

నారా భువనేశ్వరి తమాషాకే అన్నప్పటికీ తన మనసులో మాట బయట పెట్టారనే ప్రచారం జోరందుకుంది. ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఆమె మాటలు హాట్‌ టాపిక్‌గా మారాయి.
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చంద్రబాబును ఉద్దేశించి పదేపదే ఆయన వయసు మీరింది. 70 ఏళ్ల వయసులో కూడా ఇంకా సీఎం పదవి కావాలా? కుప్పంలో ఆయన్ను ఓడించి తీరుతాం అని ప్రతిజ్ఞలు ఒక పక్క..
ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ శాసనసభలో అడుగు పెట్టనని భీష్మ ప్రతిజ్ఞ చేసిన చంద్రబాబు మరోపక్క.. నిలిచిన నేపథ్యంలో నారా భువనేశ్వరి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భువనేశ్వరి తమాషాకే అన్నానని తర్వాత చెప్పినప్పటికీ ఆమె చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీశాయి.
దేశ రాజకీయాల్లో భార్యా భర్తలు చక్రం తిప్పారు..


భారతదేశ రాజకీయాల్లో భార్యా భర్తలు రాజకీయాల్లో చక్రంతిప్పిన సంఘటనలు లేకపోలేదు. పైగా ఇది కొత్తేమీ కాదు. బీహార్‌లో నాడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న లాలూ ప్రసాద్‌ యాదవ్‌ గడ్డి కుంభకోణం కేసులో జైలుకు పోవాల్సి వచ్చినప్పుడు ఆయన భార్య రబ్రీదేవి సీఎం బాధ్యతలు చేపట్టారు. కొన్నేళ్లపాటు అధికార చక్రం తిప్పారు.
తమిళనాడులో ఎంజీ రామచంద్రన్‌ చనిపోయినప్పుడు ఆయన భార్య జానకీ రామచంద్రన్, ఆయన చెలికత్తె జయలలిత పోటీ పడ్డారు. నాడు జానకి పైచేయి సాధించి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. అయితే కేవలం 23రోజులు మాత్రమే ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పటి రాజీవ్‌గాంధీ ప్రభుత్వం ఆమెకు మెజారిటీలేదని దించేసింది. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో ఆమె ఓడిపోవడంతో రాజకీయాలను వదిలిపెట్టారు. జయలలిత తర్వాత సీఎం అయ్యారు.
ఒరిస్సాలో నందిని సత్పతి జూన్‌ 1972 నుంచి డిసెంబరు 1976 వరకు ఒడిశా ముఖ్యమంత్రిగా ఉన్నారు. భర్త దేవేంద్ర సత్పతి పార్లమెంట్‌ సభ్యులుగా గెలిచారు. విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిన నందిని ముఖ్యమంత్రి అయ్యారు.
భార్యా భర్తల్లో ఒకరు పార్లమెంట్‌కు, ఒకరు అసెంబ్లీకి ఎన్నికైన ఘటనలు ఉన్నాయి. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఎన్‌ ఉత్తంకుమార్‌రెడ్డి ఉండగా ఆయన భార్య ఎన్‌ పద్మావతి కోదాడ ఎమ్మెల్యేగా ఉన్నారు.
తాజాగా జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌సోరెన్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వాళ్లు అరెస్ట్‌ చేస్తారని వచ్చినప్పుడు ఆయన భార్య హేమంత్‌ సోరెన్‌ పేరు తెరపైకి వచ్చింది.
మాజీ ముఖ్యమంత్రి నెదురుమల్లి జనార్థన్‌రెడ్డి వారసత్వాన్ని ఆయన భార్య రాజ్యలక్ష్మి తీసుకున్నారు. భూమా నాగిరెడ్డి, ఆయన భార్య పార్లమెంట్, అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన టంగుటూరి అంజయ్య భార్య మణెమ్మ ఎంపీగా ఎన్నికైంది. దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి భార్య వైఎస్‌ విజయ్మ కూడా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
ఇలాంటివన్నీ చూస్తుంటే చంద్రబాబుకు రెస్ట్‌ ఇచ్చి కుప్పం నుంచి భువనేశ్వరి పోటీ చేద్దామని అనుకుంటున్నారా? అని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రాంతీయ పార్టీలో ఒకరి తరువాత ఒకరు రాజకీయ వారసత్వం తీసుకోవడం కామన్‌.
ఓటర్లను కాస్తంత నవ్వించేందుకేనా...
మొదటిసారిగా రాజకీయాలు మాట్లాడటం మొదలు పెట్టిన నారా భువనేశ్వరి ఓటర్లను కాస్తంత నవ్వించేందుకు ఇలా మాట్లాడి ఉంటారని అనుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల చాలా సభల్లో మహిళలు ఇన్నేళ్లుగా ఎందుకు రాజకీయాల్లోకి రాలేదని ప్రశ్నిస్తే నాకు ఇష్టం లేదని సమాధానం ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబును జైల్లో పెట్టడం వల్ల నేను రాజకీయ సభల్లో పాల్గొనాల్సి వస్తోందన్నారు. ఇంత కరాఖండిగా సమాధానాలు ఇచ్చిన భువనేశ్వరి నేను ఊరికే అంటున్నానని, ఏది చేసినా నా మనస్సుకు నచ్చిందే చేస్తానని చెప్పడం విశేషం.
Next Story