రంగంలోకి దిగిన సిట్.. చర్యలకు అవకాశం
x

రంగంలోకి దిగిన సిట్.. చర్యలకు అవకాశం

ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక సంఘటనలపై దర్యాప్తునకు సిట్ రంగంలోకి దిగింది. తిరుపతి ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదులో అధికారులపై చర్యలకు ఆస్కారం ఉంది.


సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, శాంతి- భద్రతల పర్యవేక్షణలో విఫలమైన అధికారులపై చర్యలు తీవ్రంగా ఉంటాయని సంకేతాలు వెలువడుతున్నాయి. ముందస్తు జాగ్రత్త చర్యలు, సంఘటన తర్వాత నిందితుల అరెస్టులో అనుసరించిన తీరులో లోపాలు సిట్ అధికారుల దర్యాప్తులో బహిర్గతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ నెల 13వ తేదీ పోలింగ్ అనంతరం రాయలసీమ జిల్లాలోని తిరుపతి, తాడిపత్రి, ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానాల పరిధిలో హింస ప్రజ్వరిల్లిన విషయం తెలిసిందే. వాటిల్లో సంచలనం రేకెత్తించిన చిత్తూరు జిల్లా చంద్రగిరి టిడిపి అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం ఘటన జిల్లా ప్రజానీకాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ సంఘటనలో అమాయకులను కూడా నిందితులుగా చేర్చారనే అభియోగాలు ఉన్నాయి. నిందితుల్లో కొందరి తల్లులు " తమ పిల్లలు ప్రతి దాడి చేయడానికి మాత్రమే వెళ్లారు. హత్య చేయడానికి కాదు" అని చెప్పడం ద్వారా ఉచ్చులో ఇరుక్కున్నారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

టిడిపి అభ్యర్థిపై హత్యాయత్నం

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత ఈనెల 14వ తేదీ తిరుపతి విభజిత జిల్లాకు సంబంధించి ఈవీఎంలను తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆవరణలో భద్రపరిచారు. ఆ స్ట్రాంగ్ రూములను పరిశీలించడానికి వెళ్లి తిరిగి వస్తుండగా టిడిపి చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నాని పై వైఎస్సార్సీపీ మద్దతుదారులు మారణాయుధాలతో దాడి చేసిన సంగతి తెలిసిందే. పులివర్తి నాని గన్మెన్ ధరణి కూడా ఈ దాడుల్లో గాయపడ్డారు. పరిస్థితిని చక్కదిద్దే క్రమంలో రెండు రౌండ్లు గాలిలోకి కూడా కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఒక వ్యక్తి పొట్టలోకి బుల్లెట్ దూసుకుని వెళ్లడంతో, అతనిని తమిళనాడులోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం బయటికి పోకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. వైసిపి మద్దతుదారుల దాడిలో గాయపడిన పులివర్తి నాని తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నా అనంతరం, రెండు రోజుల తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇది జరిగిన సంఘటన.

రంగంలోకి దిగిన సిట్

ఈ విషయాలు నిగ్గు తేల్చడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిట్ ఏర్పాటైన విషయం తెలిసిందే. సిట్ బృందంలో సభ్యుడైన ఏసీబీ డిఎస్పి రవి మనోహరాచారి బృందం శనివారం రాత్రి తిరుపతికి చేరుకుంది. ఎస్సై స్థాయిలో తన సర్వీసును ప్రారంభించిన రవి మనోహరాచారి డీఎస్పీ స్థాయిలో కూడా తిరుపతి, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పనిచేసిన అనుభవం ఉంది. ఆదివారం ఉదయం ఆయన శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయంలో జరిగిన దాడికి సంబంధించి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. ఆ రికార్డులను సిట్ అధికారి రవి మనోహర్ ఆచారి క్షుణ్ణంగా పరిశీలించారు. ఎస్వీ యూనివర్సిటీ సీఐ నుంచి ఆయన వివరాలు తెలుసుకున్నారు. సీడీ ఫైల్, ఎఫ్ ఐ ఆర్, తదితర రికార్డులను ఆయన పరిశీలించారు.

అనంతరం సంఘటన జరిగిన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆవరణలో పరిశీలించారు. సంఘటన జరిగిన తీరును అక్కడ ఆయన కొన్ని వివరాలు సేకరించారు. తనను కలిసిన మీడియాతో సిట్ డి.ఎస్.పి రవి మనోహర్ చారి మాట్లాడారు. " ఈ కేసులో అన్ని వివరాలు సేకరిస్తున్నాం. రికార్డులు పరిశీలిస్తున్న. వాటన్నిటిని క్రోడీకరించి, ఐజి కి నివేదిక సమర్పిస్తామని" మాత్రమే చెప్పారు. దర్యాప్తు వివరాలు ఉన్నత స్థాయి అధికారులే మీడియాకు వివరిస్తారని చెబుతూనే.. " ఎఫ్ ఐ ఆర్ నమోదుపై చర్యలు ఉంటాయి" అని స్పష్టం చేశారు. అంతకుమించి మాట్లాడేందుకు ఆయన సుముఖత చూపలేదు.

