పలాస జీడిపాకం ఈసారి ఎవరికో...
x
గౌతు శిరీష, సీదిరి అప్పలరాజు

పలాస జీడిపాకం ఈసారి ఎవరికో...

ఓవైపు రాష్ట్ర మంత్రి… మరోవైపు 'సర్దార్' మనవరాలు… పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. అయితే గెలుపు ఎవరిని వరిస్తుంది...? ఓటమి ఎవరి తలుపు తడుతుంది...?


(తంగేటి నానాజీ)

విశాఖపట్నం: రాష్ట్ర రాజకీయాల్లో శ్రీకాకుళం జిల్లా నేతలది ఎప్పటికీ కీలక పాత్రే. నాటి సర్దార్ గౌతు లచ్చన్న నుంచి ఎర్రంనాయుడు, ధర్మాన ప్రసాదరావు, కిమిడి కళా వెంకట్రావు, కిల్లి కృపారాణి, తమ్మినేని సీతారాం, అచ్చెన్నాయుడు ఇలా కాకలు తీరిన నేతలు, రాష్ట్ర రాజకీయాలను శాసించిన వారు ఇక్కడి వారే. సిక్కోలు రాజకీయాలను అవపోసన పట్టిన వారే.. అలాంటి శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో రసవత్తర రాజకీయ పోరుకు తెరలేచింది. ఓవైపు పలాస సిట్టింగ్ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు పోటీ చేస్తుండగా.. మరోవైపు సర్దార్ గౌతు లచ్చన్న మనవరాలు గౌతు శిరీష పోటీ చేస్తున్నారు. మంత్రి సీదిరి తన క్యాడర్‌లో ఉత్సాహాన్ని నింపుతూ ప్రజలతో పార్టీ మమేకమయ్యేలా పక్కా యాక్షన్ ప్లాన్‌తో దూసుకుపోతున్నారు. తనను ఓసారి గెలిపించిన పలాస నియోజకవర్గ ప్రజలు రెండోసారీ ఆదరిస్తారని ఆశపడుతున్నారు. రాజకీయ వారసత్వంతో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా గౌతు శిరీష ఎన్నికల బరిలో దిగారు. తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు.

పలాస హిస్టరీ....

శ్రీకాకుళం జిల్లాలో పలాస నియోజక వర్గానికి ప్రాధాన్యత ఉంది. వాణిజ్య పరంగా పలాస పేరు చెప్పగానే జీడి పప్పు బ్రాండ్ గుర్తుకు వచ్చినట్లే రాజకీయ చైతన్యానికి కూడా ఈ నియోజకవర్గం ప్రసిద్ధి. పలాస నియోజకవర్గం 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడింది. 2009లో తొలి ఎన్నికలు జరగ్గా... కాంగ్రెస్ పార్టీకి చెందిన జగన్నాయకులు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో టీడీపీ అభ్యర్థి గౌతు శ్యామసుందర శివాజీ ఎన్నిక కాగా… 2019 లో ప్రస్తుత మంత్రి సీదిరి అప్పలరాజు ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గంలో సర్దార్ గౌతు లచ్చన్న వారసుల ఆధిపత్యం కొనసాగేది. గౌతు శ్యామసుందర శివాజీ పునర్విభజనకు ముందు ఈ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎన్నికయ్యారు. నియోజకవర్గాల విభజన తర్వాత ఒకసారి ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన కుమార్తె శిరీష.. టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. అయితే 2019 ఎన్నికల్లో సర్దార్ వారసులను ఓడించి డాక్టర్ సీదిరి అప్పలరాజు అనూహ్యంగా వైసీపీ ప్రభంజనంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో పలాస నియోజకవర్గంలో అప్పలరాజు, శిరీష నడుమ భీకర పోరు జరగనుంది.

అభ్యర్థుల బలాబలాలు...

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి వైసీపీ అభ్యర్థి సీదిరి అప్పలరాజు తన దృష్టినంతా నియోజకవర్గ అభివృద్ధిపై కేంద్రీకరించారు. ఈ ప్రాంత కిడ్నీ రోగుల కోసం పలాసలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు కిడ్నీ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేశారు. రహదారులు వేయించారు. తాను చేసిన అభివృద్ధే తనను మళ్ళీ గెలిపిస్తుందని మంత్రి అప్పలరాజు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష గత ఎన్నికల్లో 16,500 ఓట్ల తేడాతో సీదిరి చేతిలో ఓటమిపాలయ్యారు. తాతలు, తండ్రుల నుంచి ఆ కుటుంబానికి నియోజకవర్గంలో మంచి పేరు ఉంది. గౌతు లచ్చన్న వారసురాలుగా ప్రజల ఆదరణ మెండుగానే ఉంది. తాత, తండ్రి నుంచి అవపోసన పట్టిన రాజకీయ చతురతను ప్రదర్శిస్తున్నారు. గత ఎన్నికల్లో తీవ్ర విమర్శలు చేసిన జనసేన ప్రస్తుతం ఈమెకు మద్దతు ఇవ్వడం ప్లస్ పాయింట్‌గా మారింది.

సామాజిక వర్గ సమీకరణాలు....

పలాస నియోజకవర్గంలో 1,04,109 మంది ఓటర్లు ఉండగా… మత్స్యకార, కాళింగ, కాపు, బలిజ సామాజిక వర్గాలు అత్యధిక ఓటర్లుగా ఉన్నారు. సీదిరి అప్పలరాజు మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాగా… శిరీష బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. మరో ఛాన్స్ అంటూ మంత్రి అప్పలరాజు… ఒక్క ఛాన్స్ అంటూ శిరీష... ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. పలాస నియోజకవర్గం ఓటర్లు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాల్సిందే.

16 వేలే తేడా...

గత ఎన్నికల్లో గౌతు శిరీష 16 వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఆ ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రత్యర్థులుగా పోటీ చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో పాటు బీజేపీ కూడా కలిసి పోటీ చేస్తోంది. ఉమ్మడి అభ్యర్థిగా శిరీష పలాస నుంచి పోటీ చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు.. మూడు పార్టీల ఓటు బ్యాంకు శిరీషకు కలిసి వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.



Read More
Next Story