అన్నా... వివేకాను చంపిందెవరో తేల్చవే..!
x
వివేకా వర్ధంతి

అన్నా... వివేకాను చంపిందెవరో తేల్చవే..!

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్యకు గురై ఐదేళ్లు. నిందితులు ఎవరో తేలే వరకు వదిలేది లేదని ఆయన కుమార్తె వైస్ సునీత రెడ్డి శపథం చేశారు.


ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్


తిరుపతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురై ఐదేళ్లు కావస్తోంది. రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ ఈ ఘటన సంచలనం రేకెత్తించింది. విపక్ష నేతగా ఉన్నప్పుడు ఆరోపణలు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ఎందుకు సీరియస్‌గా వ్యవహరించడం లేదని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక సామాన్యుల గతి ఏంటి అనేది కూడా నిరసన వ్యక్తం అవుతోంది.మా నాన్నను ఎందుకు చంపారు? ఎవరు చంపారు?? తేలే వరకు వదిలేది లేదని వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీత రెడ్డి అవిశ్రాంతంగా పోరాటం సాగిస్తూనే ఉన్నారు. కడపలోని వైఎస్ వివేకానంద రెడ్డి ఐదో వర్ధంతిని శుక్రవారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎం తులసి రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో.. వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీత రెడ్డి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డితో పాటు తెలుగుదేశం బీజేపీ అన్నా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా హాజరయ్యారు.
"అజాత శత్రువు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి.. సామాన్యుడితో కూడా బాగా కలిసి పోతారు" అనేది ఆయనతో దగ్గరగా మసిలిన పెద్దలే కాదు.. సామాన్య వ్యక్తి కూడా చెప్పే మాట ఇది. 2019 ఎన్నికలకు ముందే వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారు. మళ్ళీ 2024 ఎన్నికలు వచ్చాయి. అయినా.. హత్య కేసులో నిందితులెవరో ఇంకా తేలలేదు. ఈ ఘటన జరిగి శుక్రవారం (రేపటితో) ఐదేండ్లు పూర్తవుతాయి. దేశంలో సంచలనం రేకెత్తించిన ఘటన ఇది. ఇందులో అప్పటి సీఎం ఎన్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ప్రమేయం ఉందంటూ " నారా సుర రక్త చరిత్ర" అని ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాటుగా ఆరోపించారు. కేసులో నిగ్గు తేల్చడానికి అప్పటి సీఎం ఎన్ చంద్రబాబు నాయుడు సీట్ కూడా ఏర్పాటు చేశారు.

ఆ తరువాత... జరిగిన ఎన్నికల్లో..

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఏం అయ్యారు. అన్ని వ్యవస్థలు చేతిలో పెట్టుకుని కూడా.. స్వయాన బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులను పట్టుకోవడంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారు? కుటుంబ సభ్యుడిని అంతం చేస్తే దిక్కులేదు. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటనేది అన్ని వర్గాల నుంచి వినిపిస్తున్న సూటి ప్రశ్న. అంతే కాదు.. " అన్న కోసం అమెరికా నుంచి వచ్చాను. అని 2014లో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీత రెడ్డి ఓ సందర్భంలో చెప్పారు. ఆమే.. ఇప్పుడు "మా అన్న.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఆ పార్టీకి ఓటు వేయద్దు’’ అని పిలుపు ఇస్తున్నారు. దీనిపై సామాన్యులు కూడా మాట్లాడుకుంటున్నారు.
"మా నాన్నను ఎందుకు చంపారు? ఎవరు చంపారు?? నాకు తెలియాలి. అంతవరకు విశ్రమించేది లేదంటూ.. వైయస్ సునీత రెడ్డి పులివెందుల కోర్టు నుంచి ప్రారంభమైన పోరాటం ఢిల్లీలోని సుప్రీంకోర్టు వరకు తీసుకువెళ్లారు. " వైఎస్ వివేకానంద రెడ్డి సాత్వికుడు" అని సీపీఐ నాయకుడు, విశ్లేషకుడు తుంగా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. జమ్మలమడుగు సమీపంలోని పైడిపాలెం, గండికోట మునక ప్రాంతంలో మా బృందం పర్యటించింది. ఆ సమయంలో.. ఆ ప్రాంత ప్రజలు చెప్పిన మాటలు వింటే ఆశ్చర్యం వేసింది. వివేకా సార్ మాతోనే కలిసి తినేవారు.. మాతో ఎక్కువగా గడిపిన రోజులు చాలా సామాన్యంగా ఉండేవారని ఆ ప్రాంత ప్రజలు చెప్పిన మాటను ఆయన ప్రస్తావించారు.


