Tirupati stampede | తొక్కిసలాట: ఈ పాపం పోలీసులది కాదు : డీఐజీ
పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేదు. ఇది డీఐజీ మాట. బాధ్యులైన అధికారులు విభిన్న ప్రకటనలు చేశారు.
తిరుపతి నగరం బైరాగిపట్టెడ స్కూల్ వద్ద జరిగిన సంఘటనకు మేము అంటే. మేము బాధ్యులం కాదని ఎవరికి వారు తప్పుకుంటున్నారు. వైకుంఠ దర్శనం టికెట్ల జారీ కేంద్రంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం. సకాలంలో నిర్ణయం తీసుకోవడంలో జరిగిన జాప్యం దుర్ఘటనకు దారి తీసింది. దీనిపై సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నట్లు అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ హేమోషీ బాజ్ పాయ్ అంటున్నారు.
ఇంటెలిజెన్సీ వైఫల్యం అని చెప్పిన టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. ముందస్తు సమాచారం ఉందని చెప్పిన ఆయన ఎందుకు సకాలంలో యంత్రాంగాన్ని అప్రమత్తం చేయలేదునే ప్రశ్నకు సమాధానం లేదు. కుట్ర ఉందనే సందేహాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అభిప్రాయపడ్డారు. అధికారుల మధ్య మాటల్లో కూడా సమన్వయం లేదనడానికి కూడా ఇదో ఉదాహరణ.
తిరుపతిలో జరిగిన తొక్కిసలాట దుర్షటన తరువాత
తిరుపతి నగరంలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు కల్పించామని అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ హేమోషీ బాజ్ పాయ్ స్పష్టం చేశారు. బైరాగిపట్టెడ వద్ద తొక్కిసలాటలో ఆరుగురు మరణించిన దుర్ఘటన వెనుక బాధాకరం అని వ్యాఖ్యానించిన ఆమె బందోబస్తులో సంఖ్యా పరంగా ఎలాంటి తప్పిదం, కొరత లేదని సమర్థించుకున్నారు. ఊహించని విధంగా రద్దీ పెరగడం, ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న వారు సరైన నిర్ణయం తీసుకోవడంలో ఈ సంఘటన జరిగినట్లు డీఎస్పీ బాధ్యతారాహిత్యం ఉందనే విషయాన్ని చెప్పకనే చెప్పారు.
తిరుపతిలో సంఘటన నేపథ్యంలో తిరుమలలో శుక్రవారం అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ హేమోషీ బాజ్ పాయ్ మీడియాతో మాట్లాడారు. బందోబస్తు ఏర్పాట్లపై పోలీస్ శాఖ తప్పిదం, పొరబాట్లు లేవని అన్నారు.
ఇంకా ఏమన్నారంటే..
వైకుంఠ ఏకాదశికి తిరుపతి, తిరుమలలో సమగ్రమైన ప్రణాళికతో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశాం అన్నారు. సీఎం ఎన్. చంద్రబాబు మూడు రోజుల కుప్పం పర్యటనకు, తిరుమల, తిరుపతి ఆలయాలు, టోకెన్ల జారీ కేంద్రాల వద్ద బందోబస్తుకు వేరువేరుగా పోలీసు బలగాలను నియమించామన్నారు. కుప్పంలో విధులు నిర్వహించిన పోలీసులనే వైకుంఠ ఏకాదశికి కూడా విధులు కేటాయించామని అంటున్నారు. ఇది వాస్తవం కాదని ఆమె తెలిపారు.
"ఏకాదశి కోసం తిరుపతిలో 1500 మందికి పైగానే పోలీసులను టోకెన్ కేంద్రాల వద్ద భక్తుల భద్రత కోసం ఏర్పాటు చేశాం. తిరుమల, తిరుపతి ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి బందోబస్తుకు 2,424 మంది పోలీసులు విధుల్లో ఉన్నారు" అని వివరించారు.
ఆధారాలు సేకరిస్తున్నాం..
తిరుపతిలో బైరాగిపట్టెడ టోకెన్ కేంద్రం వద్ద భక్తులు ఊహించని విధంగా ఒక్కసారిగా రద్దీ పెరగడంతో ఈ సంఘటన జరిగిందని అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ హేమోషీ బాజ్ పాయ్ విశ్లేషించారు. అక్కడ విధుల్లో ఉన్నవారు సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ సంఘటన జరిగినట్టు ప్రాథమిక విచారణలో తెలిసిందని వివరించారు. ఈ విషాద సంఘటనపై విచారణలో బాధ్యులను గుర్తించిన తర్వాత వారిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. టోకెన్లు జారీ చేసిన కేంద్రాల వద్ద గేట్లను తగిన జాగ్రత్తలు తీసుకున్న తర్వాత తెరిచారా? లేదా? విధుల్లో నిర్లక్ష్యంతో గేట్లు తీసి భక్తులను, ఒక్కసారిగా వదిలారా? అనేది కూడా నిశితంగా విచారిస్తున్నాం. విచారణలో వాస్తవాలు వెలుగు చూస్తాయన్నారు. ఈ సంఘటనకు సంబంధించిన సాంకేతికపరమైన సీసీ కెమెరాలు పుటేజ్, మొబైల్లో తీసిన వీడియో ఫుటేజీ, ఫొటోలు, ఇతర అన్ని వివరాలను కూడా సేకరిస్తున్నట్లు వివరించారు.
Next Story