ఆంధ్రలో ఒకవైపు వర్షాలు.. మరోవైపు మండుటెండలు
x

ఆంధ్రలో ఒకవైపు వర్షాలు.. మరోవైపు మండుటెండలు

ఏపీలో ప్రజలు రానున్న రెండు రోజుల్లో తీవ్ర వాతావరణ మార్పులు ఎదుర్కోనున్నట్లు రాష్ట్ర విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. ఏ జిల్లాల్లో ఎలా అంటే..


ఆంధ్రలో రాజకీయాల మాదిరిగానే వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో అర్థం కావట్లేదు. ఒకవైపు వడగాలులు అల్లడిస్తుంటే.. మరోవైపు భారీ నుంచి ఒకమోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, పిడుగులు కూడా పడొచ్చంటూ రాష్ట్ర విపత్తుల సంస్థ అంచనా వేస్తోంది. అదే సమయంలో మరోవైపు పలు మండలాల్లో తీవ్రస్థాయి వడగాలులు కూడా వీయొచ్చని విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ చెప్తున్నారు. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనుండగా మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కూడా కురుస్తాయని, అదే విధంగా రాష్ట్రంలో మరోవైపు ఉన్న ప్రజలు వడగాలులతో జాగ్రత్తగా ఉండాలని కూడా ఆయన వివరించారు.

ఈ జిల్లాల్లో వర్షాలు

శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ జిల్లాల్లో సోమవారం పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, అదే విధంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైయస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా మంగళవారం భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆయన వెల్లడించారు. ఈ క్రమంలో ఉరుములతో కూడిన వర్షాలు పడుతున్నప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని ఆయన హెచ్చరించారు. హైవేలపై ప్రయాణించే వారు కూడా అప్రమత్తంగా ప్రయాణించాలని చెప్పారు.

ఈ మండలాల్లో ఎండలు

పలు జిల్లాల్లో సోమవారం.. వర్షాలు కురవనుండగా పలు మండలాల్లో వడగాలుల అల్లడించనున్నాయని కూర్మనాథ్ వివరించారు. దాదాపు 29 మండలాల్లో భారీ వడగాలులు వీయొచ్చని, 15 మండలాల్లో మోస్తరు వడగాలులు వీయొచ్చని తెలిపారు. శ్రీకాకుళం 10, విజయనగరం 13, పార్వతీపురం మన్యం 6 మండలాల్లో తీవ్రస్థాయి వడగాలులు వీయొచ్చని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణంలో వస్తున్న ఈ విపరీత మార్పులు మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని, కావున ఏమాత్రం అస్వస్థతగా ఉన్నా వైద్యులను సంప్రదించాలని కూర్మనాథ్ సూచించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.

Read More
Next Story