ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ఆరు కొత్త పాలసీలకు శ్రీకారం చుట్టనున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. భవిష్యత్‌లో ఇవి గేమ్‌ చేంజర్‌గా మారుతాయన్నారు.


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి, యువతకు ఉపాధి కల్పించడం కోసం ఆరు సరి కొత్త పాలసీలకు శ్రీకారం చుట్టనున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. అమరావతి సచివాలయంలో బుధవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం జరిగింది. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఒకే సారి ఆరు కొత్త పాలసీలను తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్, క్లీన్‌ ఎనర్జీ, గ్రీన్‌ ఎనర్జీ వంటి పాలసీలను తేనున్నట్లు చెప్పారు. టూరిజమ్, ఐటీ, వర్చువల్‌ వర్కింగ్‌ పాలసీలను త్వరలో తెస్తామన్నారు. వన్‌ ఫ్యామిలీ.. వన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ నినాదంతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు. థింక్‌ గ్లోబల్లీ.. యాక్ట్‌ గ్లోబల్లీ అనే విధానంలో ఈ పాలసీలు యువత, ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్‌లో పెనుమార్పులు తెస్తాయన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి కేంద్రంగా అమరావతి రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని ఐదు జోన్లకు గాను ఐదు చోట్ల అంటే విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ లేదా గుంటూరు, అనంతపురం ప్రాంతాల్లో ఐదు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. ఆధునిక టెక్నాలజీని రాష్ట్ర ప్రజలకు చేరువ చేస్తామన్నారు. నాలెడ్జ్‌ ఎకానమీకి ఆంధ్రప్రదేశ్‌ను హబ్‌గా తయారు చేస్తామన్నారు. దీనిపైన వర్కవుట్‌ చేస్తున్నామన్నారు. అక్వాకల్చర్‌ హబ్‌గా ఏపీ తయారవుతుందన్నారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రాయలసీమను ఫుడ్, హార్టీకల్చర్‌ హబ్‌గా తయారు చేస్తామన్నారు. దేశంలోనే మొదటి సారిగా ఆంధ్రప్రదేశ్‌లో డీకార్భనైజేషన్‌ పరిశ్రమల విధానాన్ని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు.
జీరోబడ్జెట్‌ నేచరల్‌ ఫార్మింగ్‌కు ఏపీ కేరాఫ్‌గా మారుస్తామన్నారు. వచ్చే నెల మొదటి వారంలో స్వర్ణాంధ్ర 2047 విజన్‌ డాక్యుమెంట్‌ను విడుదల చేస్తామన్నారు. ఏపీని తయారీ రంగంలో కేంద్రంగా మార్చడంతో పాటుగా ఏపీ ఉత్పత్తులను ప్రపంచ వ్యాప్తంగా మార్కెటింగ్‌ చేసేందుకు, గ్లోబల్‌ బ్రాండ్‌గా ప్రమోట్‌ చేసేందుకు ఆలోచనలు చేస్తున్నట్లు చెప్పారు. రూ. 30లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా పని చేస్తున్నట్లు చెప్పారు. కోస్టల్‌ కారిడార్‌ను అనుసంధానం చేస్తూ విశాఖ నుంచి భావనపాడు వరకు జాతీయ రహదారికి పార్లల్‌గా రహదారిని నిర్మిస్తామన్నారు. భావనపాడులో 10వేల ఎకరకాల్లో ఇండస్ట్రియల్‌ పార్కును ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. రానున్న రోజుల్లో ఈ ఆరు పాలసీలు ఆంధ్రప్రదేశ్‌ గేమ్‌ చేంజర్‌గా మారుతాయని చెప్పారు.
Next Story