
ప్రతీకాత్మక చిత్రం
విజయనగరాన్ని షేక్ చేసిన సిరాజ్ బాంబు కుట్ర?
వాళ్ల నాన్న ఏఎస్ఐ, వాళ్ల అన్న కానిస్టేబుల్. దారితప్పిన సిరాజ్. ఇతని బ్యాంక్ లాకర్‌లో రూ.42 లక్షలు: టెర్రర్ ఫండింగ్ మూలాలు నిగ్గు తేల్చే పనిలో ఎన్‌ఐఏ..
నిన్నటి వరకు సింధూర్ తో హోరెత్తిన విజయనగరం ఇప్పుడు ఉగ్రవాదుల జాడతో హడలెత్తుతోంది. ఎంతో నిద్రాణంగా, ప్రశాంతంగా ఉండే విజయనగరంలో ఇప్పుడు ఏ మూలన విన్నా పాకిస్తాన్ కు తోడ్పడే ఉగ్రవాదుల ఏజెంట్ ఒకడు ఇక్కడ ఉండడమా అనేదే చర్చ.. ఓ పక్క ఎన్.ఐ.ఎ. ఏజెంట్ల తనిఖీలు మరోపక్క పోలీసుల ఆకస్మిక తనిఖీలతో విజయనగరం బజార్లు కలవరపడుతున్నాయి.

పేలుడు పదార్థాలు, వాటికి అవసరమైన పీవీసీ పైపు ముక్కలు, ఇతర సామగ్రి కొని ఐఈడీ (ఇంప్రవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్) తయారీకి ఉపక్రమించిన సమయంలో పోలీసులు మెరుపుదాడి విజయనగరం వాసి, ఉగ్రవాద భావజాలం ఉన్న సిరాజ్‌ను పట్టుకోవడమే ఇందుకు కారణం. ఇంతకీ ఎవరీ సిరాజ్ ఉర్ రహమాన్, ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏమిటీ, పాకిస్తాన్ ఏజెంట్లకు ఎలా ఉపయోగపడుతున్నాడనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా ఉంది.
సిరాజ్ విజయనగరం వాసి. సిరాజ్ కుటుంబం ఆబాద్‌వీధిలో ఉంటోంది. సిరాజ్ మాత్రం వేరుగా బాబామెట్టలో ఉంటున్నారు. వాళ్ల నాన్న అసిస్టెంట్ పోలీసు సబ్ ఇనస్పెక్టర్. ఆయన అన్న కూడా పోలీసు కానిస్టేబులే. సిరాజ్ విజయనగరంలోనే ప్రాధమిక విద్యను పూర్తి చేశాడు. ఆ తర్వాత బీటెక్ చేశాడు. ఇటీవలి కాలంలో చాల ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసినా సక్సెస్ కాలేదు. తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనయ్యాడు. మానసికంగా కుంగుబాటుకు గురయ్యాడు. ఖాళీగా ఉన్నాడు. చేతిలో ఫోన్ ఉంది. టేబుల్ పై ల్యాప్ టాప్ ఉంది. ఏవేవో బ్రౌజింగ్ చేస్తున్న తరుణంలో సౌదీ కాంటాక్టులు ఏవో వచ్చాయి. వాళ్లు ఇతని మానసికస్థితిని గుర్తించి చిన్నగా తమ ట్రాప్ లోకి లాగారు. అలా లాగిన వాళ్లు ఎక్కడుంటారో తెలియదు. కానీ డబ్బు ఆశ జూపి తమకు కావాల్సిన పని చేయించుకుంటుంటారు. వీళ్లను ఇంగ్లీషులో హ్యాండ్లర్స్ అని పిలుస్తుంటారు. వీళ్లు రకరకాలుగా ఉంటారు. ఒకడు ఉగ్రవాదతత్వాన్నీ బోధిస్తాడు. ఇంకొకడు ఆయుధాల తయారీకి పూనుకునేలా చేస్తాడు. ఇంకొంకడు వాటిని పలానా చోట పేల్చి ప్రయోగం చేయమంటాడు, ఇలా రకరకాలు. వాళ్ల లక్ష్యం భారత్ లో విధ్వంసం, వీళ్ల ఉద్దేశం డబ్బు. అలా పరిచయం అయిన హ్యాండ్లర్లు ఈ సిరాజ్ కి హమాస్, ఆంటీ-ఇస్రాయెల్, హిందుత్వ వ్యతిరేక వీడియోల ద్వారా మతపరమైన ప్రేరణ ఇచ్చినట్లు సమాచారం. ఇస్లామిక్ ఉగ్రవాద ఆలోచనలను ఇతరులకు ప్రచారం చేయడానికి కూడా సోషల్ మీడియా వేదికగా వాడుతున్నట్లు చెబుతున్నారు.
