తిరుపతి ప్రకృతి వైద్యుడు సుబ్రమణ్యం జిందాబాద్!
తిరుపతిలో ఆరోగ్య ప్రదాయినిలా మారిన వ్యక్తి సుబ్రహ్మణ్యం. పదిమందికీ మంచి చేయాలన్న తపనతో రోజూ పొద్దున్నే ఆరోగ్యాన్ని అందిస్తుంటాడు. అదెలాగంటే..
కరోనా తర్వాత ఆరోగ్య పరమయిన స్పృహ జనంలో పెరుగుతున్నది. కరోనా కాలంలో తన తండ్రి మరణం తరువాత ఆరోగ్యం గురించి గట్టిగా పట్టించుకున్న సుబ్రమణ్యం తనకు తెలిసిన కొన్ని చిట్కాలతో తిరుపతి పట్టణం ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ గేటు ముందర, ఐన్ స్టీన్ విగ్రహం ప్రక్కన ఒక చిన్న వీధి అంగడి పుట్ పాత్ మీద తెరిచినాడు. సుబ్రమణ్యం విజయవాడ నుంచి బ్రతుకుతెరువు కోసమనే కాదు, ఆరోగ్య ప్రదాయినిగా ఎదగాలని తిరుపతి వచ్చినాడు. రోజూ పొద్దునే 6 గంటల కంతా ఒక గొడుగు కింద దుకాణం తెరుస్తాడు.
సంచీ నిండా 15 నుండి 20 వరకు ప్లాస్కులు, ఉడక బెట్టిన గుడ్ల సీసా, సద్ద వడలు, నువ్వుల ఉండలు, ఉప్పు, కారం తక్కువగా ఉండే మునగాకు పొడి, పుదీనా పొడి, కాకరకాయ పొడులతో పాటు ఊరగాయలు కొత్త కొత్తవి fresh గా తెస్తూంటాడు. వీటితో పాటు గ్రీన్ టీ, ఇమ్యూనిటీ పెంచే టీ తెస్తాడు. అన్నిటికన్నా ముఖ్యం మల్టీ గ్రెయిన్ (Multi Grain) జావ ఒక హండా నిండా తెస్తాడు. ఇది బెల్లంతోనే తయారు చేస్తాడు. ఇది బాగా అమ్ముడు పోతుందట. దాదాపు 10 రకాల గింజల పొడితో మంచి రుచితో తయారు చేస్తాడు.
కాకరకాయ, గుమ్మడికాయ, సొరకాయ, మునగాకు, కరివేపాకు, పుదీనా, కీర, కర్జూర, అరటి బోదెలతో పాటు క్యారెట్, బీట్ రూటు జ్యూస్‌లు ఫ్లాస్కులు నిండా తెస్తాడు వీటిల్లో, ఉసిరి, నిమ్మరసం పిండుతాడు. వచ్చిన వాళ్ళకి ఒకటి డయాబెటిక్ కోసమని, ఫలానాది కిడ్నీ కోసమని, ఇంకొకటి లావు తగ్గటానికి, ఇది మలబద్ధకానికి మంచిందని, అదుగో అక్కడ కనిపించేది కళ్ల కోసం అని, ఫలానా జ్యూస్ ఒంటికి నిండా మంచిదని చెబుతాడు. నెమ్మదస్తుడు, మర్యాదస్తుడు. వాకింగ్, స్విమ్మింగ్‌లకు వచ్చే వారే గాకుండా, రెగ్యులర్‌గా దూరం నుండి వచ్చి తాగుతుంటారని చెబుతాడు. బల్క్‌గా కూడా సప్లై చేస్తానని చెబుతున్నాడు.
వచ్చిన మనిషిని బట్టి, వీట్ గ్రాస్ జ్యూస్ చాలా మంచిది సార్ అంటాడు. ఫలానా జ్యూస్ ఏ సమయంలో తాగాలో కూడా వివరిస్తాడు. ఎట్లా చెప్పగలుగుతున్నావు సుబ్రమణ్యం అంటే అనుభవంతో సార్ అంటాడు. ఇతను ఎక్కడికయినా పోతే ఆ సమయంలో పుట్ పాత్ దుకాణాన్ని మేనేజ్‌మెంట్ MBA చదివిన కుమారుడు చూస్తాడు. తెల్లవారుజాము 3 గంటలకంతా కుటుంబమంతా నిద్ర లేచి అన్నీ ఫ్రెష్‌గా తయారుచేస్తారు. వాటిని తీసుకుని ఇక్కడికి బయలుదేరుతాడు. ఇది పామిలీ ఎంటర్‌ప్రైజ్ అయింది వాళ్లకి. ఇతను అర్ట్స్ కాలేజీ దగ్గిర , ఇతని భార్య ఎస్వీయు గ్రౌండ్స్ దగ్గర గత మూడు సంవత్సరాలుగా ఈ ఆరోగ్య ప్రదాయినిలను చవగ్గా అందజేస్తున్నారు.
తండ్రి మరణం తనని ఈ సేవ చేయటానికి పురికొల్పిందని సుబ్రమణ్యం చెబుతాడు. ఏ లాభాపేక్ష లేకుండా వచ్చింది చాలనుకునే రకం సుబ్రమణ్యం. ప్రతి రోజూ మొలకెత్తిన గింజల ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతాడు. 10 రూపాయలకే ఒక పొట్లం. అందులో మొలకెత్తిన పెసలతో పాటు, క్యారెట్టు, బీట్ రూట్ ముక్కలు, శెనగ్గింజలు, వేరు శెనగ్గింజలుంటాయి.
నువ్వు ప్రజా వైద్యుడివి సుబ్రమణ్యం అంటే చిక్కగా నవ్వుతాడు. ఇట్లాంటి వారుండబట్టే కదా సార్ లోకం పచ్చగా ఉండేదని ఎవరైనా అంటే ఎంతగా మురిసిపోతాడో. తనకు వస్తున్న రక రకాల రోగాలకు మనిషి ఎప్పుడూ తనదైన వైద్యాన్ని కనుక్కుంటూనే ఉంటాడు. మనిషికి ఏది అవసరమో, శరీరానికి ఏమేం కావాలో ఇట్లాంటి వారు తమకు తెలిసిన పరిజ్ఞానంతో చేస్తున్న ఉపకారం అపురూపమైంది. నేను గత రెండేళ్లుగా వీటిని వాడుతున్నా, ఏదో ప్రయోజనం కలుగుతున్నదని తెలుసుకుంటున్నాను. పది మందీ ఇంత తక్కువ ధరకు లభించే ఇట్లాంటివి వినియోగించుకుని తమ ఆరోగ్యాన్ని పదిల పరుచుకోవటం మంచిదే కదా! సుబ్రమణ్యం జిందాబాద్.