ఎన్నికల హింసపై 13 మందితో సిట్ ఏర్పాటు. సీనియర్ ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్‌లాల్ దీనికి హెడ్. ఇక హింసకు కారుకులైన వారి భరతం పట్టినట్లే.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హింసపై విచారణ జరిపించి తగు చర్యలు తీసుకునేందుకు 13 మందితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)ను ఏర్పాటు చేశారు. ఈ నెల 13న జరిగిన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. అనంతపురం జిల్లా తాడిపత్రి, తిరుపతి, చంద్రగిరి, నరసరావుపేట, మాచర్ల నియోజక వర్గాలు ఈ హింసకు కేంద్ర బిందువులయ్యాయి. కారణాలు ఏమిటి అనే దాని కంటే హింసను అరికట్టడంలో పోలీసులు, ఎన్నికల అధికారులు విఫలమయ్యారని తీవ్ర స్థాయిలో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. ఈ ఫిర్యాదులను సీరియస్‌గా పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ పోలీస్ బాస్‌లను ఢిల్లీకి పిలిపించి వార్నింగ్‌లు ఇవ్వడమే కాకుండా రెండు రోజుల్లో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించి విచారణ జరిపి నివేదికను అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సీఎస్, డీజీపీ, నిఘా విభాగం ఇన్‌చార్జి కలిసి ఒక నిర్ణయం తీసుకొని సీనియర్ ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ టీమ్‌లో వివిధ జిల్లాల్లో వివిధ విభాగాల్లో పోలీసు అధికారులుగా పని చేస్తున్న వారిని(ఎస్పీ,డీస్పీ,సీఐ స్థాయి అధికారులు) సభ్యులుగా నియమించారు. ఈ క్షణం నుంచి వారు తమ విచారణను ప్రారంభిస్తారు.