‘బంగారు బాట’లో సింగరేణి
x

‘బంగారు బాట’లో సింగరేణి

కీలక ఖనిజాల అన్వేషణకు కాంట్రాక్ట్ దక్కించుకున్న సింగరేణి


సింగరేణి సంస్థ కీలక ఖనిజరంగంలోకి ప్రవేశించాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం కార్యరూపం దాల్చింది. కర్ణాటకలోని దేవ దుర్గ్ లోని బంగారం, రాగి గనుల అన్వేషణ లైసెన్స్ కోసం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని గనుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఆన్లైన్ వేలంలో 37.75 శాతం రాయల్టీ ని కోట్ చేయడం ద్వారా సింగరేణి ఎల్-1 బిడ్డర్గా నిలిచినట్లు సంస్థ సీఎండీ శ్రీ ఎన్.బలరామ్ మంగళవారం తెలిపారు. తద్వారా కీలక ఖనిజాన్వేషణలో సింగరేణి శుభారంభం చేసినట్లు అయిందన్నారు. సింగరేణిని ఇతర రంగాల్లోకి విస్తరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా చేస్తున్న ప్రయత్నంలో తొలి విజయాన్ని సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. రానున్న ఐదేళ్లలో ఈ గనుల్లో అన్వేషణను పూర్తి చేస్తామన్నారు.

త్వరలోనే కర్ణాటకలో సింగరేణి అన్వేషణ....
కర్ణాటక దేవదుర్గ్ లోని బంగారం, రాగి నిక్షేపాలు ఉన్న ఈ ప్రాంతంలో సింగరేణి అన్వేషణ విభాగం ఆధ్వర్యంలో త్వరలో పరిశోధన చేయనుంది. వివిధ రకాల అన్వేషణల అనంతరం తుది ఫలితాలను కేంద్ర ప్రభుత్వానికి నివేదిక రూపంలో సమర్పించాల్సి ఉంటుంది. అనంతరం కేంద్రం ఈ గనులను మైనింగ్ కోసం వేలంలో వేస్తుంది. ఆ గనులను సింగరేణి లేదా ఇతర సంస్థలు దక్కించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ గనులను మైనింగ్ కోసం దక్కించుకున్న సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీలో 37.75 శాతాన్ని ఆ గని జీవిత కాలం పాటు సింగరేణికి చెల్లించాల్సి ఉంటుంది. ఈ అన్వేషణ కోసం సుమారు 90 కోట్ల రూపాయలు వ్యయం అవుతుండగా.. అందులో రూ.20 కోట్లను కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ గా చెల్లిస్తుంది.
రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అభినందనలు
బొగ్గు మైనింగ్ లో 136 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న సింగరేణి సంస్థ తొలిసారిగా బంగారం, రాగి గనుల అన్వేషణ లైసెన్స్ను వేలం ద్వారా దక్కించుకోవడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు తమ హర్షం ప్రకటించారు. సింగరేణి సంస్థ తనకున్న అపారమైన అన్వేషణ అనుభవం, బొగ్గు తవ్వకం అనుభవంతో కీలక ఖనిజాల అన్వేషణలోనూ దేశంలో ఒక అగ్రగామి సంస్థగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో సింగరేణి అంతర్జాతీయ సంస్థగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సంస్థ సీఎండీ శ్రీ ఎన్.బలరామ్కు, ఉద్యోగులందరికీ అభినందనలు తెలియజేశారు.
మూడు గనుల వేలంలో పాల్గొన్న సింగరేణి...
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 13వ తేదీన మొత్తం 13 కీలక ఖనిజాల అన్వేషణ లైసెన్స్ ల కోసం వేలం ప్రక్రియను ప్రారంభించింది. ఇందులో సింగరేణి సంస్థ పాలుపంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో అన్వేషణకు అనువైన బ్లాక్లపై సింగరేణి నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసి అధ్యయనం చేయడం జరిగింది. అనంతరం మధ్య ప్రదేశ్ లోని పదార్ లోని ప్లాటినమ్ గ్రూప్ ఎలిమెంట్స్ బ్లాక్, ఆంధ్రప్రదేశ్ లోని చంద్రగిరి వద్ద ఉన్న ఒంటిల్లులోని రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ బ్లాక్, కర్ణాటకలోని బంగారం, రాగి బ్లాక్లు తమకు అనువైనవని గుర్తించడం జరిగింది. వీటి కోసం ఈ నెల 13, 14, 19 తేదీల్లో కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ వేలం నిర్వహించింది. ఇందులో ఈ నెల 19వ తేదీన జరిగిన వేలంలో కర్ణాటకలోని దేవదుర్గ్లోని బంగారం, రాగి బ్లాక్ల అన్వేషణ లైసెన్స్ను సింగరేణి దక్కించుకోవడం విశేషం.


Read More
Next Story