శ్రమ కావ్యగానం శ్రమ గొప్పదనం చూపించే అద్దం
x

'శ్రమ కావ్యగానం' శ్రమ గొప్పదనం చూపించే అద్దం

సుద్దాల అశోక్ తేజ ఆ కావ్యం వెనుక చరిత్రను స్పర్శించారు. శ్రమ జగతికి మూలం, కష్టానికి తగ్గ విలువ రావాలని వక్తలు అభిప్రాయపడ్డారు.


శ్రమ గొప్పతనాన్ని మరోసారి వెలుగెత్తి చాటింది శ్రమ కావ్యం. శ్రమ జగతికి మూలమని, కష్టానికి తగ్గ విలువ రావాలని వక్తలు ఈ సభలో అన్నారు. ఈ సభలో ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ, ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో తాను భవన నిర్మాణ మేస్త్రి వద్ద అసిస్టెంట్ గా పని చేస్తూ. శని ఆదివారాల్లో కూలి పనులకు వెళ్లి వచ్చే డబ్బుతో చదువుకున్నానని తన పాత జీవితాన్ని ఆవిష్కరించారు. 2016లో శ్రమకావ్యం రాయడానికి పదేళ్ల కిందటే ఆ ఆలోచన పుట్టిందన్నారు.

తిరుపతి నగరం వేమన విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రముఖ సినీ రచయిత సుద్దాల అశోక తేజ శ్రమకావ్యం గానం కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఆ సంస్థ కార్యదర్శి మల్లారపు నాగార్జున అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి సిఇటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సభలో సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ, "తాపీ మేస్త్రీ" పనికి వెళ్లేటప్పుడే నాకు శ్రమ గొప్పతనం తెలిసింది. అప్పట్నుంచి శ్రమజీవులు పై పాటలు, కవితలు రాస్తూనే ఉన్నా" అని చెప్పారు.

"ప్రేమపై ఇప్పటివరకు సినీ గేయాలలో 10 వేల పాటలు వచ్చి ఉంటాయని, ప్రేమ జీవితంలో ఒక భాగం. జీవితమంటే గొప్పది శ్రమ" అని తెలిపారు. భూమి పుట్టినప్పటి నుంచి ఎన్ని చెమట చుక్కలు భూమిపై రాలి ఉంటాయో, వాటన్నిటికీ లెక్కలు కడితే, శ్రమపై ఎన్ని లక్షల కోట్లు పాటలు రావాలన్నారు. ఆ ఆలోచన నా ఈ కావ్యానికి పునాది వేసిందని తెలిపారు. ఈ సభలో.. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి హెచ్ నరసింగరావు మాట్లాడుతూ విశాఖపట్నంలో మొదటిసారిగా శ్రమ కావ్యగానం ఏర్పాటు చేశామన్నారు. అప్పటినుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 57 కావ్య గానాలు జరిగాయని తెలిపారు. శ్రమ జగతికి మూలం. ఇది జగమెరిగిన సత్యం అన్నారు. పాలకులు ఆదాని అంబానీలే మూలం అనేలా వ్యవహరిస్తుండడం విడ్డూరంగా ఉందన్నారు.
"మహాభారతం కావ్యంలో నిండు సభలో ద్రౌపదికి వస్త్రాపహరణం జరిగితే శ్రీకృష్ణుడు చీర ఇచ్చినందుకు దేవుడయ్యాడు. అలాంటిది శ్రమ దారబోసి చీరలు తయారు చేస్తున్న చేనేత కార్మికుడు దేవుడు కాడా"? అని ప్రశ్నించారు.
కార్మికవర్గానికి ఆయుధం
శ్రమ దోపిడి ఎలా ఉందో ప్రస్తుతం చూస్తున్నామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి అన్నారు. ఫిబ్రవరి 21వ తేదీ ప్రపంచ మాతృభాష దినోత్సవమే కాదు, 176 ఏళ్ల క్రితం కమ్యూనిస్టుల ప్రణాళికలు విడుదలైన రోజు అని గుర్తు చేశారు. కార్మిక వర్గానికి ఆయుధాన్ని అందించిన రోజన్నారు. తిరుమలలో అనునిత్యం సేవలందిస్తూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ, ఆధ్యాత్మిక నగరాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నది, శేషాచల అడువులను పచ్చంగా పరిరక్షిస్తున్నది ఫారెస్ట్ కార్మికులనని, స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు అందుకుంటున్న అధికారులు, పాలక మండలి పెద్దలు కాదని తెలిపారు. కానీ అలాంటి కార్మికులకు గుర్తింపు లేదు, వారి శ్రమకు విలువ లేదు, పదిమంది చేసే పనిని 25 మంది కార్మికులు లేకపోతే చేపిస్తున్నారు, ఒక రెగ్యులర్ ఉద్యోగికి ఇచ్చే వేతనముతోనే పదిమంది కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు ఇస్తున్నారని తెలిపారు. మూడు రోజుల క్రితం తిరుపతి కేంద్రంగా జరిగిన ఇంటర్నేషనల్ సదస్సులో ఆదాయంపై చర్చి జరిగిందని, ఆధ్యాత్మికతను అడ్డుపెట్టుకొని కార్పొరేట్ శక్తులకు కోట్లాది రూపాయలు ఎలా దోచి పెట్టాలి అనే తీరున జరిగిందన్నారు. ఈ తరుణంలో శ్రమను గుర్తిస్తూ సుద్దాల అశోక తేజ రచించిన శ్రమ కావ్య గానాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సభాధ్యక్షులు మల్లారపు నాగర్జున మాట్లాడుతూ, 58వ శ్రమ కావ్య గానంలో సమాజ పరిణామక్రమాన్ని అణువణువునా అధ్యయనం చేసిన సుద్దాల అశోక్ తేజ నిరసించారన్నారు. సమాధుల ఉన్న సమస్త కావ్యాలకు శ్రమ గొప్పతనాన్ని, మూలాన్ని జోడించి ఈ కావ్యం ద్వారా సుద్దాల అశోక్ తేజ వెల్లడించారన్నారు. అనంతరం తన గానం ద్వారా తానే రచించిన శ్రమ కావ్యాన్ని సుద్దాల అశోక తేజ గానం చేసి, ప్రేక్షకులను అల్లరింపజేశారు, ఆలోచింపజేశారు. వేమన విజ్ఞాన కేంద్రం గౌరవ అధ్యక్షులు టెంకాయల దామోదరం, సుద్దాల అశోక్ తేజ సతీమణి నిర్మల, పలువురు కవులు రచయితలు, సాహితివేత్తలు పాల్గొన్నారు.
Read More
Next Story