ఆయా రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన ప్రతి సారి అధికారుల బదిలీలు ఆంధ్రప్రదేశ్‌లో పరిపాటిగా మారి పోయింది. ఉమ్మడి రాష్ట్రంలో నాటి ప్రభుత్వాలు ఇలాంటి పోకడలకు దారులు వేసినా.. రాష్ట్ర విభజన అనంతరం ఈ పోకడలు విపరీతమై పోయాయి. 2019 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి వాతావరణం పీక్‌కు చేరింది. వారికి నచ్చిన వారికి, అనుకూలమైన వారికి మంచి పోస్టింగ్‌లు ఇచ్చుకోవడం, నచ్చని వారికి, గత ప్రభుత్వాలకు అనుకూలంగా వ్యవహరించిన వారికి ప్రాధాన్యత లేని పోస్టులు ఇవ్వడం, లూప్‌లైన్ పోస్టులు ఇవ్వడం, అవసరమైతే ఎలాంటి పోస్టులు ఇవ్వకుండా వెయిటింగ్‌లో పెట్టడం ప్రభుత్వ అధినేతలకు పరిపాటిగా మారిపోయింది. దీనికి గతంలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం కానీ అంతకంటే ముందుకు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం కానీ మినహాయింపులేమీ లేవు. ఈ అంశంలో మాత్రం ఇరు ప్రభుత్వాలు పోటీలు పడ్డారనే టాక్ అధికార వర్గాల్లో వ్యక్తం అవుతోంది.
తాజాగా అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇదే అంశంపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రిగా మరో సారి బాధ్యతలు చేప్టిన నారా చంద్రబాబు నాయుడు అధికారుల బదిలీపై కసరత్తు ఇప్పటికే ముమ్మరం చేశారు. ప్రమాణ స్వీకారానికి ముందే ఒక అంచనాకు వచ్చిన చంద్రబాబు, బాధ్యతలు స్వీకరించిన అనంతరం దీనిపై పూర్తి స్థాయి దృష్టి కేంద్రీకరించారు. అధికారుల బదిలీలపై ఇప్పటికే ఒక అవగాహన కలిగి ఉన్న సీఎం చంద్రబాబు ఇదే అంశంపై శనివారం తన నివాసంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్ ప్రసాద్, డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా, సీఎంఓ అధికారులతో కూడా భేటీ అయ్యారు. దీంతో ప్రక్షాళన పేరుతో ప్రతి శాఖలోను అధికారుల బదిలీలు తప్పవనే టాక్ అటు అధికార వర్గాలు, ఇటు కూటమి శ్రేణుల్లోను వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో ఆందోళనలు మొదలయ్యాయి. ఎవరిని ఎక్కడకి బదిలీ చేస్తారు.. ఎవరిని లూప్‌లైన్ పోస్టుల్లో వేస్తారు.. ఎవరిని ప్రాధాన్యత లేని బాధ్యతలు అప్పగిస్తారనే ఆసక్తికర చర్చ అధికార వర్గాల్లో సాగుతున్నాయి. బదిలీల అనంతరం వచ్చే పోస్టులను బట్టి నచ్చితే కొత్త పోస్టుల్లో కొనసాగుతామని.. లేకుంటే లాంగ్ లీవుల్లో వెళ్తామని.. ఉద్యోగాలైతే పోవు కదా అని చర్చించుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే ఎవరికి ఏ పోస్టులు ఇవ్వాలనే దానిపై సీఎంఓ అధికారులు ఒక జాబితాను రూపొందించినట్లు అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. మరి ముఖ్యంగా గత జగన్ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగాను, జగన్ ప్రభుత్వానికి అనుకూలంగాను వ్యవహరించిన అధికారుల జాబితాను కూడా ఇప్పటికే సిద్ధం చేసినట్లు టాక్ నడుస్తోంది. వీరిలో సీనియర్ ఐఏఎస్ అధికారులైన ప్రవీణ్ ప్రకాశ్, శశిభూషణ్‌కుమార్, అజయ్ జైన్, శ్రీలక్ష్మి, గోపాలకృష్ణ ద్వివేది, మురళీధర్‌రెడ్డితో పాటు ఎన్నికల సమయంలో బదిలీలైన వారు, కలెక్టర్లుగా, ఎస్పీలుగా పని చేసిన వారిలో ఎక్కువ మంది పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు టాక్ నడుస్తోంది. ఇక సీనియర్ ఐపీఎస్ అధికారులైన మాజీ డీజీపీ రాజేంధ్రనాథ్‌రెడ్డి, నిఘా విభాగం చీఫ్‌గా పని చేసిన పీ సీతారామాంజనేయులు, సిట్ ఇన్‌చార్జీగా వ్యవహరించిన కొల్లి రఘురామిరెడ్డి, సీఐడీ చీఫ్‌లుగా పని చేసిన ఎన్ సంజయ్, పీవీ సునీల్‌కుమార్, పాలరాజ్ వంటి పలువురు సీనియర్ అధికారులపై బదిలీ వేటు తప్పదనే చర్చ సాగుతోంది. ఎలాంటి పోస్టింగ్‌లు ఇవ్వకుండా జీఏడికి రిపోర్టు చేసే విధంగా చర్యలు తీసుకోవచ్చనే చర్చ సాగుతోంది.