వివేకానంద రెడ్డి హత్య తర్వాత మేమంత లోతుగా ఆలోచన చేయలేదు. ఇప్పుడు మా కళ్ళు తెరుచుకున్నాయని జమ్మలమడుగు సమీప గ్రామాల ప్రజలు చెప్పిన మాటలను ఆయన గుర్తు చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వయాన చెల్లెలు వైఎస్ షర్మిల రెడ్డి కూడా బలంగా స్వరం వినిపిస్తూ వస్తున్నారు. బాబాయ్ కుమార్తె వైఎస్ సునీత రెడ్డికి అండగా నిలిచారు. పీసీసీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వైయస్ షర్మిల తన మాటల తూటాలతో అన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురికావడం సంచలనం రేకెత్తిస్తే... గత ఐదేళ్ల కాలంలో చోటు చేసుకుంటూ వస్తున్న పరిణామాలు.. కుటుంబంలోని అంతర్గత కలహాలను కూడా బట్టబయలు చేశాయని భావిస్తున్నారు. 2019 మార్చి 15 వ తేదీ పులివెందులలోని తన నివాసంలోనే వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారు. ఈ సమాచారం అందుకున్న ఆయన భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత రెడ్డి హైదరాబాద్ నుంచి పులివెందుల చేరుకున్నారు. అప్పటికే వివేకానంద రెడ్డి భౌతికాయానికి ఖననం చేయడానికి కావలసిన ఏర్పాట్లు చేశారు. పులివెందుల పోలీసులు క్రైమ్ నెంబర్ 84/ 2019 గా ఐపీసీ 174 కింద కేసు నమోదు చేశారు.



తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి మృతదేహం దగ్గరే సోదరుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఉండడంవల్ల తనకి ఎలాంటి సందేహం రాలేదని ఆ తర్వాత ఆమె చెప్పుకొచ్చారు. తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి మృతదేహాన్ని ఖననం చేసే సమయంలో.. సందేహించి, పోస్ట్ మార్టం నిర్వహించాలని వైఎస్ సునీత రెడ్డి పట్టుబట్టిన నేపథ్యంలో.. ఈ కేసు కొత్త మలుపు తిరగడంతోపాటు.. స్వయానా బాబాయ్ వైఎస్ భాస్కర్ రెడ్డి రిమాండ్‌కి వెళ్లడం, సోదరుడు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నిందితుడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. స్వయానా తన అన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసును పక్కదారి పట్టించే ప్రయత్నంలో ఉన్నారంటూ ఆయనకు ఓటు వేయొద్దని కూడా.. ఇటీవల ఢిల్లీలో ఆమె పిలుపు ఇవ్వడం ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు.
"వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు సవ్యంగా సాగనివ్వడం లేదు" అని సీపీఐ తిరుపతి జిల్లా కార్యదర్శి రామానాయుడు ఆరోపించారు. వ్యవస్థలు అన్నీ చేతిలో పెట్టుకుని కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు సామాన్యులను కూడా ఆలోచనలో పడేసిందని ఆయన గుర్తు చేశారు. ఓ కేసులో నంద్యాల పర్యటనలో ఉన్న టీడీపీ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడుని వందలాది మంది పోలీసులను పంపి అరెస్ట్ చేయించారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడుగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేయనివ్వకుండా ఎందుకు పార్టీ శ్రేణులతో అడ్డుకున్నారని ఆయన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిలదీశారు.

నిందితులను జగన్ కాపాడుతున్నారు: వివేక సతీమణి

"రాజకీయ కారణాలతో నా భర్తను హత్య చేశారు. రాజశేఖర్ రెడ్డి, వివేకానందరెడ్డి పులివెందులలో ఫ్యాక్షన్‌ను రూపుమాపారు. అలాంటిది ఐదేళ్ల కిందట మా ఇంట్లో ఇంత ఘోరం జరిగింది. మా ఇంట్లోనే శత్రువులు ఉన్నారని ఊహించలేదు" అని వైఎస్ వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ ఓ ఇంటర్వ్యూలో ఆరోపించారు. "నా భర్త హత్య కేసులో నిందితులను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నట్లు అనుమానాలు ఉన్నాయి’’అని అన్నారు. హత్య విషయం అందరికంటే ముందు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య వైఎస్ భారతీ రెడ్డికి ముందే తెలుసు అనే సందేహం వ్యక్తం చేశారు.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు న్యాయం కావాలని కుటుంబమంతా వెళ్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అడిగామని తెలిపారు. "నా కుమార్తె వైఎస్ సునీత రెడ్డి పిటిషన్ వేసే చివరిక్షణంలోనూ సమాచారమిచ్చినా స్పందించలేదు. సునీత ఒంటరిగా న్యాయపోరాటం చేస్తుంటే ముప్పుతిప్పలు పెడుతున్నారు’’ అని వైఎస్ వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆరోపించారు. "మంచి పాలకుడు రాష్ట్రానికి రావాలని ఆకాంక్షిస్తున్నా.. జగన్ పార్టీకి ఓటు వేయవద్దు’’ అని కుమార్తె మాటలను ఆమె పునరుద్ఘాటించారు.


Read More
Next Story