ఏపీ శాసన మండలి సమావేశాలు ప్రారంభమైన కొద్ది సేపటికే మండలిలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై వైఎస్‌ఆర్‌సీపీ, పీడీఎఫ్ సభ్యులు హోరెత్తించారు. పోడియం చుట్టు ముట్టారు.
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో సోషల్ మీడియా కేసులు అంశంపై తెరపైకి వచ్చింది. దీనిపై చర్చించాలని ప్రతిపక్షం వైఎస్‌ఆర్‌సీపీ పట్టుబట్టారు. ఆ మేరకు మండలి చైర్మన్‌కు వాయిదా తీర్మానం కూడా అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం వైఎస్‌ఆర్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై దారుణంగా వ్యవహరిస్తోందని, అన్యాయంగా, అక్రమ కేసులు బనాయించి భయబ్రాంతులకు గురి చేస్తోందని, దీనిపైన మండలిలో చర్చకు అనుమతించాలని పట్టుబట్టారు. డీఎస్సీపై చర్చ పెట్టాలని పీడీఎఫ్ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. దీనిపై చర్చ పెట్టాలని పీడీఎఫ్ సభ్యులు పట్టుబట్టారు. అయితే మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు ఆ రెండు తీర్మానాలను తిరస్కరించారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా కేసులపై చర్చించాలని అటు వైఎస్‌ఆర్‌సీపీ, డీఎస్సీపై చర్చించాలని ఇటు పీడీఎఫ్ సభ్యులు పట్టుబట్టారు. దీనికి మండలి చైర్మన్ ఒప్పుకోలేదు. దీంతో వైఎస్‌ఆర్‌సీపీతో పాటు పీడీఎఫ్ సభ్యులు చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి ఆందోళనలకు దిగారు. ‘సేవ్ డెమోక్రెసీ’, ‘వుయ్ వాంట్ జస్టిస్’ అంటూ నినాదాలు చేపట్టారు. ఇదే సమయంలో మంత్రులు మాట్లాడేందుకు ప్రయత్నించారు. వాతావరణం గందరగోళంగా మారండంతో చైర్మన్ కాసేపు వాయిదా వేశారు.