శ్రీవారికి గోదాదేవి పుష్పానుబంధం.. ఇలా జరిగింది..
x
తిరుమల జీయంగార్ల మఠంలో శ్రీవిల్లి పుత్తూరు గోదాదేవి పుష్మమాలలు

శ్రీవారికి గోదాదేవి పుష్పానుబంధం.. ఇలా జరిగింది..

తిరుమల ఆలయానికి చేరిన శ్రీవిల్లి పుత్తూరు పుష్పమాలలు


తిరుమలలో బ్రహ్మోత్సవేళ ఆదివారం నిర్వహించే గరుడవాహనంపై విహరించే శ్రీవారి మెడలో గోదాదేవి మాలలు అలరించనున్నాయి. శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవలో స్వామివారికి అలంకరించేందుకు తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు నుంచి గోదాదేవిమాలలు శనివారం తిరుమలకు తీసుకుని వచ్చారు.

శ్రీవిల్లిపుత్తూరు ఆలయ ఈఓ చక్కరై అమ్మాళ్ తిరుమలలోని తిరుమలలోని శ్రీబేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద గ‌ల‌ శ్రీపెద్దజీయ‌ర్‌ మఠానికి ముందుగా తీసుకుని వచ్చారు. చిలకలతో అల్లిన ఆ పూలమాలలను పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తిరుమల జీయర్ స్వాముల మఠం నుంచి తమిళనాడు దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ మారియప్పన్,శ్రీవిల్లిపుత్తూరు ఆలయ ఈఓ చక్కరై అమ్మాళ్, వేదపండితులతో కలిసి తిరుమల శ్రీవారి ఆలయం వరకు గోదాదేవిమాలలను ఊరేగింపుగా తీసుకుని వెళ్లారు. ఆలయ మాడవీధుల్లో మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా గోదాదేవి మాలలను శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లారు.
గోదాదేవి మాలల వెనక కథ ఇదీ..

శ్రీవిల్లి పుత్తూరులోని ఆండాళ్ (గోదాదేవి) అమ్మవారు ధరించిన పుష్పమాలలు శ్రీరంగంలోని రంగనాథస్వామికి సమర్పిస్తుంటారు. శ్రీరంగనాథుడికి భక్తురాలు అనేది ఓ కథనం. ఇష్టమైన సఖిగా మరో చారిత్రక కథనం ఉంది.
గోదాదేవి ధరించిన పుష్పమాలలను తిరుమల శ్రీవారు బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహనంపై ఊరేగే రోజు సాయంత్రం తిరుమలలో ఆలయం ముందు తమిళనాడు దేవాదాయ శాఖ, శ్రీవిల్లి పుత్తూరు ఆలయ అర్చకులు, అధికారురు సమర్పిస్తారు. ఆ పూలమాలలు తిరుమలలోని బేడిఆంజనేయస్వామివారి ఆలయం వద్ద ఉన్న శ్రీపెద్దజీయర్ మఠం వద్ద అప్పగిస్తారు. అనంతరం కొత్త వెదురుబుట్టలో తీసుకుని వచ్చే పూలదండలు శ్రీవారి ఆలయం మాడవీధుల్లో ఊరేగింపుగా తీసుకుని వచ్చి, మహద్వారం వద్ద అప్పగించడం ద్వారా శ్రీరంగం, శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ అమ్మవారి కానుక సమర్పిస్తారు.
ఈ సంప్రదాయం వెనుక నేపథ్యం..

తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలోని ఓ ఆధ్మాత్మిక పట్టనం శ్రీవిల్లిపుత్తూరు. ఇక్కడ కొలువైన దేవత ఆండాళ్ లేదా గోదాదేవి. చారిత్రక నేపథ్యంతో కూడిన కథనంలోకి వెళితే..
"గోదాదేవి, శ్రీ విష్ణుచిత్తులకు పూలతోటలో లభించిన కుమార్తె. ఈమెను విష్ణుచిత్తుల దంపతులు చాలా అల్లారుముద్దుగా పెంచుకున్నారు. యుక్త వయస్సులో వచ్చిన తరువాత గోదాదేవి, శ్రీవారు అయిన రంగనాథుడినే తన పతిగా పొందాలని తలచింది. విష్ణుచిత్తులవారు ప్రతిరోజూ స్వామివారికి పూలమాలలు అలంకరణగా తీసుకోని వెళ్ళేవారు, వాటిని గోదాదేవి ముందే ధరించి తరువాత స్వామివారికి పంపించసాగిందిజ, ఒక రోజు ఈ రహస్యం ఆమె తండ్రి విష్ణుచిత్తులవారికి తెలిసి చాలా బాధపడి, గోదాదేవిని కూడా మందలించారట. ఆమె ధరించకుండా పంపించిన పూలమాల రంగనాథుడు అలంకరణకు తీసుకోలేదట. దీనికి తన కుమార్తె గోదాదేవి తప్పిదమే కారణమని బాధపడుతుంటే స్వామివారు విష్ణుచిత్తులతో అదేమీ లేదు. రోజూ తనకు గోదాదేవి ధరించిన మాలాధారణే కావాలని ఆదేశిస్తారు" ఆ మేరకు గోదాదేవి ధరించిన తరువాత రోజూ రంగనాథుడికి అలంకరించే వారనేది కథనం.
ఆ ఆధ్యాత్మిక చారిత్రక నేపథ్యం ఆధారంగా ఏటా శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడోత్సవం పువ్వులను చిలుకలుగా మార్చి, అల్లిన గోదాదేవి మాలలు తీసుకుని వచ్చి సమర్పించడం ఆనవాయిగా పాటిస్తున్నారు.

ఆ రెండు కుటుంబాలే..
శ్రీవిల్లిపుత్తూరులోని రెండు కుటుంబాలు వంతుల వారీగా ఆండాళ్, శిఖామణి అనే రెండు రకాల పూలమాలలు అల్లడం ద్వారా కొత్త వెదురుబుట్టలో తిరుమలకు తీసుకుని వచ్చారు.

ఆండాళ్ మాల– మాల అని కూడా పిలువబడే రెండు శిఖామణి దండలు పెద్ద బుట్టలలో ఉంచి, తిరుపతికి 650 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమిళనాడులోని శ్రీవల్లిపుత్తూరుకు చెందిన రెండు కుటుంబాల పూల తయారీదారులు సమర్పిస్తున్నారు.
భూదేవి అవతారం గోదాదేవి

శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవికి అలంకరించిన మాలలను గరుడసేవ రోజు స్వామివారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీవిల్లిపుత్తూరులోని శ్రీరంగమన్నార్‌స్వామివారి ఆలయానికి గోదాదేవి తండ్రి శ్రీపెరియాళ్వార్‌ పుష్పకైంకర్యం చేసేవార‌ని, రంగనాథునిపై అనన్యభక్తి కలిగిన శ్రీ గోదాదేవి పూలమాలలను మొదట తాను ధరించి ఆ తరువాత స్వామివారికి పంపేవార‌ని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన పెరియాళ్వార్‌ తన కుమార్తెను మందలించారని, ఆ తరువాత గోదాదేవి ధరించకుండా పంపిన మాలలను శ్రీరంగనాథుడు తిరస్కరించార‌ని పురాణ క‌థ‌నం. గోదాదేవి శ్రీవారి దేవేరి అయిన భూదేవి అవతారమని భావిస్తారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు దేవాదాయశాఖ జాయింట్ మారియప్పన్, ఈవో శ్రీ చక్కరై అమ్మాళ్ శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోక‌నాథం, శ్రీవిల్లిపుత్తూరు ఆల‌య స్థానాచార్యులు శ్రీ రమేష్ రంగరాజన్, త‌దిత‌రులు పాల్గొన్నారు.
Read More
Next Story