కొన్ని నెలల క్రితం సిరాజ్, హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ సమీర్ అనే వ్యక్తితో పరిచయం పెంచుకున్నాడు. విజయనగరం పోలీసులు ఆదివారం సమీర్‌ను హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి తెలిపిన ప్రకారం, సమీర్ హైదరాబాద్‌లో ఒక మదర్సాలో ఏడో తరగతి వరకు చదివాడు.
సిరాజ్ ఎలా అరెస్ట్ అయ్యాడంటే...
పోలీసులు IED తయారీకి ఉపయోగించే కెమికల్స్‌తో పాటు PVC పైపులు, వైర్లు, ఇతర సామగ్రిని కూడా ఒక పాడుబడిన భవనంలో గుర్తించారు. ఇదే భవనాన్ని సిరాజ్ IED తయారీకి వాడుతున్నట్లు అనుమానం. ఈ బిల్డింగ్ వీజ్జీ స్టేడియానికి వెళ్లే రోడ్డులో ఉంది.
రాజానగర్ వద్ద పేలుడు పదార్థాలు, ఇతర సామగ్రి ఉన్న బ్యాగ్‌తో మోటారుసైకిల్‌పై సిరాజ్ అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకున్నారు. జనసంచారం అధికంగా ఉన్న ప్రదేశంలో ఐఈడీ పేల్చేందుకు వచ్చానని విచారణలో చెప్పాడని సమాచారం. ఆన్‌లైన్‌లో పేలుడు పదార్థాలు ఏప్రిల్ 20, 26, 30 తేదీల్లో సమీపంలోని ఉర్దూ పాఠశాల చిరునామా పేరిట వచ్చినట్లు గుర్తించారు. ఆ తర్వాత రెండు సిమ్ నంబర్లు గల సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పాస్‌వర్డ్‌తో వాటిని ఓపెన్ చేయించారు. అందులో వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, సిగ్నల్, టెలిగ్రామ్ సామాజిక మాధ్యమ యాప్‌లు ఉండడంతో విస్తుపోయారు.

అందులో సిరాజ్‌తో పాటు సమీర్ మధ్య పేలుడు పదార్థాల సేకరణ, ఉపయోగంపై సాగిన చాటింగ్‌ను పరిశీలించారు.
నిఘా ఏజెన్సీల దృష్టి
ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగానికి చెందిన కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగంతో పాటు పలు కేంద్ర, రాష్ట్ర నిఘా సంస్థలు గత ఏడాది నుండి సిరాజ్ ఉర్ రెహమాన్ అనే 29 ఏళ్ల వ్యక్తిపై నిఘా పెట్టినట్లు తెలిసింది. మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేసిన సిరాజ్‌ను విజయనగరం పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు.
గల్ఫ్ నుంచి పనిచేస్తున్న అతని హ్యాండ్లర్‌తో సిరాజ్ ఏడాది నుంచి సోషల్ మీడియాలో టచ్ లో ఉన్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, అతను పోటాషియం నైట్రేట్, అమ్మోనియా, సల్ఫర్ వంటివి ఉపయోగించి తక్కువ శక్తితో పనిచేసే IED తయారీలో ఉన్నాడు. ఈ పరికరాన్ని రిమోట్ ద్వారా నిర్వహించగలిగేలా ఉండేలా అతని హ్యాండ్లర్ వీడియోల ద్వారా శిక్షణ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. అతని వద్ద కనుగొన్న పరికరం ఒక "టెస్ట్ మోడల్" మాత్రమేనని తెలుస్తోంది.
