
కాకినాడ పేరెందుకు మార్చాలీ? చరిత్ర, వారసత్వాల మధ్య పోటీ ఎందుకు?
సత్యలింగ నాయకర్ vs పిఠాపురం రాజా – పేరుమార్పు చర్చ
కాకినాడ జిల్లా పేరు మార్పు ప్రతిపాదనపై వివాదం ముసురుకుంది. చారిత్రక, భౌగోళిక కారణాలతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పేరు మార్పుపై ప్రభుత్వం సందిగ్ధంలో పడింది.
“ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ద్వారం”గా పిలిచే కాకినాడ ఎంతో ఘన చరిత్ర, సుదీర్ఘ వారసత్వం ఉంది. 500 ఏళ్ల చరిత్ర కాకినాడ (కో-కెనడా) సొంతం. కాకినాడ చరిత్ర అంటే సముద్ర వాణిజ్యం, విద్యా విస్తరణ, పరిశ్రమలు. ఈ మూడింటి సమ్మేళనం. ఓవైపు చరిత్రాత్మక వారసత్వమున్న నగరం, మరోవైపు ఆధునిక పరిశ్రమ–వాణిజ్య కేంద్రం.
ప్రశాంతతకు మారుపేరు. పెన్షనర్స్ పేరడైజ్. అటువంటి కాకినాడ పేరు మార్పు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇప్పుడు జిల్లాల పునర్ వ్యవస్థీకరణతో కాకినాడ జిల్లా పేరు తెరపైకి వచ్చింది. ఒక వర్గం సత్యలింగ నాయకర్ జిల్లాగా మార్చాలంటుంటే మరో వర్గం పిఠాపురం మహారాజా పేరు పెట్టాలని, ఇంకొందరైతే అసలు పేరు మార్చకూడదనే వాదిస్తున్నాయి. ఈ ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరాయి. పేరు మార్చకూడదనే వాళ్లలో కాకినాడ సిటీ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా ఉంది.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడతో విడదీయరాని అనుబంధం ఉన్న మహానుభావులు ఎందరో ఉన్నారు. పేదల విద్యాభివృద్ధి కోసం రూ.కోట్ల విలువైన ఆస్తులను దానం చేసిన ప్రముఖులున్నారు. ఆ జాబితా చాలా పెద్దది కూడా. అందరూ విశాల హృదయులే. పిఠాపురం రాజా రావు వెంకట కుమార మహీపతి సూర్యారావు బహుదూర్, మల్లాడి సత్య లింగ నాయకర్, స్వాతంత్య్ర సమరయోధులు, సాహితీ వేత్తలు మహర్షి బులుసు సాంబమూర్తి, జ్యోతుల వెంకయ్య, సీతారామ్మూర్తి, విజ్జపురెడ్డి, మంత్రిప్రగడ, పైండా, పైడా తదితర వంశీయులు ఈ జాబితాలో ఉంటారు.
స్వాతంత్య్రానంతర తరాలలో దివంగత పంతం పద్మనాభం, ఆగర్భ శ్రీమంతుడు సీవీకే రావు, కేఎస్‌ఆర్ మూర్తి, జ్ఞానానంద కవి, రఘుపతి వెంకటరత్నం నాయుడు, కృత్తివెంటి పేర్రాజు పంతులు, మద్దూరి అన్నపూర్ణయ్య, దుర్గాబాయి దేశ్‌ముఖ్, మెక్‌లారెన్ దంపతులు, విశ్వవిజ్ఞాన మదీనా కబీర్ షా వంటి మహనీయులు ఎందరో ఉన్నారు. ఇంతమందిలో ఇప్పుడు ప్రముఖంగా వినపడుతున్న రెండు పేర్లలో ఒకటి సత్యలింగం నాయకర్, రెండు పిఠాపురం రాజా.
ఎవరీ పిఠాపురం రాజా...
పిఠాపురం రాజా రావు వెంకట కుమార మహీపతి సూర్యారావు బహుదూర్. ఈయన దానం చేసిన వేల ఎకరాల్లో ఇప్పుడు అనేక పాఠశాలలు, కళాశాలలు, సత్రాలు నడుస్తున్నాయి. తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తులను ఆయన ప్రజల మేలు కోరి ఎంతో ఉదారంగా దానం చేశారు. అనేక విద్యాసంస్థలు ఇప్పటికీ ఆయన పేరిటే ఉన్నాయి.1884లోనే ఆయన పేరిట కళాశాల ఏర్పాటైంది. ఇప్పుడదే పీఆర్ గవర్నమెంట్ కాలేజ్.
సత్యలింగ నాయకర్ ఎంతటి వారంటే..
