సోమిరెడ్డికి ఓటుతో పాటు నోటూ కావాలంట!
‘నా దగ్గర డబ్బులు లేవు. మీరే ధర్మం చేయండి’ అంటూ ఓటర్లు వేడుకుంటున్నా టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్. ప్రచారానికి హుండీ కూడా..
‘‘ధర్మం చెయ్ బాబు.. కాణీ ధర్మం చెయ్ బాబు. ధర్మం చేస్తే పుణ్యమొస్తది కర్మన తీర్తది బాబు’ అంటూ మిస్సమ్మ సినిమాలో ఓ పాట ఉంది. సర్వేపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేస్తున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఇదే రాగం తీస్తున్నారు. ఓటర్లు కాస్త ధర్మం చేయండి.. ధర్మం చేస్తే మంచి పాలనొస్తదంటూ రాగం ఎత్తుకుంటుంటారు. దీనికి సింబాలిక్‌గానే తనతో పాటు ఓ హుండీని కూడా ఎన్నికల ప్రచారానికి తీసుకెళ్తున్నారు. ప్రతి ఓటరును.. ‘అయ్యా కాస్త ధర్మం చేయండి.. ఎన్నికల్లో గెలిచి మీకు సేవ చేయాలంటే ధర్మం చేయండి’ అని వేడుకుంటున్నారు. ఆయన చేస్తున్న ఈ చర్యలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. ఇదెక్కడి విడ్డూరం అంటూ కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు. రాజకీయాలంటే డబ్బు.. డబ్బంటే రాజకీయాలు.. ఒక రాజకీయ నాయకుడు తన దగ్గర డబ్బులు లేవంటే.. అంబానీ అడుక్కుతింటున్నట్లే అంటూ సెటైర్లు వేస్తున్న వారూ ఉన్నారు.
ఎవరు ఏమనుకున్నా తన హుండీ బిజినెస్‌ను మాత్రం చంద్రమోహన్ జోరుగానే సాగిస్తున్నారు. తనకు కోట్లు కుమ్మరించే తాహతు లేదంటూ చెప్తున్నారు. ‘‘30 ఏళ్లుగా రాజకీయాల్లో నిండా మునిగిపోయాను. చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. వైసీపీ అభ్యర్థి మాదిరిగా కోట్లు కుమ్మరించాలి అంటే నా వల్ల కాదు. ఈ ఎన్నికల్లో గెలిచి ప్రజలకు సేవ చేయాలంటే ఆ ప్రజలే ఆదుకోవాలి. ఓటుతో పాటు కాస్తంత నోటు సహాయం కూడా చేయాలి’’ అంటూ తన స్టైల్‌లో ప్రజలను వేడుకుంటున్నారు. ఆయన అలా చేయడమే వింతగా ఉందనుకుంటే.. ఆయన గాథ విని జాలి పడి సహాయం చేస్తున్న వారూ తక్కువేం కాదు. ఎమ్మెల్యే అభ్యర్థి అడగగానే తమకు తోచినంత తీసుకొచ్చి ఆయన హుండీలో పడేసి వెళ్లారు.
ఆఖరికి జేబులో డబ్బులతో పాటు ఒంట్లో శక్తి కూడా సోమిరెడ్డి సన్నగిల్లినట్లుంది. ఆయన గెలుపు కోసం ప్రచార బరిలోకి ఆయన భార్య సోమిరెడ్డి జ్యోతి దిగారు. ఎక్కడిక్కడ సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహిస్తూ భర్త ఆహారం కూడా తానే తినేసినట్లు దూకుడుగా ప్రచారం చేసేస్తున్నారు ఆమె. టీడీపీని గెలిపిస్తేనే రాష్ట్ర బాగుపడుతుందని, అందరికీ మేలు జరుగుతుందని ఓటర్లు వివరిస్తున్నారు. అందుకోసమైనా రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేసి తన భర్త భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటరు దేవుళ్లను కోరుతున్నారామే. మరోవైపే అయ్యా.. ధర్మం చేయండి అంటూ సోమిరెడ్డి కూడా వీధుల వెంట తీరుగుతూ ప్రచారం చేస్తున్నారు.
తన ధర్మం చేయాలని కోరుతూనే వైసీపీ వైఫల్యాలను ఓటర్లు ముందు ఉంచుతున్నారు సోమిరెడ్డి. పోలవరం వంటి ప్రాజెక్ట్‌లు ఐదేళ్లలో రాష్ట్రానికి పరిశ్రమలు రాకపోవడం వంటి అంశాలపై మండిపడుతున్నారు. వైసీపీ వైఖరి ప్రతిపక్షాలే కాదని ప్రజలకు కూడా ఏమాత్రం నచ్చట్లేదని అనేక సమావేశాల్లో కూడా ఆయన వెల్లడించారు. ఐదేళ్లలో ఎమ్మెల్యేలను అచ్చోసిన ఆంబోతుల మాదిరి రాష్ట్రం మీదకు వదిలేశారని, అన్న రంగాల్లో అవినీతి చేసి కోట్లు గడించారని, కానీ తాము అలా కాదని, వాళ్లలా తాము కోట్లు కుమ్మరించలేమంటూ తన ఆర్థిక స్థితిని కూడా గుర్తు చేస్తున్నారు.