"సీడీ ఫైల్ (క్రైమ్ డాకెట్ షిట్), ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసిన తీరు నిందితుల అరెస్టు వంటి వివరాలన్నీ ఆయన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఆదివారం ఉదయం పరిశీలించారు. ఆ వివరాలన్నీ నమోదు చేసుకున్నట్లు సమాచారం. " ఎఫ్ ఐ ఆర్ నమోదు పై చర్యలు ఉంటాయి" అనే ఆయన మాటల ద్వారా కేసు నమోదులో, నిందితులను అదుపులోకి తీసుకోవడం, వంటి అనేక అంశాల్లో డొల్లతనం ఉన్నట్లు గుర్తించారా? అనే సందేహాలకు ఆస్కారం ఏర్పడింది. షిఫ్ట్ నివేదిక తర్వాత క్షేత్రస్థాయి అధికారులపై చర్యలు ఉండవచ్చు అనే సంకేతం ఆయన ఇచ్చారు. " చంద్రగిరి నియోజకవర్గంలోని కూచువారి పల్లె గ్రామాన్ని కూడా సందర్శించనున్నట్లు సిట్ అధికారి డిఎస్పిఎస్ రవి మనోహరాచారి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ గ్రామంలో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కార్లను ధ్వంసం చేశారు. మరో గ్రామంలో వైఎస్ఆర్సిపి మద్దతు దారులైన వ్యక్తి నివాసాన్ని దహనం చేశారు. అనే ఆరోపణలు ఉన్నాయి. ఆ గ్రామాలను కూడా సందర్శించి వాస్తవాలను పరిశీలించనున్నట్లు సెట్ డిఎస్పి రవి మనోహరాచారి స్పష్టం చేశారు.

13 మంది నిందితుల అరెస్ట్

తిరుపతి శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయం సమీపంలో చంద్రగిరి టిడిపి అభ్యర్థి పులివర్తి నాని పై కర్రలు, ఇనుప రాడ్లు పెద్ద సుత్తితో హత్యాయత్నానికి పాల్పడ్డారనే అభియోగాలపై 13 మంది నిందితులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారిలో ప్రధమ నిందితుడిగా రామచంద్రాపురం మండలం దిగువ రామాపురానికి చెందిన జడ్పిటిసి సభ్యురాలి భర్త వల్లేటి భానుకుమారరెడ్డి. (భానుప్రకాష్, భాను) రామచంద్రాపురం మండలం నడవలూరు గ్రామానికి చెందిన నడవలూరు గణపతి ( గణపతి రెడ్డి), దిగువ రామాపురం గ్రామానికే చెందిన ముదిపల్లి జానకిరెడ్డి, జానయ్య గారి జయచంద్రారెడ్డి, పొదలకూరు కోదండరాం, బొక్కిసమ్ చిరంజీవి, దండు పుష్పకాంత్ రెడ్డి, ఎద్దుల భాస్కర రెడ్డి, కామసాని సాంబశివారెడ్డి, అప్పన్న గారి సుధాకరరెడ్డి నిందితులుగా చేర్చారు.

వారందరిని కడప కేంద్ర కారాగారానికి తరలించారు. వీరి అరెస్టుపై వారి తల్లులు కొందరు రెండు రోజుల క్రితం మీడియా సమావేశం నిర్వహించారు. తిరుపతి రూరల్ ప్రాంతం శ్రీరామాపురానికి చెందిన వైఎస్ఆర్ సిపి మహిళా నాయకురాలు పుష్ప , ఢిల్లీ రాణి తదితరులు మాట్లాడారు. " మా గ్రామంలో జరిగిన దాడికి ప్రతీకార దాడి చేయడానికి మాత్రమే వెళ్లారు. మినహా టిడిపి అభ్యర్థి పులివర్తి నానిని హత్య చేయడానికి కాదు" అని ప్రకటించడం ద్వారా నేర అంగీకారం జరిగినట్లు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా..

నిందితులపై సందేహాలు

వారితో పాటు మరో ముగ్గురు నిందితులుగా పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేయడం వివాదం అయ్యే పరిస్థితి లేకపోలేదని భావిస్తున్నారు. మిగతా ముగ్గురు నిందితుల్లో.. తిరుపతి రూరల్ మండలం శెట్టిపల్లి ప్రాంతానికి చెందిన పి. హరికృష్ణ, తిరుమలలోని బాలాజీ నగర్ ప్రాంతానికి చెందిన పసుపులేటి రాము, రేణిగుంట మండలం తారకరామా నగర్ కు చెందిన గోగుల కోటయ్య కూడా టిడిపి అభ్యర్థి పులివర్తి నాని పై జరిగిన దాడిలో నిందితులుగా ఉన్నట్లు పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఉన్నారు. అయితే..

అకారణంగా ఇరికించారు

"సంబంధంలేని కేసులో నా కుమారుడిని ఇరికించారు" అని హరికృష్ణ తల్లి, అతని భార్య ఆరోపిస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో లడ్డు పోటు కార్మికుడిగా హరికృష్ణ పనిచేస్తున్నాడని వారు తెలిపారు. పోలీసులు చెబుతున్నట్లు ఈనెల 14వ తేదీ హరికృష్ణ డ్యూటీలో ఉన్నారని వారు చెప్పారు. స్నేహితుల మధ్య జరిగిన గొడవ కారణంగా తిరుమలలో సిఐ తమ ఇంటికి వచ్చి హరికృష్ణ గురించి వాకబు చేశారని వారు చెప్పారు. పనికి వెళ్ళాడు అని చెప్పగానే తనను సీఐ దుర్భాషలాడుతూ పసిబిడ్డ తల్లి అనే కనికరం లేకుండా చావబాదాడని హరికృష్ణ భార్య రోధిస్తూ చెప్పింది. తన భర్త హరికృష్ణ మరిదిని సంబంధం లేని కేసులో ఇరికించారని హరికృష్ణ భార్య ఆరోపిస్తోంది. వీరికి టిడిపి లీగల్ సెల్ లాయర్లు న్యాయ సహాయం అందించడానికి ముందుకు వచ్చినట్లు సమాచారం. టిడిపి అభ్యర్థి పులివర్తి నాని పై జరిగిన ఆత్యాయత్నం ఘటనలో నిందితుల పేర్లు నమోదు, అరెస్టు చేయడంలో పోలీసులకు తలనొప్పిగా మారే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు.

Read More
Next Story