నాడు తండ్రులు… నేడు తనయులు… ఎన్నికల బరిలో వారసులు...
వారసులొచ్చారు… తండ్రుల రాజకీయ వారసత్వం పునికి పుచ్చుకుని ఎన్నికల క్షేత్రంలో పోరాడేందుకు సిద్ధపడ్డారు. ఇంతకీ ఎవరా వారసులు...?
(తంగేటి నానాజీ)
విశాఖపట్నం: సరిగ్గా 35 ఏళ్ల క్రితం... ప్రస్తుత గాజువాక నియోజకవర్గంతో కలిపి ఉండే పెందుర్తి అతిపెద్ద నియోజకవర్గం అది... రెండు బలమైన సామాజిక వర్గాలకు చెందిన నేతలు ఎన్నికల బరిలో దిగారు... హోరాహోరీ పోటీ నడుమ ఒకరిని విజయం వరించింది. మరొకరిని ఓటమి కౌగిలించుకుంది. నాడు పోటీ పడ్డ ఆ నేతలు ఎవరో తెలుసా...ప్రస్తుత ఐటీ మంత్రి, గాజువాక వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ తండ్రి గుడివాడ గురునాధరావు ఒకరైతే.. గాజువాకకు టీడీపీ-జనసేన-బీజేపీల కూటమి ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాస్ తండ్రి పల్లా సింహాచలం మరొకరు...1989లో జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గుడివాడ గురునాథరావు విజయం సాధించగా... తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన పల్లా సింహాచలం పరాజయం పాలయ్యారు. 19 వేల ఓట్ల మెజారిటీతో గుడివాడ గురునాధరావు విజయం సాధించారు. తిరిగి మూడున్నర దశాబ్దాల తర్వాత వారి వారసులు మధ్య పోటీ షురూ అయింది.
గాజువాక హిస్టరీ...
విశాఖ తర్వాత పారిశ్రామికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందిన ప్రాంతంగా గాజువాక పేరొందింది. గాజువాక నియోజకవర్గం ఏర్పడక ముందు పెందుర్తి నియోజకవర్గంలో కలిసి ఉండేది. 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా గాజువాక నియోజకవర్గం ఏర్పడింది. అనంతరం 2009లో జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి కాపు సామాజిక వర్గానికి చెందిన చింతలపూడి వెంకటరామయ్య తొలిసారి విజయం సాధించగా... 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున యాదవ సామాజిక వర్గానికి చెందిన పల్లా శ్రీనివాసరావు విజయం సాధించారు.
2019 గత ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన తిప్పల నాగిరెడ్డి అధికార వైసీపీ తరఫున గెలుపొందారు. 2024 ఎన్నికల కురుక్షేత్రంలో అధికార వైసీపీ తరఫున మంత్రి గుడివాడ అమర్నాథ్ బరిలో ఉండగా... టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తరపున మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ పోటీకి దిగారు. ఈ నియోజకవర్గంలో యాదవ, కాపు, రెడ్డి సామాజిక వర్గాల ఓటర్లు అత్యధికులు కావడంతో ఈ సామాజిక వర్గాల నుంచే అభ్యర్థులు ఆయా రాజకీయ పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు.
'గుడివాడ' నేపథ్యం...
ప్రస్తుత ఐటీ మంత్రి, అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయన తాత గుడివాడ అప్పన్న పెందుర్తి నియోజకవర్గానికి 1978లో తొలి శాసనసభ్యులు. ఆయన తండ్రి గుడివాడ గురునాథరావు పెందుర్తి, అనకాపల్లి శాసనసభ్యులుగా... అనకాపల్లి పార్లమెంట్ సభ్యునిగా... రాష్ట్ర మంత్రిగా చేసిన వ్యక్తి. ఆయన మరణానంతరం ఆయన సతీమణి, అమర్ తల్లి గుడివాడ నాగమణి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు.
చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చిన అమర్నాథ్ తొలిత టీడీపీ తరఫున గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) కార్పొరేటర్‌గా రాజకీయ రంగ ప్రవేశం చేసి వైసిపి ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరారు. వైసీపీ తరఫున అనకాపల్లి పార్లమెంటుకు పోటీ చేసి ఓటమి పాలైన ఆయన గత ఎన్నికల్లో అనకాపల్లి అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. జగన్ మంత్రివర్గంలో ఐటీ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పల్లా శ్రీనివాస్ నేపథ్యం...
గాజువాక నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే. తండ్రి పల్లా. సింహాచలం తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఎన్నో పార్టీ పదవులు చేపట్టి విశాఖపట్నంలో పార్టీని ముందుకు తీసుకు వెళ్లారు. విశాఖ-2 నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. పల్లా శ్రీనివాస్ తొలిత ప్రజారాజ్యం పార్టీ తరఫున 2009 ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అనంతరం తండ్రి సొంత పార్టీ టిడిపిలో చేరి 2014లో గాజువాక ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి చేతిలో ఓడిపోయిన ఆయన ప్రస్తుతం టీడీపీ కూటమి నుంచి గాజువాక అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
గెలుపు అంత ఈజీ కాదు...
2024 ఎన్నికల బరిలో దిగిన అధికార వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్, టీడీపీ కూటమి అభ్యర్థి పల్లా సింహాచలం ఇద్దరూ రాజకీయ వారసులే... బలమైన సామాజిక వర్గాలకు చెందిన వారే... అయినప్పటికీ ఇక్కడ గెలుపు అంత ఈజీ కాదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అనూహ్య పరిణామాల మధ్య మంత్రి అమర్‌కు టికెట్ ఖరారు కావడంతో ఆ స్థానాన్ని ఆశించిన సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, తొలిత అభ్యర్థిగా ప్రకటించి తొలగించిన ఉరుకుటి చందు అసంతృప్తితో రగిలిపోతున్నారు.
వీరిని పార్టీ అధిష్టానం భుజ్జగించినప్పటికీ ఎంతవరకు అమర్ గెలుపుకు కృషి చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇక టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్‌కు మిత్రపక్షాల ఆశావహుల నుండి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. టికెట్ ఆశించి భంగపడ్డ వారు శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇక సామాజిక వర్గాల సమీకరణాలు చూసుకుంటే ఇద్దరు అభ్యర్థులు బలమైన సామాజిక వర్గాలకు చెందినవారే... గుడివాడ అమర్నాథ్ కాపు, పల్లా శ్రీనివాస్ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వారు. అయినప్పటికీ గాజువాక ఓటర్లు ఏ విధంగా తీర్పిస్తారన్నది వేచి చూడాల్సిందే.