28 నుంచి పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు
కార్తీక బ్రహ్మోత్సవాలకు తిరుచానూరు సొబగులు దిద్దుకుంటోంది. TTD అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. ఈ ఉత్సవాల్లో పంచమీతీర్థం ప్రధానమైంది.
తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 28 నుంచి డిసెంబరు ఆరో తేదీ వరకు కార్తీక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాల బుక్ లెట్లను టీటీడీ ఈఓ జె.శ్యామలరావు సోమవారం టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, డిప్యూటీ ఈఓలు గోవిందరాజన్, ప్రశాంతి, టీటీడీ చీఫ్ పీఆర్ఓ తలారి రవితో కలిసి ఆవిష్కరించారు. తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలోని ఈఓ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం ఈఓ శ్యామలరావు మాట్లాడారు.
తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి వాహనసేవలో కూడా కళాకారులు, యాత్రికులకు అవసరమైన సదుపాయాలు కల్పించడానికి అధికారులకు బాధ్యతలు అప్పగించి, సమన్వయంతో పనిచేయడం ద్వారా సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మెత్సవాలు అధికారులు, సిబ్బంది సహకారం, సమన్వయంతో ఎక్కడా పొరబాట్లకు ఆస్కారం లేకుండా మాడవీధుల్లో ఏర్పాట్లు చేశామన్నారు. మలయప్పస్వామిచ పల్లకిసేవలో భక్తులందరూ చూసేవిధంగా తీసుకున్న చర్యలు ఫలించాయన్నారు. ఆ స్ఫూర్తితోనే తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు. ప్రధానంగా పంచమీతీర్ధం రోజు అమ్మవారి పుష్కరిణిలో ఎలాంటి తొక్కిసలాట జరగకుండా ముందస్తు భద్రతా ఏర్పాట్లను కూడా సమీక్షించనున్నట్లు ఈఓ శ్యామలరావు తెలిపారు. ఈ నెల 28వ తేదీ ధ్వజారోహణంతో కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు.
వాహనసేవల వివరాలు
28వ తేదీ ఉదయం : తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ధ్వజారోహణంతో కార్తీక బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడతారు. అదే రోజు రాత్రి నుంచి పద్మవాతి అమ్మవారు వాహనసేవల్లో మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. బ్రహ్మత్సాలు ప్రారంభమైన రాత్రి అమ్మవారు చిన్నశేషవాహనంలో విహరిస్తారు.
29వ తేదీ: ఉదయం - పెద్దశేషవాహనం
రాత్రి - హంసవాహనం
30వ తేదీ ఉదయం - ముత్యపుపందిరి వాహనం
రాత్రి - సింహవాహనం
డిసెంబర్ 1న : ఉదయం - కల్పవృక్ష వాహనం
రాత్రి - హనుమంతవాహనం
2వ తేదీ ఉదయం - పల్లకీ ఉత్సవం - వసంతోత్సవం
రాత్రి - గజవాహనం
3వ తేదీ ఉదయం - సర్వభూపాల వాహనం
సాయంత్రం - స్వర్ణ రథం
రాత్రి -గరుడవాహనం
4వ తేదీ ఉదయం - సూర్యప్రభ వాహనం
రాత్రి - చంద్రప్రభ వాహనం
5వ తేదీ ఉదయం - రథోత్సవం
రాత్రి - అశ్వ వాహనం
6వ తేదీ ఉదయం - పంచమితీర్థం
రాత్రి - ధ్వజావరోహణంతో కార్తీక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
పంచమీతీర్థం ప్రధాన ఘట్టం
ఈ బ్రహ్సోత్సవాల్లో పంచమితీర్ధం ప్రధాన ఘట్టం. ఆ రోజు జిల్లా నుంచే కాకుండా తమిళనాడు నుంచి ఇసుక వేస్తే రాలనంతగా యాత్రికులు తరలివస్తారు. కార్తీక బ్రహ్సోత్సవాల్లో చివరి రోజు పంచమితీర్థంగా చెబుతారు.
ఆరోజు మధ్యాహ్నం 12 గంటలకు పద్మసరోవరంలో చక్రస్నానం నిర్వహించడం ఆనవాయితీ. పద్మ పుష్కరిణిలో ఆవిర్భవించిన లక్ష్మీదేవి పద్మావతీదేవిగా తిరుచానూరులో కొలువయ్యారనేది చారిత్రక కథనం. పద్మ పుష్కరిణిలో తిరునక్షత్రంలో అమ్మవారు ఆవిర్భవించిన నేపథ్యాన్ని ప్రామాణికంగా తీసుకుని ఆ రోజు పంచమీతీర్థం (చక్రస్నానం) నిర్వహించడం ఆనవాయితీ.
చక్రస్నానం జరిగే సందర్భంలో పద్మసరోవరం నీటిలో యాత్రికులతో నిండిపోతుంది. చక్రస్నానం జరిగే సందర్భంలో పుణ్యస్నానాలు ఆచరిస్తే, సర్వపాప హరణం అవుతుందనేది యాత్రికుల నమ్మకం. ఈ కార్యక్రమంలో పొరుగు రాష్ట్రాల నుంచి వేలసంఖ్యలో వచ్చే యాత్రికులతో తిరుచానూరు కిటకిటలాడుతుంది. దీంతో బ్రహ్మోత్సవాల వేళ, భారీగా ఏర్పాట్లు చేయడానికి టీటీడీ ఇంజినీరింగ్ అధికారులు ఇప్పటికే రంగంలోకి దిగారు బారీకేడ్ల ఏర్పాటు, అమ్మవారి దర్శనానికి క్యూలను మరింత పటిష్టం చేయడంతో పాటు ఆలయం, పరిసరాలు, పద్మపుష్కరిణి మాడవీధులను శుభ్రం చేయడంతో పాటు రంగురంగుల ముగ్గులతో అందంగా అలంకరించే పనులు చేస్తున్నారు.