కాకినాడ సమీపాన కోరంగి వద్ద బలహీనవర్గాల కుటుంబంలో జన్మించిన మల్లాడి సత్యలింగ నాయకర్ స్వశక్తితో కష్టపడి పైకి వచ్చారు. అమ్మ, నాన్న చనిపోతే మేనమామ వద్ద పెరిగారు. 12 ఏళ్ల వయస్సులో కోరంగిలోని ఓడ రేవులో పని చేస్తూ రంగూన్ వెళ్లి పెద్ద కాంట్రాక్టర్ గా ఎదిగారు.
పిల్లలు లేకపోవడంతో సుబ్రహ్మణ్య నాయకర్‌ను దత్తత తీసుకున్నారు. రూపాయి జీతానికి ఒక అధికారి నెలంతా పని చేసే రోజుల్లో నాయకర్ రూ.8 లక్షలు సంపాదించి 1,800 ఎకరాలు కొనుగోలు చేసి ఎంఎస్‌ఎన్ చారిటీస్ సంస్థకు ఇచ్చి, ఈ ప్రాంతంలో విద్యాభ్యున్నతికి బాటలు వేశారు. నాడు బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో ఆయన రాసిన మరణ శాసనంలో ‘నా వంశంలో ఎవరైనా ప్రాణాలతో లేకుంటే నా యావదాస్తిని ప్రభుత్వానికి అప్పగించేందుకు వీలు లేదు. అవసరమైతే స్థానిక సంస్థలకు అప్పగించాలి’ అని రాశారు. తన సేవలతో ప్రతి ఒక్కరి హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్నారు.
కాకినాడకు చెందిన మహర్షి బులుసు సాంబమూర్తి తనకున్న కోట్ల విలువైన యావదాస్తిని దేశ స్వాతంత్య్రం కోసం అఖిల భారత కాంగ్రెస్ మహాసభలకు ధారాదత్తం చేశారు.
ఆగర్భ శ్రీమంతుడు సీవీకే రావు అప్పట్లోనే విదేశాల్లో ఐఏఎస్ చదువుకుని స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్నారు. కాకినాడ మున్సిపల్ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా రెండు పదవులూ ఏకకాలంలో నిర్వహించారు. రెల్లి వృత్తి పనివార్లను గత సంస్కృతి నుంచి విముక్తికి బాటలు వేసి, వినూత్న సంస్కరణలతో నిస్వార్థ ప్రజాజీవితానికి నిలువుటద్దంగా నిలిచారు.
కాకినాడ పేరును అలాగే ఉంచితే...
కాకినాడ జిల్లాకు ఒకవేళ పేరు మారిస్తే పిఠాపురం రాజా లేదా మల్లాడి సత్యలింగ నాయకర్ పేర్లు పెట్టాలనే డిమాండు ప్రధానంగా వినపడుతోంది. వీళ్ల పేర్లతో సాధన సమితులు కూడా ఏర్పాటయ్యాయి. సభలు సమావేశాలు నడుస్తున్నాయి.
ఎంతోమంది మహానుభావులున్నారని వారిలో ఎవరి పేరు పెట్టినా మరొకరిని తక్కువ చేసినట్టే అవుతుందని కాకినాడ సిటీ వెల్ఫేర్ అసోసియేషన్ కు చెందిన రమణారావు అన్నారు. పేరు మార్పు వద్దన్నది వారి వాదన.
పిఠాపురం మహారాజా రావు సూర్యారావు బహాదూర్ చేసిన సేవల్ని పరిగణలోకి తీసుకుని ఆయన పేరు పెట్టడం సముచితమేనని మాజీ ఎంపీ అయ్యప్పరెడ్డి పేర్కొన్నారు.
ఆదిత్య యూనివర్శిటీ వ్యవస్థాపకుడు నల్లమిల్లి శేషారెడ్డి కూడా ఈ వాదనను బలపరుస్తున్నారు. "కాకినాడ జిల్లాకు పిఠాపురం మహారాజా రావు సూర్యారావు బహదూర్ పేరు పెట్టాలి. విద్యాభివృద్ధితో పాటు దళిత జనోద్ధరణకు విశేషంగా కృషి చేశారు. తెలుగు భాషా వికాసానికి శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు తయారు చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. తెలుగు ప్రాంతంలో సాంస్కృతిక వికాసానికి దోహదం చేసి ఆయన పేరును జిల్లాకు పెట్టడం సముచితం" అని నల్లమిల్లి శేషారెడ్డి చెప్పారు.
సత్యలింగ నాయకర్ పేరు పెడితే...
"వారసత్వంగా వచ్చిన ఆస్తులను మాత్రమే దానం చేసే రోజుల్లో స్వశక్తితో సంపాదించిన యావదాస్తినీ పేద విద్యార్థుల అభ్యున్నతికి నాయకర్ ధార పోశారు. పేద కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో నాయకర్ చేసిన దానం వెలకట్టలేనిది. జిల్లాకు ఆయన పేరు పెట్టడంలో సందేహించాల్సిందేమీ లేదు" అన్నారు నాయకర్ సాధన సమితీ ఉపాధ్యక్షుడు పంపన రామకృష్ణ.
