ఆ తల్లికి కన్నీళ్లే సాంగత్యమయ్యాయి. ముగ్గురు కొడుకులు తల్లిని రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు. 20 రోజులుగా ఆమె పడ్డ వేదన మాటలకందనిది. ఎవరా తల్లి.. ఏమిటా కథ...


జీవిత చరమాంకంలో సంతోషంగా గడపాల్సిన ఆ తల్లికి కన్నీళ్లు మిగిలాయి. కన్న బిడ్డలు తల్లిని వదిలించుకునేందుకు దూరంగా తీసుకెళ్లి వదిలేశారు. 20 రాత్రులు చలిలో వణికిపోయింది ఆ తల్లి. కప్పుకునేందుకు దుప్పటి కూడా లేదు. చుట్టుపక్కల వారు ఆమె బాధను చూసి ఆదరించి కాస్త అన్నం పెట్టారు. దిక్కులేకుండా ఓ తల్లి రోడ్డుపక్కన ఉందని పోలీసులకు సమాచారం అందించారు. ఆమె ఎవరు? ఎందుకు ఇలా జరిగింది. కన్న కొడుకులు మానవత్వాన్ని ఎందుకు మరిచిపోయారు?

ఆ తల్లికి ముగ్గరు పిల్లలు వారికి పెళ్లిళ్లు అయ్యాయి. వారిది ప్రకాశం జిల్లా కొమరోలు మండల కేంద్రం. ఇటీవల అన్నదమ్ములు వేరు పోయారు. పంచుకోవడానికి ఆస్తులు లేవు. కాస్త పొలం ఉంది. ఆ పొలాన్ని పెద్దవాడైన రామయ్య తీసుకున్నాడు. చిన్న వాళ్లిద్దరూ లారీ డ్రైవర్లుగా పనిచేస్తారు. నిత్యం పనిచేస్తేనే కాని పొట్ట గడవదు. అన్నదమ్ములు వేరు పడిన దగ్గర నుంచి ఒక్కోడు ఒక్కో ప్రాంతానికి వెళ్లిపోయారు. చిన్న వాడు మాత్రం కొమరోలులోనే ఉంటున్నాడు. వీళ్ల నాన్న కొన్నేళ్ళ క్రితం చనిపోయారు. తండ్రి చనిపోయిన తరువాత అన్నీ తానై తల్లి ముగ్గరు బిడ్డలను పెంచి పెద్ద చేసింది. వారు ప్రయోజకులయ్యారు. ఎవరికి వచ్చిన పని వారు చేస్తున్నారు.

పెద్దవాడైన రామయ్య కొమరోలు మండలంలోని రాజుపాలెంలో నివాసం ఉంటున్నాడు. ఆయనకు కొంత వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమి తల్లిదండ్రుల స్వార్జితం. తండ్రి మరణానంతరం భూమిని తానే బాగుచేసి వ్యవసాయం చేస్తున్నాడు. చిన్న వాళ్లైన వెంకటరమణ, వెంకటేశ్వర్లు ఇద్దరూ డ్రైవర్లుగా పనిచేస్తూ జీవనం గడుపుతున్నారు. ముగ్గురూ వేరు పడే సమయంలో వ్యవసాయం పని తెలియని చిన్నవాళ్లు అన్నకు వ్యవసాయ భూమి అప్పగించారు. రెండో వాడైన వెంకటరమణ వెంకటాపురం అనే గ్రామానికి చేరుకున్నాడు. మూడో వాడైన వెంకటేశ్వర్లు కొమరోలులోనే ఉంటున్నాడు. ఏడాది కాలంగా ఆమె భర్త తయారు చేసిన చిన్న గుడిసెలలో ఉంటోంది. చిన్నవాడు కాస్త అన్నం తెచ్చి ఇచ్చి వెళ్లేవాడు. ఆ గుడిసె ఇటీవల పడిపోవడంతో ఆ తల్లికి ఉండేందుకు నీడ కరువైంది. గ్రామంలో ఆమెను అలాగే వదిలేస్తే చుట్టుపక్కల వారు తన్ని తరిమేస్తారని భయపడిన ఆ తల్లి కొడుకులు ఎలాగైనా భారాన్ని దూరం చేసుకోవాలనుకున్నారు. ఎవరు పోషించాలనే దానిపై ముగ్గురి మధ్య వాదనలు జరిగాయి. ముగ్గురు కలిసి అమ్మను దూరంగా వదిలేసి వదిలించుకోవాలి అనుకున్నారు. కొమరోలు మండలానికి సమీపంలోని వెన్నంపల్లెలో రోడ్డు పక్కన వదిలేసి ఎవరి దోవన వారు వెళ్లిపోయారు. ఆ తల్లిని అక్కడ వదిలేసి ఇప్పటికి 20 రోజులైంది.

