నూకతాతా.. నన్నో తన్ను తన్నవా!?
ఎవరికైనా కోపం వస్తే కాలితో ఒక్క తన్ను తంతారు... కానీ ఇక్కడ అలా కాదు... కాలితో తొక్కించుకుంటే కష్టాలు పోతాయట...ఆ కాలి స్పర్శ కోసం అక్కడ ప్రజలు ఆరాటపడతారు.
తంగేటి నానాజీ -విశాఖపట్నం
కొన్ని ప్రాంతాల్లో ఆచారాలు వింతగా ఉంటాయి... గిరిజన, మత్స్యకార గ్రామాల్లో అయితే మరీ వింత ఆచారాలు కొనసాగుతుంటాయి. ముక్తి కోసం భక్తులను కాలితో తన్నిన స్వామీజీలను మనం చూసాం.. విన్నాం...అదే భక్తిలో దైవ దర్శనం కోసం పాకులాడుతూ భక్తుల తొక్కిసలాట్లు మనకు తెలుసు... అయితే మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఈ వింత ఆచారం ఈ రెండింటికి విరుద్ధం... ఇది కావాలని తన్నే కార్యక్రమం కాదు... తొక్కిసలాట అంతకన్నా కాదు... భక్తిశ్రద్ధలతో పాన్పులా పడుకునే జనం పై నడుచుకుంటూ వెళ్లే ఓ వింత ఆచారం.
ఎక్కడా గ్రామం... ఏమా ఆచారం...
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట మత్స్యకార గ్రామంలో ఈ వింత ఆచారం కొనసాగుతుంది. నూక తాత పేరిట నిర్వహించే ఈ జాతర ఆధ్యంతం ఆసక్తిభరితంగా సాగుతుంది. ప్రతీ ఏటా మహాశివరాత్రి మరుసటి రోజు మాఘ అమావాస్య రోజున ఈ జాతర నిర్వహిస్తారు.పూర్వీకుల నుండి అక్కడి మత్స్యకారులు నూకతాతను కులదైవంగా కొలుస్తారు.గ్రామంలో నూకతాతకు ప్రత్యేకంగా నిర్మించిన ఆలయంలో విశేష పూజలు గావిస్తారు. మాఘ మాసం అమావాస్య రోజున ఆలయంలోని విగ్రహాలను సముద్ర స్నానానికి తీసుకువెళ్తారు.నూకతాతతో పాటు నూకాలమ్మ, దుర్గాలమ్మ, సత్తెమ్మతల్లి, గంగమ్మతల్లి, శ్రీరాముల దేవతా మూర్తులకు పుణ్యస్నానాలు జరిపిస్తారు. దేవత మూర్తుల పురేగింపుతో జాతర ఘనంగా సాగుతుంది.
ఎవరీ నూక తాత...ఏమా కథ...
మత్యకారులు కులదైవంగా భావించే నూకతాత పిక్కి అనే వంశానికి చెందిన మత్యకారుడు. మత్యకారులకు మంచి,చెడు, దిశ నిర్దేశం చేసేవాడట.అలా నూకతాతను మత్స్యకారులు దేవుడిగా కొలిచేవారు.నూకతాతకు రెండు ఎడ్లు వుండేయట.వాటి పోషణ అంతా నూకతాత చూసుకునేవాడట.కొంతకాలం తర్వాత నూకతాత మరణిస్తే ఆ రెండు ఎడ్లు నూకతాత మృతదేహాన్ని సముద్ర దిబ్బల్లోకి తీసుకెళ్లి పూడ్చాయని, అనంతరం అక్కడే ఆ రెండు ఎడ్లు కూడా మరణించాయని తమ పూర్వికులు చెప్పినట్టు మత్స్యకార గ్రామ పెద్దలు చెబుతున్నారు.అప్పటి నుండి నూకతాత ప్రతి సంవత్సరం మాఘ అమావాస్య మరుసటి రోజు పూజారిని ఆవస్తారని,అలా ఆవహించిన పూజారి పాద స్పర్శ తగిలితే సకల పాపాలు హరించి, ఏడాదంతా కష్టాలు కనుమరుగు అవుతాయని ఆ మత్స్యకారుల ప్రగాఢ విశ్వాసం.ఈ జాతరను మత్యకారులు ఒక మహోన్నత జాతరల ఘనంగా జరుపుకుంటారు.
'సపం' అంటే ఏంటి...
హిందువుల పండగలకు లోటు ఉండదు. స్థానిక ప్రాంతాలలో వారి వారి ఆచార వ్యవహారాలను బట్టి పండగలు. జాతరలు జరుపుకుంటారు. కొన్ని పండగలు విచిత్రంగా, వినూత్నంగా ఉంటాయి.ఆ వింత ఆచారంతో సాగె నూక తాత జాతర ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఓ ప్రత్యేకత చోటు చేసుకుంది. ఈ ప్రాంత గంగపుత్రులు ఆచరించే సాంప్రదాయాన్ని 'సపం' అంటారు.మాఘ అమావాస్య మరుసటి రోజు పూజారిని నూకతాత ఆవహిస్తారు. అలా ఆవహించిన పూజారిని భోయపాడు తీరంలో సముద్ర పుణ్య స్నానం చేయించి తీరం నుండి రాజయ్యపేట నూక తాత దేవాలయం వరకు జాతరగా తీసుకువస్తారు.
ఈ క్రమంలో సుమారు మూడు కిలోమీటర్లు దారిపొడవునా మత్యకారులు నేలమీద పడుకుంటే వారి మీద నుండి పూజారి నడచి వెళతారు. పూజారి పాద స్పర్శ తగిలితే సఖల పాపాలు పోయి మంచి జరుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ సాంప్రదాయాన్ని 'సపం' అంటారు. పూజారి పాదస్పర్శ కోసం ఆ చుట్టుపక్కల గ్రామాలతో పాటు ఉత్తరాంధ్ర మత్స్యకార వాడల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు.
మాంసాహారం నిషిద్ధం...
పండుగ అంటే పిండి వంటలు... మాంసాహారం స్పెషల్ గా ఉంటాయి. ఇక గంగపుత్రుల ఇళ్లల్లో అయితే నీసిలేందే ముద్దే దిగదు... అలాంటిది ఈ జాతర రోజుల్లో మత్స్యకారులు మాంసాహారాన్ని ముట్టరు. ఎంతో పవిత్రంగా ఉండి నూక తాత కాలిస్పర్శ తగలాలని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.రాజయ్యపేట గ్రామంలో ఇదే పెద్దపండుగ. వేర్వేరు చోట్లకు ఉపాధి, విద్య, ఇతర అవ సరాల నిమిత్తం వలస వెళ్లినవారు సంక్రాంతి, ఉగాది వంటి ముఖ్యమైన పండగల కు వచ్చిన రాకపోయినా, నూకతాత పండుగ కు ఖచ్చితంగా వస్తారు. గ్రామాల్లో అమ్మ వార్ల పండుగలకు జంతుబలి సహజం. అయితే ఇక్కడ మాత్రం జంతుబలి నిషేధం. కేవలం పండ్లు, శెనగపప్పు నైవేద్యంగా సమర్పిస్తామని భక్తులు చెబుతు న్నారు. గంగపుత్రులు మూడు రోజుల పాటు ఈ పండగను నిష్ఠగా జరుపుకుంటారు.
Next Story