బీమా సొమ్ము కోసం తల్లి అంత్యక్రియలను అడ్డుకున్నారు!
సొమ్ము కోసం తల్లి అంత్యక్రియలను అడ్డుకున్న తనయులు.. పంపకాలు జరిగితేనే అంత్యక్రియలు అంటూ పట్టు పట్టారు. చివరకు పోలీసుల జోక్యంతో..
తల్లి, బిడ్డల మధ్య ఉండే అనుబంధం మహత్తరమైంది. కన్న దగ్గర నుంచి బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారికి ఎటువంటి కష్టం రాకుండా చూసుకునే మహత్తర ప్రేమ తల్లి దగ్గరే దొరుకుతుంది. తమ తొలి పలుకుల దగ్గర నుంచి ప్రయోజకులు అయ్యేవరకు బిడ్డ వెంటే ఉంటుంది మాతృమూర్తి. కానీ ఆ తల్లిని చూసుకోవాల్సి వచ్చే సరికి అడ్డగోలు కారణాలు చెప్పి తప్పించుకోవడానికి చూస్తున్నారు ఆ పుత్ర రత్నాలు. అవసాన దశలో కూడా తల్లి ఆస్తులు, సొమ్ము కోసమే తాపత్రయపడుతూ సోదరులతో కయ్యాలకు కాలుదువ్వుతుంటారు. తాజాగా ఇటువంటి సంఘటనే ఒకటి శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం ఓబుళదేవరపల్లిలో చోటుచేసుకుంది. తల్లి బీమా సొమ్ము కోసం ఆ మాతృమూర్తి అంత్యక్రియలను అడ్డుకోవడానికి కూడా తనయులు వెనకాడలేదు.
అసలేం జరిగింది
గంగమ్మ(75), లక్ష్మయ్య దంపతులు. వీరికి ముగ్గురు కుమారులు. వారు ముగ్గురికీ వివాహాలు అయ్యాయి. వృద్ధాప్యం వల్ల లక్ష్మయ్య నడవలేని స్థితిలో ఉన్నాడు. గంగమ్మ ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. గంగమ్మ దాదాపు రూ.2 లక్షల వరకు పొదుపు చేసుకుంది. ఆ నగదును నెల క్రితం ముగ్గురు కొడుకులు పంచుకున్నారు. డబ్బు కోసం ముందుకొచ్చిన కొడుకులు తల్లిదండ్రులకు సపర్యలు చేయడం అనే అంశం రావడంతో ముగ్గురూ ముఖం చాటేశారు. దీంతో వృద్ధ దంపతులిద్దరూ తమకు ఉన్నదాంట్లోనే తినీతినక కాలం వెళ్లదీశారు. ఈ క్రమంలోనే శుక్రవారం గంగమ్మ తనువు చాలించింది. ఈ విషయం తెలిసిన కుమారులు అక్కడకు చేరుకున్నారు. కానీ మానవత్వం మరిచిన మృగాల మాదిరిగా వారు తల్లి మృతదేహం దగ్గర కూడా ఆమె బీమా సొమ్ము గురించి వాదులాడుకున్నారు. ఆఖరికి సొమ్ము సమానంగా పంచేవరకు అంత్యక్రియలు చేయకూడదంటూ భీష్మించుకుని కూర్చుకున్నారు.
ఇలాంటి గొడవలకు ఇది సరైన సమయం కాదు.. ముందు కావాల్సిన కార్యాలను చూడండి.. ఆ తర్వాత మీ పంపకాల గురించి కూర్చుని మాట్లాడుకోవచ్చు.. అని గ్రామస్తులు ఎంత చెప్పినా వాటిని చెవిన వేసుకోలేదు. పైగా గ్రామస్తులపై గొడవకు దిగారు ఆ ప్రబుద్దులు. లెక్క తేలితేనే కట్టె కాలదంటూ పట్టు పట్టారు. ఒకరోజు దాటిన తర్వాత కూడా వారు అంత్యక్రియలకు నిరాకరించారు. అప్పటికే గంగమ్మ మృతదేహం నుంచి దుర్వాసన మొదలైంది. దాంతో ఇక చేసేదేమీ లేక గ్రామస్తులు పోలీసులను ఆశ్రయించారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కుటుంబీకులతో చర్చించిన పోలీసులు ఎట్టకేలకు అంత్యక్రియలు జరిగేలా చేశారు. అయితే తల్లి పార్ధీవ దేహం దగ్గర ఆ ముగ్గురు కుమారులు ప్రవర్తించిన తీరును కళ్ళారా చూసిని గ్రామస్తులు వారిపై విమర్శలు చేస్తుంటే ఈ విషయం విన్న వాళ్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ఏది ఏమైనా బీమా సొమ్ము కోసం తల్లి అంత్యక్రియలను ఆపేయడం అమానవీయమని, అలాంటి వారిని శిక్షించాలని కోరుతున్న వారూ ఉన్నారు. సొమ్ము దాచిన తల్లి పరిస్థితే ఇలా ఉంటే ఏమీ లేని, మంచాన ఉన్న ఆ తండ్రి పరిస్థితి తలచుకుంటేనే భయమేస్తుందని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Next Story