బాగా చలికాలం కావడంతో నడవలేని స్థితిలో ఉన్న కలిగవిన వెంకట లక్ష్మమ్మ (75) చలికి రోడ్డు పక్కనే ఉంటూ వణికి పోయింది. కప్పుకునేందుకు దుప్పటి లేదు. పడుకుందామంటే కింద రాళ్లు. ఆమెకు వయసు పై బడటంతో నడవలేని స్థితిలో ఉంది. కొంచెం దూరంగా దోక్కుంటూ జరిగి అక్కడ కాళకృత్యాలు తీర్చుకుని మరి కొంత దూరం జరిగి అక్కడ కూర్చునేది. కనీసం నీళ్లు ఇచ్చే వాళ్లు లేరు. ఆమె పడుతున్న బాధను చూసిన స్థానికులు అక్కున్న చేర్చుకున్నారు. గ్రామం మద్యలో ఉన్న ఆలయం వద్దకు తీసుకొచ్చి అక్కడ ఓ మంచం వేశారు. స్నానం చేయించి మంచంపై కూర్చో బెట్టారు. మూడు రోజుల తరువాత కోమరోలు పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. ఆ ముదుసలి పడుతున్న బాధను ఎస్ఐ వెంకటేశ్వర నాయక్ కు వివరించారు. వెన్నంపల్లె చేరుకున్న ఎస్ఐ ఆ వృద్ధురాలి వద్దకు వెళ్లి పలకరించాడు. జరిగిన విషయం ఆమెను అడిగి తెలుసుకున్నారు. సరిగ్గా మాట్లాడలేని పరిస్థతిలో ఉన్న వెంకట లక్ష్మమ్మ తన కొడుకులు వదిలేసి వెళ్లారని, కన్నీరు పెట్టుకుంది.

ఆమె పెద్ద కొడుకు ఫోన్ నెంబర్ సంపాదించిన ఎస్ఐ వెంకటేశ్వ్లరు నాయక్ రామయ్యను వెంటనే వెన్నంపల్లికి రావాల్సిందిగా చెప్పారు. ఎందుకు ఎస్ఐ రమ్మంటున్నారో తెలుసుకున్న రామయ్య తన ఇద్దరు తమ్ముళ్లను కూడా పిలిపించుకుని ముగ్గురు కలిసి వెన్నంపల్లె వెళ్లి అక్కడ ఉన్న తన తల్లిని ఆదివారం సాయంత్రం ఇంటికి తీసుకొచ్చారు. చిన్న వాడైన వెంకటేశ్వర్లు తన వద్ద తల్లిని ఉంచి ఆమె బాగోగులు చూసుకుంటానని చెప్పారు. వీరి ముగ్గరురితో మాట్లాడిన ఎస్ఐ నిజంగా మీకు భారం అనిపిస్తే చెప్పండి అనాథ ఆశ్రమంలో చేర్పిస్తానని చెప్పారు. చన్ని కొడుకు తానే చూసుకుంటానని, ఇకపై ఇటువంటి తప్పు చేయమని ఎస్ఐకి చెప్పడంతో వారికి తల్లి గొప్పతనం ఎటువంటితో కౌన్సెలింగ్ ద్వారా తెలిపి పంపించారు.

ఎస్ఐ ఇచ్చిన కౌన్సెలింగ్ పనిచేస్తుందా? లేదా? అనేది నిదానంగా కాని తెలియదు. పెద్దవాడు పొలంతో పాటు మా అమ్మ దగ్గర ఉన్న ఆస్తిని పూర్తిగా రాయించుకున్నాడని, వాడు పోషించాల్సింది పోయి మాపై వదిలేసి వెళ్లాడని తమ్ముళ్లు నిట్టూరుస్తున్నారు. ఆస్తుల పంపకాల్లో మాకు అన్యాయం జరిగిందంటే మాకు అన్యాయం జరిగిందని తల్లిని వదిలేసిన వీరు తల్లి గొప్పతనాన్ని గమనించలేక పోయారు. ఆమె లేకుంటే మనకు ఈ జన్మ లేదని తెలిసినా ఎందుకు ఇలాంటి మనస్తత్వం వారికి వచ్చిందనేది పలువురిలో చర్చగా మారింది. 20 రోజులుగా ఎముకలు కొరికే చలిలో భరించలేని బాధను 20 రోజుల పాటు అనుభవించిన తల్లి ఒక్క సారిగా కొడుకులు దగ్గరికి రావడం చూసి కన్నీటి పర్యంతమయ్యారు.

Next Story