ఎన్నికల బరిలో మాజీ సీఎంల కొడుకులు, కూతుళ్లు, మాజీ సీఎంలు
x

ఎన్నికల బరిలో మాజీ సీఎంల కొడుకులు, కూతుళ్లు, మాజీ సీఎంలు

2024 ఎన్నికలకు ఒక విశిష్టత ఉంది. మాజీ ముఖ్యమంత్రులుగా పని చేసిన వారి కొడుకులు, కూతుళ్లు పోటీ చేస్తున్నారు. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు కూడా బరిలో ఉన్నారు.


ఆంధ్రపదేశ్‌కు గతంలో ముఖ్యమంత్రులుగా పని చేసిన నాయకుల కుమారులు, కుమార్తెలు 2024 ఎన్నికల బరిలో ఉన్నారు. వీరితో పాటు ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు కూడా ఈ సారి ఎన్నికల పోటీలో ఉండటం గమనార్హం. వారు ఎవరు, ఎక్కడ నుంచి పోటీ చేస్తున్నారో ఒక సారి తెలుసుకుందాం.

ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన నాదెండ్ల భాస్కరరావు కొడుకు నాదెండ్ల మనోహర్‌ 2024 ఎన్నికల బరిలో ఉన్నారు. ఈయన ఉమ్మడి రాష్ట్రానికి స్పీకర్‌గా పని చేశారు. తెనాలి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ఎన్డీఏ కూటమి నుంచి జనసేన అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు నాదెండ్ల భాస్కరరావు సీఎంగా పని చేశారు. 1983లో నెల రోజులు మాత్రమే ఆ పదవిలో ఉన్నారు. ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్‌ కూడా ఉమ్మడి రాష్ట్ర సెంబ్లీకి ఆఖరి స్పీకర్‌గా పని చేశారు. 2011 నుంచి 2014 వరకు స్పీకర్‌గా ఉన్నారు. 2004, 2009 ఎన్నికల్లో తెనాలి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలుపొందారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత జనసేన పార్టీలో చేరి 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓడి పోయారు. 2024 ఎన్నికల్లో నాదెండ్ల మనోహర్‌కు ప్రత్యర్థులుగా అన్నాబత్తుని శివకుమార్‌ వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు.
మరోమాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు కుమారుడు నందమూరి బాలకృష్ణ 2024 ఎన్నికల బరిలో ఉన్నారు. హిందూపురం అసెంబ్లీ నియోజక వర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ నుంచి రెండు సార్లు గెలుపొందారు. మూడో సారి 2024 ఎన్నికల్లో హ్యాట్రిక్‌ కొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్టీఆర్‌ కూడా హిందూపురం అసెంబ్లీ నియోజక వర్గం నుంచి మూడు పర్యాయాలు వరుసగా గెలుపొందారు. 1985, 1989, 1994 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్‌ సాధించారు. ఎన్టీఆర్‌ పెద్ద కుమారుడు హరికృష్ణ కూడా ఇక్కడ నుంచి పోటీ చేసి 1996లో గెలుపొందారు. నాటి నుంచి హిందూపురం అసెంబ్లీ నియోజక వర్గం తెలుగుదేశం పార్టీకి, నందమూరి కుటుంబానికి అడ్డాగా మారి పోయింది. 2024 ఎన్నికల్లో బాలకృష్ణ ప్రత్యర్థులుగా తిప్పేగౌడ నారాయణ దీపిక వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి గాను, మొహ్మద్‌ హుస్సేన్‌ ఇనయతుల్లా కాంగ్రెస్‌ అభ్యర్థిగాను పోటీలో ఉన్నారు.
మరో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. 2024 ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఇదే నియోజక వర్గం నుంచి తొలి సారి పోటీ చేసి ఓటమి చెందారు. 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్సీగా ఉంటూ తండ్రి నారా చంద్రబాబుయుడు మంత్రి వర్గంలో మంత్రిగా పని చేశారు. నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలోను, విభజిత ఆంధ్రప్రదేశ్‌లోను ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2024 ఎన్నికల్లో నారా లోకేష్‌కు ప్రత్యర్థులుగా మురుగుడు లావణ్య వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగాను, జొన్నా శివశంకర్‌ కాంగ్రెస్, కమ్యునిస్టుల కూటమి అభ్యర్థిగాను పోటీలో ఉన్నారు.
మరో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2009లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా కడప ఎంపీగా గెలిచారు. వైఎస్‌ఆర్‌ మరణానంతరం కాంగ్రెస్‌ పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించారు. 2011లో కడప పార్లమెంట్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పులివెందుల అసెంబ్లీ నియోజక వర్గం నుంచి 2014లో గెలిచారు. 2019లో రెండో సారి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. 2024 ఎన్నికల్లో మూడో సారి పులివెందుల నుంచి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. బిటెక్‌ రవి ఈయనకు ప్రత్యర్థిగా ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి మూలంరెడ్డి దృవకుమార్‌రెడ్డి పోటీలో ఉన్నారు.
