ఆంధ్రప్రదేశ్‌లో కమ్యూనిస్ట్‌లను కలుపుకుని ఎన్నికలకు వెళదామా? బీజేపీ వారితో ముందుకు సాగుదామా? అనేది తెలుగుదేశం పార్టీలో మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా ఉంది.


ఏపీలో బీజేపీతో కలిసి ముందుకు సాగేందుకు టీడీపీ ఆసక్తి చూపుతోంది. చంద్రబాబు వచ్చి మాట్లాడితే పొత్తు పెట్టకుని ఏపీలో టీడీపీతో కలిసి పోటీ చేసేందుకు మాకు ఎటువంటి అభ్యంతరం లేదని బీజేపీ ఇప్పటికే తేల్చి చెప్పింది. టీడీపీ కూటమితో కలిసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీ వారే చొరవ తీసుకోవాలని, తాము అడిగిన సీట్లు తప్పకుండా ఇవ్వాలని బీజేపీ చెబుతూ వస్తున్నది. రెండు రోజుల క్రితం జరిగిన టీడీపీ, జనసేన నేతల భేటీలో ఈ విషయం ప్రధానంగా చర్చకు వచ్చింది. పవన్‌ కళ్యాణ్‌ను బీజేపీ వారితో మాట్లాడాల్సిందిగా చంద్రబాబు చెప్పారు. పవన్‌ కళ్యాణ్‌ ఆపనిలోనే ఉన్నారు.

ఏదో ఒకటి చెప్పండి..
తాము మీతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. మాకు ఏ విషయం చెబితే ఆ తరువాత ఏమిచేయాలో ఆలోచించుకుంటామని కమ్యూనిస్టులు చంద్రబాబును అడుగుతున్నారు. చంద్రబాబు మాత్రం తేల్చి చెప్పలేదు. బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నందున కమ్యూనిస్టుల వ్యవహారంపై కాస్త ఆచీతూచీ అడుగులు వేస్తున్నారు.
బాబు బీజేపీతో కలిస్తే...
చంద్రబాబు బీజేపీతో కలిస్తే తెలుగుదేశం, జనసేన కూటమికి దూరంగా ఉండాలనే ఆలోచనలో కమ్యూనిస్టులు ఉన్నారు. బీజేపీని మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న కమ్యూనిస్టులు ఆ పార్టీ పరిసరాలకు కూడా వెళ్లేందుకు సిద్దంగా లేరు. తెలుగుదేశం పార్టీ నాన్చుడు ధోరణి వల్ల ఇండియా కూటమిలో త్వరగా కలిసి పనిచేసే అవకాశానికి దూరంగా ఉండాల్సి వస్తోందని కమ్యూనిస్టులు బాధపడుతున్నారు. ప్రధానంగా సీపీఐ వారు మొదటి నుంచీ వైఎస్సార్‌సీపీని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అందువల్ల తెలుగుదేశం పార్టీ ఒక్కటే కమ్యూనిస్టులను ఆదుకునే అవకాశం ఉందని, అదికూడా దగ్గరకు రానవ్వకుంటే కాంగ్రెస్‌తో కలిసి ముందుకు సాగక తప్పదనే ఆలోచనలో వున్నారు.
అసెంబ్లీలో ప్రాతినిద్యం కోసం..
ఒక పార్లమెంట్, మూడు అసెంబ్లీ స్థానాలు ఇస్తే చాలని సీపీఐ భావిస్తున్నది. మరో రెండు సీట్లు ఎక్కువ అడగాలనే ఆలోచనలో సీపీఎం వారు ఉన్నారు. అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే తెలుగుదేశం పార్టీతో ముందుకు సాగితేనే మంచిదనే ఆలోచన కమ్యునిస్టుల్లో ఉంది. ఆంధ్రపదేశ్‌లో జరగనున్న ఎన్నికల్లో విచిత్ర కలయికలు జరుగుతున్నాయి. లోపాయికారీగా కాంగ్రెస్‌ను తెలంగాణలో సపోర్టు చేసిన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పట్టించుకోవడం లేదు. పవన్‌ కళ్యాణ్‌ మాత్రం కేంద్ర అధికార పార్టీ కూటమిలోనే కొనసాగుతున్నారు. నా స్థాయి ఏమిటో ప్రధాన మంత్రిదగ్గరకు వస్తేకాని మీకు తెలుస్తుందనే బెట్టులో పవన్‌ కళ్యాణ్‌ ఉన్నారు.
పవన్‌కు ఎన్నిసీట్లు ఇస్తారు? కమ్యూనిస్టులను ఏమి చేస్తారు? బీజేపీ వారితో ఎలా ముందకు వెళతారు? అనే అంశాలపై ఇంకా తెలుగుదేశం పార్టీ ఒక క్లారిటీకి రాలేదు. ఎన్నికల నోటిపికేషన్‌ సమయం దగ్గర పడుతుండటంతో టీడీపీతో కలిసి సాగాలనుకునే పార్టీల్లో టెన్షన్‌ పెరిగి పోతున్నది.
Next Story