ఎంఎస్ఎన్ చారిటీస్ పరిరక్షణ సమితీ అధ్యక్షుడు మల్లాడి రాజు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. "సత్యలింగం నాయకర్ భూములు విరాళంగా ఇచ్చి, విద్యాసంస్థలు స్థాపించారు. MSN PG కాలేజ్, MSN జూనియర్, డిగ్రీ కాలేజీలు, ఆనంద్ వాచనాలయం వంటి సంస్థలు ఆయన కృషి ఫలితమే"నని చెప్పారు.
కాకినాడకు ఆ పేరు ఎలా వచ్చిందంటే..
ఈ ప్రాంతాన్ని 500 ఏళ్లు పరిపాలించిన కాకనందివాడ వంశీయుల పేరిట కాకినాడ పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతారు. చాళుక్యుల కాలం నుంచీ ప్రసిద్ధి చెందిన కాకనందివాడ వంశీయులు ఇప్పుడు లేకపోయినా.. పూర్వ చరిత్రకు సంబంధించిన కాకినాడ పేరును యథాతథంగా ఉంచాలనే డిమాండు కూడా ఉంది. కాకనందివాడ వంశీయుల తరువాత ఫ్రెంచ్, డచ్, బ్రిటిష్ వారు పాలించిన సమయంలో కాకినాడకు కో-కెనడాగా కూడా దేశ, విదేశాల్లో ఘన చరిత్ర ఉంది. చరిత్రాత్మక కాకినాడ 160 ఏళ్ల మున్సిపాలిటీగా ప్రసిద్ధి.
కాలక్రమంలో కాకినాడ పెద్ద పరిశ్రమల కేంద్రంగా ఎదిగింది. నేడు NFC (గ్రీన్‌కోర్), గోదావరి ఫర్టిలైజర్స్ (ప్రస్తుతం కోరొమాండల్), ONGC బేస్ పోర్ట్, దీప్ వాటర్ పోర్ట్, ఆంకరేజ్ పోర్ట్, అనేక పెద్ద పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి.
విద్యాపరంగానూ కాకినాడకు ప్రాధాన్యత ఉంది. మొదటి పాలిటెక్నిక్ కాలేజీ ఇక్కడే ఏర్పాటైంది. కాకినాడ JNTU, కాకినాడ ఇంజినీరింగ్ కాలేజీ
PR గవర్నమెంట్ కాలేజ్ (1884), తరువాత జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU-K), MSN కాలేజ్ వంటి ప్రసిద్ధ విద్యాసంస్థలు ఇక్కడ ఏర్పడ్డాయి.
ఇటువంటి పరిస్థితుల్లో కాకినాడ “పేరుమారిస్తే అనవసరమైన గందరగోళం వస్తుంది” అని ప్రజా సంఘాలు చెబుతున్నాయి. JNTU Kakinada వంటి సంస్థలు, విద్యార్థుల సర్టిఫికెట్లు, రికార్డులు అన్ని మార్చుకోవాల్సి వస్తుంది. భవిష్యత్తులో విద్యార్థులు higher studies లేదా ఉద్యోగాల కోసం వెళ్ళినప్పుడు రికార్డు వెరిఫికేషన్‌లో సమస్యలు వస్తాయని వాదిస్తున్నాయి.
పేరు మార్పు వద్దు..
దేశ విదేశాల్లో ఘన చరిత్ర కలిగిన కాకినాడ పేరు మార్పునకు కూటమి ప్రభుత్వం అంగీకరించకూడదని మున్సిపల్ మాజీ కార్పొరేటర్ దూసర్లపూడి రమణరాజు అన్నారు. "చరిత్రాత్మక కాకినాడ పేరు రాజమహేంద్రవరం కంటే కూడా ముందుగా అవతరించింది" అని చెప్పారు.
"మా జిల్లాకు కాకినాడ పేరు ఉంటేనే బాగుంటుంది. మెజార్టీ ప్రజల అభిప్రాయం కూడా ఇదే అనుకుంటున్నాను " అని చెప్పారు కాకినాడ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కొటికలపూడి సత్య శ్రీనివాసరావు. “పేరుమార్పు వల్ల విద్య, పరిశ్రమ, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటాయి” అనే వాదన కూడా ఉందన్నారు.
చరిత్ర, వారసత్వం ఒకవైపు – ప్రజా సౌలభ్యం, పరిపాలనా ఇబ్బందులు మరోవైపు – ఇరువైపులా వాదనలు బలంగానే ఉన్నాయి. ఏ దిశలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందో అన్నది ఆసక్తికరం.
Next Story