నియోజకవర్గం ఒకటే...జిల్లాలు వేరు...
x
Source: Twitter

నియోజకవర్గం ఒకటే...జిల్లాలు వేరు...

ఒకటే నియోజకవర్గం రెండు, మూడు జిల్లాలు... కొత్త జిల్లాల ఆవిర్భావంతో మారిన నియోజకవర్గాల స్వరూపాలు... ఇంతకీ ఆ నియోజకవర్గాలు ఎక్కడున్నాయి...?



(తంగేటి నానాజీ)

విశాఖపట్నం: రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన ప్రక్రియ నియోజకవర్గాల స్వరూపాన్ని మార్చేసింది. అప్పటివరకు ఒకే జిల్లాలో ఉండే నియోజకవర్గాలు రెండు మూడు జిల్లాలకు విస్తరించాయి. దీంతో ఆయా నియోజకవర్గాల పై పట్టు సాధించేందుకు అభ్యర్థులు నానా అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలో పార్లమెంట్ నియోజకవర్గాల ప్రాతిపదికగా ప్రభుత్వం 2022 లో నూతన జిల్లాలను ఏర్పాటు చేసింది. దీంతో ఉత్తరాంధ్రలో విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ఉమ్మడి జిల్లాలు ఆరు జిల్లాలుగా రూపాంతరం చెందాయి. విశాఖపట్నం జిల్లా నుంచి కొత్తగా అనకాపల్లి,అల్లూరి జిల్లాలు ఏర్పడగా... శ్రీకాకుళం విజయనగరం కలిపి మూడు జిల్లాలుగా విభజించబడ్డాయి.అక్కడ మన్యం జిల్లా కొత్తగా ఏర్పడింది.

రెండు జిల్లాల్లో పెందుర్తి...

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన నియోజకవర్గాల పునర్విభజనలో పెందుర్తి , సబ్బవరం, పరవాడ మండలాలతో పాటు పెద గంట్యాడ మండలంలోని కొంత భాగంతో పెందుర్తి నియోజకవర్గం ఆవిర్భవించింది. 2009, 14, 19 శాసనసభ ఎన్నికల్లో పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం విశాఖ జిల్లాలోనే ఉండేది. 2022లో జరిగిన జిల్లాల పునర్‌వ్యవస్థీకరణలో పెందుర్తి మండలాన్ని విశాఖ జిల్లాలోనూ, పరవాడ, సబ్బవరం మండలాలను అనకాపల్లి జిల్లాలోనూ చేరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే రెండు జిల్లాలకు ప్రాతినిధ్యం వహించాల్సి వస్తోంది. రెండు జిల్లాలు కావడంతో అభివృద్ధి పనులు, నిధుల మంజూరులో జాప్యం ఏర్పడుతుంది.

ఈ మండలమే కీలకం....

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఈ నియోజకవర్గంలో 3,02,355 మంది ఓటర్లు ఉండగా.... అందులో 1,85,000 మంది ఓటర్లు పెందుర్తి మండలం నుంచి ఉన్నారు. సబ్బవరం మండలంలో 58,000, పరవాడ మండలంలో 63,000, పెదగంట్యాడ మండలంలో 11 వేల మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం ఓటర్లలో ఒకటికి మూడు వంతులు పెందుర్తిలోనే ఉండడంతో పెందుర్తి మండలం ప్రతి ఎన్నికల్లో కీలకంగా మారుతుంది.

మూడు జిల్లాల్లో అరకు పార్లమెంట్....

అరకు పార్లమెంట్ నియోజకవర్గం మూడు జిల్లాల్లో విస్తరించి ఉంది. అరకు పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో అరకు వ్యాలీ, పాడేరు, రంపచోడవరం, పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ నియోజకవర్గాలు ఉండగా... రంపచోడవరం నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాలోను... అరకు వ్యాలీ, పాడేరు నియోజకవర్గాలు అల్లూరి సీతారామరాజు జిల్లాలోను, పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ నియోజకవర్గాలు మన్యం జిల్లాలోనూ ఉన్నాయి. ప్రతి ఎన్నికల్లో అల్లూరి జిల్లా వాసులే కీలకంగా వ్యవహరిస్తుంటారు.

రెండు జిల్లాల్లో విశాఖ పార్లమెంట్...

విశాఖ పార్లమెంటు నియోజకవర్గం రెండు జిల్లాల్లో విస్తరించి ఉంది. పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాలకు గాను ఆరు నియోజకవర్గాలు విశాఖపట్నం జిల్లాలో ఉండగా... ఒక నియోజకవర్గం విజయనగరం జిల్లా పరిధిలోకి వస్తుంది. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ సెగ్మెంట్ పరిధిలో విశాఖ ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమతో పాటు గాజువాక, భీమిలి, ఎస్.కోట నియోజకవర్గాలు వస్తాయి. ఆరు నియోజకవర్గాలు విశాఖ జిల్లా పరిధిలో ఉండగా... ఎస్ కోట నియోజకవర్గం మాత్రం విజయనగరం జిల్లా పరిధిలో ఉంది.

దీంతో విశాఖ పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులు రెండు జిల్లాల్లో ప్రచారం చేయాల్సి ఉంది. ఉత్తరాంధ్రలో ఇలా పలు నియోజకవర్గాలు రెండు మూడు జిల్లాల్లో విస్తరించి ఉండటంతో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏ జిల్లా నుంచి నిధులు సమకూర్చుకోవాలో తెలియని పరిస్థితి. ఇక ఎన్నికల్లో పోటీ చేయాలంటే రెండు మూడు జిల్లాల నాయకులను ప్రసన్నం చేసుకోవలసిన పరిస్థితి అభ్యర్థులకు ఏర్పడుతోంది.



Read More
Next Story