పాములకు ప్రాణ స్నేహితుడు!
సర్పాలను పట్టడమే కాదు.. వాటికి వైద్యమూ చేయిస్తాడు.. ఆకలి తీర్చడానికి ఆహారాన్ని అందిస్తాడు. ఇప్పటివరకు 34,570 పాములను పట్టిన స్నేక్ కిరణ్.
సాధారణంగా పాములను పట్టేవారుంటారు. ఆ తర్వాత వాటికి హాని తలపెట్టకుండా విడిచి పెట్టేవారూ ఉంటారు. కానీ కిరణ్ కుమార్ మాత్రం అలాంటిలాంటి స్నేక్ క్యాచర్ కాదు.. పాములను పట్టడమే కాదు.. వాటిని సురక్షితంగా అడవుల్లోకి వదులుతాడు. అంతేనా? గాయపడ్డ సర్పాలకు వైద్యం కూడా చేయిస్తాడు. అవి తిరిగి కోలుకునే వరకు సపర్యలూ చేస్తాడు. ఆహారాన్నీ అందిస్తాడు. ఇలా పాములకు ఆయన ప్రాణ స్నేహితుడిగా మారిపోయాడు. పాములకు కష్టమొస్తే విలవిల్లాడిపోయే కిరణ్కుమార్ను కదిలిస్తే ఎన్నో ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. విశాఖ నగరంలోని మింది ప్రాంతానికి చెందిన రొక్కం కిరణ్ కుమార్ తండ్రి హిందుస్తాన్ షిప్లోర్డు ఉద్యోగి. కొండవాలు ప్రాంతమైన షిప్యార్డు క్వార్టర్స్ పాముల సంచారం అధికంగా ఉండేది. తెలిసీ తెలియని వయసులో ఆడుకోవడానికి వెళ్లినప్పుడు కనిపించిన పాములను తోక పట్టుకుని లాగేవాడు. అలా ఏడో తరగతి వచ్చే సరికి బస్సులో వెళ్తుండగా ట్రాఫిక్ జామయింది.
బస్సు దిగి చూడగా ఓ షాపులో పాము దూరిందని జనం గుమిగూడారు. పామును పట్టుకుంటానని వెళ్లిన కిరణ్ను అంతా హేళనగా మాట్లాడారు. ఆ కసితో షాపులో ఉన్న నాగుపామును పట్టుకున్నాడు. ఇక అక్కడ నుంచి ధైర్యం పెరిగి ఎలాంటి పాములనైనా అలవోకగా పట్టుకోవడం అలవాటు చేసుకున్నాడు. క్రమేపీ అటవీ శాఖ అధికారుల నుంచి మెళకువలను నేర్చుకుని, కొన్నాళ్లకు పాములను పట్టేందుకు ప్రభుత్వం నుంచి లైసెన్స్ తీసుకున్నాడు. ఇలా 42 ఏళ్ల కిరణ్.. 22 సంవత్సరాల నుంచి ఇప్పటివరకు 34,570 పాములను పట్టుకున్నాడు. వీటిలో అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రా (త్రాచు పాము), కట్ల పాము, రక్త పింజర వంటివి కూడా వేలల్లో ఉన్నాయి. ఇంకా కొండ చిలువలతో పాటు ఇతర రకాల సర్పాలు కూడా ఉన్నాయి. దశాబ్దంన్నర క్రితం వరకు కిరణ్ పేరు అంతగా ప్రాచుర్యంలో లేదు. అయితే ఆ తర్వాత నుంచి విశాఖ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో స్నేక్ కిరణ్ పేరు మారు మోగుతోంది. ఏ ఇంట్లోనో, ఆఫీసుల్లోనో, ఆస్పత్రుల్లోనో, షాపుల్లోనో పాము ప్రవేశిస్తే వెంటనే స్నేక్ కిరణే గుర్తుకు వస్తాడు. సత్వరమే అక్కడకు చేరుకుని ఎలాంటి పామునైనా అలవోకగా పట్టేస్తాడు. అనంతరం వాటిని అటవీ శాఖ సిబ్బంది సమక్షంలో అటవీ ప్రాంతంలోనో, జన సంచారం లేని చోటో విడిచి పెడతాడు. అంతేకాదు.. పాముల సంరక్షణ, వాటి ఆవశ్యకత, జీవ వైవిధ్యంపై ఆయన ప్రజలకు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.
పాములకు వైద్యం చేయిస్తాడిలా..