అసలు ఉద్దేశం ఏమిటీ?
ఈ IEDను ఎక్కడ, ఎందుకు పేల్చాలనుకున్నారు అసలు ఉద్దేశ్యం ఏమిటి?, ఎందుకు సిద్ధం చేస్తున్నాడన్నది ఇంకా తెలియరాలేదు. ఈ కేసును ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విచారిస్తోంది.
ఇతని వెనుక లష్కరే తోయ్బా, జైషే మహ్మద్ వంటి పెద్ద ఉగ్రవాద సంస్థల ప్రమేయం ఉందా లేక **ఒంటరిగా పనిచేసే 'లోన్ వుల్ఫ్' అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది.
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, నిందితులు పేలుడు పదార్థాల పరీక్షలు చేసి తరువాత లక్ష్యాన్ని నిర్ధారించే పనిలో ఉన్నట్లు అనుమానం. వీరు రూపొందించిన IEDలు సోషల్ మీడియా ద్వారా హ్యాండ్లర్ ఇచ్చిన శిక్షణ ఆధారంగా రిమోట్ ద్వారా ప్రయోగించదగినవే.
సిరాజ్ పేలుడు పదార్థాల కోసం డబ్బు ఎలా సమకూర్చుకున్నాడనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతని బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నారు.
సిరాజ్ కుటుంబసభ్యుల కదలికలపై దర్యాప్తు సంస్థలు గట్టి నిఘా ఉంచాయి. సిరాజ్ బ్యాంక్ ఖాతాల్లో (Bank Account) భారీగా నగదును గుర్తించారు. కేసు నేపథ్యంలో సిరాజ్ బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశారు. అయితే డీసీసీబీ బ్యాంక్‌లో ఉన్న లాకరు తెరిచేందుకు సిరాజ్ తండ్రి విఫలయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఖాతాను సీజ్ చేయడంతో లాకర్ తెరవటానికి కుదరదని సిరాజ్ తండ్రికి బ్యాంక్ అధికారులు తేల్చి చెప్పారు. ఈ విషయంపై రెండు రోజుల పాటు బ్యాంక్ అధికారులను సిరాజ్ తండ్రి కలిసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఏఎస్‌ఐగా పని చేస్తున్న సిరాజ్ తండ్రితో పాటు కుటుంబ సభ్యుల కదలికలపై దర్యాప్తు సంస్థలు మరింత నిఘా పెట్టాయి.
మూడు రోజులుగా దర్యాప్తు కొనసాగుతోంది. సిరాజ్‌కు చెందిన డీసీసీబీ బ్యాంక్ ఖాతాలో భారీగా నగదు జమ అయినట్లు నిర్ధారణకు వచ్చింది ఎన్‌ఐఏ. సిరాజ్ తండ్రి పేరుతో డీసీసీబీలో ఓ లాకర్ ఉంది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్న దశలో సిరాజ్ తండ్రి బ్యాంక్ తాలూకా లాకర్‌ను తెరిచేందుకు చాలా ప్రయత్నం చేసినప్పటికీ అది కుదరదని, సీజ్ చేయడం జరిగిందని బ్యాంక్ అధికారులు స్పష్టం చేశారు. ఈ ఖాతాలో సుమారు రూ.42 లక్షల వరకు నగదు జమ అయినట్టు గుర్తించారు. సిరాజ్ తండ్రి ఏఎస్‌ఐగా పనిచేస్తుండగా.. సిరాజ్ సోదరుడు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు.
