అచ్యుతాపురం ఘటనపై ప్రత్యేక కమిటీ.. వదిలి పెట్టే ప్రసక్తే లేదన్న సీఎం
x

అచ్యుతాపురం ఘటనపై ప్రత్యేక కమిటీ.. వదిలి పెట్టే ప్రసక్తే లేదన్న సీఎం

అచ్యుతాపురంలోని ఎసెన్షియా ఫార్మా సంస్థలో జరిగిన ప్రమాదంపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు.


అచ్యుతాపురంలోని ఎసెన్షియా ఫార్మా సంస్థలో జరిగిన ప్రమాదంపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. 17 మంది ప్రాణాలు బలిగొన్న ఈ ఘటనకు కారకులను వెలికి తీస్తామని, బాధ్యులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనకాపల్లిలో క్షతగాత్రులను పరామర్శించిన వెంటనే ఆయన ప్రమాద ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితులను పరిశీలించి దర్యాప్తుకు సంబంధించి అధికారులను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఈ విషయాన్ని ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంటుందని, పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు అనేవి లేకుండా పోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని తమ ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో క్షమించదని మండిపడ్డారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం జిల్లా అధికారులు, మంత్రులు, స్థానిక ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమావేశం ముగిసిన తర్వాత సీఎం వెల్లడించారు.

అందరిపైనా చర్యలుంటాయ్: సీఎం

‘‘ఈ ఘటనపై విచారణ కోసం హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ప్రమాదం ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? వంటి అంశాలపై పూర్తిస్థాయి విచారణ జరిపి సదరు కమిటీ సమగ్ర నివేదిక అందిస్తుంది. దాని ప్రకారమే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ఈ ప్రమాదానికి కారకులైన ఏ ఒక్కరినీ వదిలి పెట్టే ప్రసక్తే లేదు. అందరిపైనా చర్యలు ఉంటాయి. అధికారుల అలసత్వంపైన కూడా కఠినంగా చర్యలుంటాయి. బాధితులకు అందించిన నష్టపరిహారం అంతా కంపెనీనే భరిస్తుంది. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కంపెనీ యాజమాన్యం అందుబాటులోకి రాలేదు. ఏమైనపోయిందో కూడా తెలియట్లేదు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం.

‘పరిశ్రమలకన్నా ముందు భద్రత ముఖ్యం’

‘‘రాష్ట్రానికి కొత్తకొత్త పరిశ్రమలు రావాలి. తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరగాలి. కానీ వాటన్నింటికన్నా ముందు పరిశ్రమల్లో కావాల్సిన భద్రత ఉండాలి. ఇదిలా చాలా ముఖ్యం. గత ఐదేళ్లలో కేవలం విశాఖపట్నంలో ఇటువంటి ఘటనలు 119 జరిగాయి. వాటిలో మొత్తం 120 మంది ప్రాణాలు కోల్పోయారు. రానున్న కాలంలో ఇలా జరగానికి వీల్లేదు. అందుకోసం అన్ని పరిశ్రమల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు మూకుమ్మడి తనిఖీలు చేపట్టాలి. ఏమాత్రం భద్రతా ప్రమాణాలు తేడాగా ఉన్నా సదరు పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలి. తనిఖీలు ముగిసిన అనంతరం పరిశ్రమల్లోని భద్రత ప్రమాణాలపై పూర్తి స్థాయి నివేదిక‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. వాటిని మళ్ళీ ఆడిట్ చేస్తాం. ప్రమాదాలు పునరావృత్తం కాకుండా చూసుకునే పూర్తి బాధ్యత సంస్థల యాజమాన్యాలదే’’ అని తేల్చి చెప్పారు. ముఖ్యంగా రెడ్‌జోన్‌లోని పరిశ్రమల విషయంలో మరింత కఠినంగా ఉండాలని అధికారులకు సూచించారు.

Read More
Next Story