ఈల వేసి గోల చేస్తున్నారు... ఆకతాయిల అత్యుత్సాహం...
x
సీ-విజిల్ యాప్

'ఈల' వేసి గోల చేస్తున్నారు... ఆకతాయిల అత్యుత్సాహం...

'ఈల' వేసి గోల చేస్తున్నారు... ఎన్నికల అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు... ఇంతకీ ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నది ఎవరు...?


(తంగేటి నానాజీ)

విశాఖపట్నం: ఎన్నికల కమిషన్ ప్రధాన లక్ష్యం ఆకతాయిల చేష్టలతో అభాసు పాలవుతోంది. అధికారులకు ఆపసోపాలను మిగులుస్తోంది. ఎన్నికల నిబంధనలు, ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే వారిపై రియల్ టైం ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల సంఘం సి-విజిల్ యాప్ తీసుకువచ్చింది. ఈ యాప్ సామాన్యుని చేతిలో ఆయుధంగా మారుతుందని భావించింది. ఎన్నికల అక్రమాలు బయటపడతాయని, తద్వారా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి సజావుగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ భావించింది. సి- విజిల్ యాప్‌పై ప్రజల్లో విస్తృత ప్రచారంతోపాటు అవగాహన కల్పించింది. ఎన్నికల అక్రమాలపై నేరుగా ఫిర్యాదు చేయవచ్చు అంటూ ప్రకటించింది. దీంతో రాజకీయ పార్టీలతో పాటు సామాన్య ప్రజానీకం కూడా సి- విజిల్ యాప్ ద్వారా ప్రతిరోజు పలు ఫిర్యాదులు చేస్తున్నారు. అధికార యంత్రాంగం కూడా సకాలంలో స్పందిస్తూ సత్వర పరిష్కారాలను చూపుతున్నారు.

సి- విజిల్ లక్ష్యం ఏంటి....

ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు... ఓటు అనే ఆయుధంతో పాలకుల తలరాతలు మార్చేది కూడా వీరే... ప్రభువులైన ప్రజలకు మరో ఆయుధాన్ని కూడా ఎన్నికల కమిషన్ ఇచ్చింది. ఎక్కడ అక్రమాలు జరిగినా టక్కున క్లిక్ చేసి… క్షణాల్లో అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సి- విజిల్ యాప్‌ను ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టింది. తమ కళ్ల ముందు జరుగుతున్న ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై నేరుగా ఫిర్యాదు చేయాలంటూ ఎన్నికల కమిషన్ ప్రజలను కోరింది. ఈ యాప్ సహాయంతో పోలింగ్ స్టేషన్‌లో అనుమానాస్పద వ్యక్తులు, అవకతవకులకు సంబంధించి ఓటర్లు ఫిర్యాదు చేయవచ్చు. మద్యం, డబ్బు పంపిణీ... ఫేక్ న్యూస్, విద్వేష పూరిత ప్రసంగాలు, పోస్టర్లు, బ్యానర్లు, అనుమతి లేకుండా గిఫ్ట్ కూపన్ల పంపిణీ, అనుమతి లేకుండా వాహనాల ర్యాలీలు, నిషేధిత సమయాల్లో ప్రచారం, నిర్ణీత సమయానికి మించి స్పీకర్లను ఉపయోగించడం వంటి వాటిపై ఫిర్యాదులు చేయవచ్చు.

ఇందులో ఫోటో, వీడియో, ఆడియో అప్లోడ్ చేసి వెంటనే ఫిర్యాదు నమోదు చేసుకునే వెసులుబాటు ఉంది. ఫిర్యాదు అందిన వంద నిమిషాల్లో అధికారులు వాటిని పరిష్కరిస్తారని ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఫిర్యాదు అందిందంటే కచ్చితంగా సిబ్బంది ఆ ప్రాంతానికి వెళ్లాల్సిందేనని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తి చేయాలని ఎలక్షన్ కమిషన్ ప్రధాన ఉద్దేశంగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. యాప్ ప్రవేశపెట్టిన తొలినాళ్లలో ప్రజల నుంచి మంచి స్పందనే లభించింది. అయితే ప్రస్తుతం మాత్రం ఈ యాప్‌కు ఆకతాయిల బెడద ఎక్కువైంది. తప్పుడు ఫిర్యాదులు అధికారులను ఇబ్బందులపాలు చేస్తున్నాయి.

ఆడుకుంటున్న ఆకతాయిలు...

సార్... పలానా ప్రాంతంలో ప్రధాన పార్టీల అభ్యర్థుల డబ్బు పంపిణీ జరుగుతుంది.... సార్.. మా ప్రాంతంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు పలానా పార్టీకి ప్రచారం చేస్తున్నారు..

సార్... పలానా పార్టీ అభ్యర్థి మసీదులో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగం చేస్తున్నారు. ఈ ఫిర్యాదులకు బ్లర్ అయిన ఫోటో ఒకటి యాడ్ చేస్తున్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ప్రతిరోజు సి- విజిల్ యాప్ ద్వారా ఆకతాయిలు చేసే ఫిర్యాదులకు అధికారులు పరుగులు పెడుతున్నారు. ఈ ఫేక్ ఫిర్యాదులతో తాము పలు ఇబ్బందులు పడుతున్నామని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఫెడరల్ న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ ప్రతినిధికి తెలిపారు.

Read More
Next Story