సిరాజ్‌కు 10 బ్యాంక్ అకౌంట్‌లు ఉన్నట్లు సమాచారం. వీటిలో విజయనగరంలోని డీసీసీబీ ఖాతా, అతని తండ్రి పేరుపై ఉన్న లాకర్ గురించి పోలీసులు ఇప్పటికే ఆరా తీశారు. ఎన్‌ఐఏ అధికారులు రెండు రోజులుగా విజయనగరంలోనే ఉంటూ విచారిస్తున్నారు. అన్ని కోణాల్లో ఆరా తీస్తూ సమాచారాన్ని క్రోడీకరిస్తున్నారు. సిరాజ్ సమీప బంధువులు, కుటుంబ సభ్యులు, అతని బ్యాంక్ ఖాతాల లావాదేవీలు, సెల్‌ఫోన్ నంబర్ల వినియోగం, కాల్‌డేటా తదితర విషయాలను మంగళవారం నమోదు చేసుకున్నారు. సిరాజ్ కుటుంబం నివాసం ఉండే ఆబాద్‌వీధి, సిరాజ్ ప్రత్యేకంగా ఉంటున్న బాబామెట్టలోని ఆయన ఇంటిని మరోసారి పరిశీలించినట్లు సమాచారం. అలాగే సయ్యద్ సమీర్ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో ఆర్థిక లావాదేవీలు, మొబైల్ కాంటాక్ట్ నంబర్లపై ఓ స్పష్టతకు వచ్చినట్లు తెలిసింది.
సిరాజ్ కి డబ్బు ఎక్కడి నుంచీ...
సిరాజ్ ఖాతాలో డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది.. ఎవరు జమ చేశారు అనే దానిపై దర్యాప్తు ఏజెన్సీలు దృష్టి సారించాయి. ఈరోజు కూడా దర్యాప్తు కొనసాగుతుంది. సిరాజ్‌కు సంబంధించి సామాజిక మాధ్యమాల ఖాతాలపై కూడా దృష్టి సారించారు. అందులో సిరాజ్ ఎవరితో చాటింగ్ చేశాడు, ఏఏ అంశాలపై ఎవరితో మాట్లాడారు.. ఆంధ్రాతో పాటు తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వీరికి సంబంధించిన నెట్ వర్క్‌ను గుర్తించి వీరు ఎలాంటి సంభాషణలు కొనసాగించారు అనే అంశాలపై దర్యాప్తు సంస్థలు పరిశీలించే పనిలో పడ్డాయి.
ఇదిలా ఉండగా ఉగ్ర లింకుల కేసులో అరెస్ట్ అయిన సిరాజ్, సమీర్‌లు ప్రస్తుతం విశాఖ సెంట్రల్ జైలులో ఉన్నారు. వారిని కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు.
కస్టడీ పిటిషన్‌పై తీర్పు రిజర్వు
సిరాజ్, సమీర్‌లను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ విజయనగరం రెండో పట్టణ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై వాదప్రతివాదనలు విన్న న్యాయాధికారి తీర్పును రిజర్వు చేశారు. దీనిపై బుధవారం తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఈ కేసులో లోతైన విచారణకు నిందితులను పది రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. పేలుళ్ల కుట్రపై నమోదైన కేసులో మరింత సమాచారం సేకరణకు వచ్చిన ఎన్‌ఐఏ అధికారుల బృందం విజయనగరంలోనే మకాం వేసింది. దాదాపు పది మంది అధికారులు బృందాలుగా విడిపోయి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సౌదీలోని అబూత్ ఆలెం అలియాస్ అబు ముసాబ్ తనతో పాటు సమీర్‌కు తరచూ సిగ్నల్ యాప్ ద్వారా ఉగ్రవాద భావజాలాన్ని నూరిపోసేవాడని అంగీకరించాడు.
పోలీసుల అదుపులో వ్యాపారులు..
నగరంలోని కన్యకాపరమేశ్వరి కోవెల ప్రాంతంలో వ్యాపారాలు సాగిస్తున్న ముగ్గురు వ్యక్తులను మంగళవారం రెండో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేలుళ్లకు సంబంధించి వారికి సరకులు అమ్మడంతో స్టేషన్‌కు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
Next Story