మరో మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కుమారుడు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. గతంలో ఈయన కర్నూలు పార్లమెంట్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా రెండు సార్లు గెలుపొందారు. అనంతరం నాటి కేంద్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రైల్వే శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. 2024 ఎన్నికల్లో డోన్‌ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ఎన్టీఏ కూటమి తరఫున టీడీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఆయనకు ప్రత్యర్థులుగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగాను, గార్లపాటి మద్దులేటి స్వామి కాంగ్రెస్‌ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. గతంలో సూర్యప్రకాశ్‌రెడ్డి భార్య సుజాతమ్మ ఇక్కడ నుంచి పోటీ చేసి గెలుపొందారు. కోట్ల విజయభాస్కరరెడ్డి కూడా ఇదే నియోజక వర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. కోట్ల విజయభాస్కరరెడ్డి రెండు సార్లు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేశారు.
మరో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి కుమారుడు రామ్‌కుమార్‌రెడ్డి ప్రస్తుతం ఎన్నికల బరిలో ఉన్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. నాటి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వెంకటగరి అసెంబ్లీ నేదురుమల్లి కుటుంబానికి అడ్డాగా ఉండేది. ఇక్కడ నుంచే నేదురుమల్లి జనార్దనరెడ్డి, ఆయన భార్య నేదురుమల్లి రాజ్యలక్ష్మి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 1990 నుంచి 1992 మధ్య కాలంలో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి నేదురుమల్లి జనార్దనరెడ్డి ముఖ్యమంత్రిగా పని చేశారు. 1989 ఎన్నికల్లో వెంకటగిరి నుంచి ఎన్నికైన తర్వాత ఆయన సీఎం అయ్యారు. 2024 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డిపైన ఎన్టీఏ కూటమి నుంచి టీడీపీ అభ్యర్థిగా కురుగొండ్ల రామకృష్ణ, కాంగ్రెస్, కమ్యూనిస్టుల కూటమి అభ్యర్థిగా పి శ్రీనివాసులు పోటీ చేస్తున్నారు.
ఎంపీలుగా మాజీ సీఎంల కూతుళ్లు
ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల కుమార్తెలు పార్లమెంట్‌ స్థానాల నుంచి బరిలో ఉన్నారు. ఒకరు మాజీ ముఖ్యమంతి ఎన్టీఆర్‌ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి కాగా, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్‌ షర్మిల మరొకరు. దగ్గుబాటి పురందేశ్వరి రాజమండ్రి పార్లమెంట్‌ నుంచి ఎన్డీఏ కూటమి నుంచి బిజెపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఆమెకు ప్రత్యర్థులుగా వైఎస్‌ఆర్‌సీపీ నుంచి గూడూరు శ్రీనివాస్, కాంగ్రెస్‌ నుంచి గిడుగు రుద్రరాజు రంగంలో ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ బిజెపీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి గతంలో కాంగ్రెస్‌ హయాంలో కేంద్రంలో మంత్రిగా పని చేశారు.
ఇక వైఎస్‌ షర్మిల కడప పార్లమెంట్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా భూపేష్‌ సుబ్బరామిరెడ్డి రంగంలో ఉన్నారు. షర్మిల ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌కు అధ్యక్షురాలిగా ఉన్నారు.
ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు
ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు కూడా ఎన్నికల బరిలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి పోటీ చేస్తుండగా మరో మాజీ సీఎం ఎన్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి రాజంపేట పార్లమెంట్‌ నుంచి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కిరణ్‌ కుమార్‌రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చిట్ట చివరి ముఖ్యమంత్రిగా పని చేశారు. చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు విభజిత ఆంధ్రప్రదేశ్‌కు కూడా ముఖ్యమంత్రిగా పని చేశారు. కిరణ్‌కుమారెడ్డికి ప్రత్యర్థులుగా వైఎస్‌ఆర్‌సీపీ నుంచి పివి మిథున్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి ఎస్కే బషీద్‌ రంగంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడుకి ప్రత్యర్థులుగా కేఆర్‌జే భరత్‌ వైఎస్‌ఆర్‌సీపీ నుంచి ఆవుల గోవిందరాజులు కాంగ్రెస్‌ నుంచి పోటీలో ఉన్నారు.
Read More
Next Story