కిరణ్ కుమార్ తాను పట్టుకున్న పాములను సురక్షితంగా విడిచి పెట్టడమే కాదు.. వాటికి సుస్తీ చేసినా, గాయపడినా వైద్యం చేయిస్తాడు. సాధారణంగా పాము, ముంగిసల దెబ్బలాటలోను, ఇతర జంతువుల కోసం అమర్చిన బోన్లు, ఉచ్చుల్లో చిక్కుకుని సర్పాలు గాయపడతాయి. గాయపడిన పాములు కనిపించినా, సమాచారం అందుకున్నా వాటిని తెచ్చి వెటరినరీ వైద్యుల వద్దకు తీసుకెళ్లి చికిత్స చేయిస్తాడు. అవి బాగా కోలుకున్నాక అడవుల్లో వదిలి పెడతాడు. వైద్యం చేయించే వారం, పదిరోజులు వాటికి సంరక్షణతో పాటు ఆహారాన్ని అందిస్తాడు. పాములు ఎలుకలను ఇష్టంగా తింటాయి. నల్ల ఎలుకల్లో ఇన్ఫెక్షన్ ఉంటుందని ఇన్ఫెక్షన్ ఉండని తెల్ల ఎలుకలను (ఒక్కోటి రూ.350 ధర ఉంటుంది) కొని ఆహారంగా పెడతాడు. కొన్ని సార్లు రాత్రి వేళ పట్టుకున్న పాములను కుక్కలు తినేస్తుంటాయి. అందువల్ల వాటి సంరక్షణకు ప్రత్యేక బాక్సులను ఏర్పాటు చేసి అందులో ఉంచుతాడు. తాను పట్టుకున్న పాములను చంటి పిల్లాడికంటే బాగా చూసుకుంటానంటాడు కిరణ్. ఇలా ఇప్పటివరకు పదికి పైగా కొండ చిలువలు, మరో 15 నాగు పాములకు వైద్యం చేయించి ప్రాణం పోశాడు. అయితే ఇన్నాళ్లూ పాములకు ప్రాణం పోస్తున్న కిరణ్ను ఓసారి గాజువాకలో కట్ల పాము కాటేసింది. వెంటనే కేజీహెచ్లో చేరడంతో వైద్యులు ప్రాణాపాయం నుంచి బయటపడేశారు.
పాములకు, నాకూ ఏదో తెలియని బంధం ఉంది..
'పాములకు నాకూ ఏదో తెలియని బంధంంంది. పాములు పట్టడమంటే ప్రాణానికి తెగించడమే. నేర్పుగా వాటిని పట్టుకుని సురక్షితంగా అడవుల్లో వదిలి పెడతాను. వాటికి ఏ కష్టం వచ్చినా నా మనసు విలవిల్లాడిపోతుంది. అందుకే వాటి సంరక్షణనూ చూస్తాను. విశాఖలో పాము కాటుతో ఏ ఒక్కరూ చనిపోకూడదన్నది నా లక్ష్యం. అందుకే ఏ సమయంలో సమాచారం వచ్చినా వెంటనే వెళ్లి పాములను పట్టుకుంటాను. నా దగ్గర సుమారు 150 మంది వరకు పాములను పట్టుకోవడంలో తర్ఫీదు పొందారు. ప్రస్తుతం జీవీఎంసీ వెటరినరీ విభాగంలో తాత్కాలిక పద్దతిలో స్నేక్ క్యాచర్ ఉద్యోగం చేస్తున్నాను. నావద్ద 18 మంది సహాయకులున్నారు. విశాఖలోని కొండవాలు ప్రాంతాల్లో పాముల సంచారం అధికంగా ఉంది. అందువల్ల అలాంటి ప్రాంతాల్లో స్నేక్ హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలి.
రాత్రి వేళ పట్టుకున్న పాములను అందులో ఉంచడానికి వీలుంటుంది. అలాగే స్నేక్ సర్వీస్ ట్రైనింగ్ సెంటర్లు అవసరం. ఇందుకు కనీసం 40-50 గజాల స్థలం ఇచ్చినా చాలు. ఇంకా సాధారణ అంబులెన్స్ల మాదిరిగానే (బెంగళూరులో ఉన్నాయి) సీఎస్సార్ నిధుల నుంచి స్నేక్ రెస్క్యూ అంబులెన్స్ సమకూర్చాలని కలెక్టర్ను కోరుతున్నాను. ఎవరైనా పాము కాటు బారిన పడితే ఆస్పత్రి తరలించే లోగా విషం విరుగుడికి వైల్స్ వేసి ప్రాణాన్ని కాపాడవచ్చు. అలాంటి అంబులెన్స్లు లేకపోవడం వల్ల పాము కాటుకు గురైన వారు చనిపోతున్నారు. ఔట్ సోర్సింగ్లో విశాఖలో జోన్కు ఒక స్నేక్ క్యాచర్నైనా నియమించాలి' అని కిరణ్ కుమార్ 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు.
భయంతో పిల్లనివ్వలేదు..
విద్యావంతుడైనప్పటికీ కిరణ్ పాములు పట్టేవాడు కావడంతో చాన్నాళ్లు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు ముందుకు రాలేదు. స్నేక్ క్యాచర్ అని తెలియక ముందు పెళ్లి సంబంధాలు కుదుర్చుకున్నా ఆ సంగతి తెలిశాక భయంతో రద్దు చేసుకునే వారు. నిత్యం పాములతో చెలగాటమాడే వాడితో జీవితం ఎలా ఉంటుందోనన్న భయంతో నిశ్చితార్థం అయ్యాక కూడా పెళ్లిని రద్దు చేసుకున్నారని, చివరకు తన అక్క కుమార్తెను వివాహం చేసుకున్నానని చెప్పారు కిరణ్ కుమార్!
అవార్డులెన్నో..
ఆంధ్రప్రదేశ్లో అత్యధిక సంఖ్యలో (34,570) పాములను పట్టుకున్న వ్యక్తిగా కిరణ్ రికార్డు నెలకొల్పాడు. స్నేక్ క్యాచర్ కిరణ్కు ఎన్నో అవార్డులొచ్చాయి. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు, ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, బుక్ ఆఫ్ స్టేట్ రికార్డు వంటివి ఆయన సొంతమయ్యాయి. ఇంకా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, జడ్జిల వంటి వారి నుంచి అవార్డులు, రివార్డులు, ప్రసంశలు అందుకున్నారు. స్నేక్ క్యాచర్ కిరణ్ను 886368899, 9849140500 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు.