స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో సీఎం చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటీషన్‌ను కొట్టేసిన సుప్రీం కోర్టు.. విచారణకు సహకరించాలని సూచించింది.


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. సీఎం చంద్రబాబు స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు సానుకూలంగా స్పందించింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ రద్దు చేయాలని దాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది. ఈ కేసుకు సంబంధించి దాఖలైన పిటీషన్‌ మీద సుప్రీం కోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఇప్పటికే చార్జిషీట్‌ దాఖలైన నేపథ్యంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుకు సంబంధించి బెయిల్‌ రద్దు విషయంలో జోక్యం చేసుకోవలసిన అవసరం లేదని, బెయిల్‌ రద్దు అంశంలో తామే ఏమీ కల్పించుకోలేమని పేర్కొంది. అయితే.. అవసరమైన సందర్భాల్లో విచారణకు సహకరించాల్సి ఉంటుందని సీఎం చంద్రబాబుకు సుప్రీం కోర్టు సూచించిన సుప్రీం కోర్టు, చంద్రబాబు బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌ను కొట్టేసింది. ఆ మేరకు సుప్రీం కోర్టు జస్టిస్‌ బేలా ఎం త్రివేది నేతృత్వంలోని సుప్రీం కోర్టు బెంచ్‌ బుధవారం తీర్పును వెలువరించింది. సీఎం చంద్రబాబు నాయుడు తరపున ప్రముఖ న్యాయవాది ముకుల్‌ రోహత్గి సుప్రీం కోర్టులో వాదనలు వినిపించారు.

గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ తెరపైకొచ్చింది. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న నేటి సీఎం చంద్రబాబు నాయుడు మీద స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ స్కామ్‌ కేసు నమోదు చేశారు. నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబును 2023 సెప్టెంబరు 9న అరెస్టు చేశారు. సీఆర్పీసీ సెకక్షన్‌ 50(1)(2)కి నోటీసులు జారీ చేసిన పోలీసులు చంద్రబాబు అరెస్టుకు తెర లేపారు. ఐపీసీలోని సెక్షన్లు 120(బి), 166, 167, 418, 420, 465, 468, 471, 409, 201, 109 రెడ్‌ విత్‌ 34, 37 తో పాటు 1988 అవినీతి నిరోధక చట్టం కింద 12, 13(2) వంటి పలు సెక్షన్ల కింద చంద్రబాబును అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. సీఐడీ విచారణ తర్వాత చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు. దాదాపు 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న సచంద్రబాబు అక్టోబరులో జైలు నుంచి విడుదలయ్యారు. నవంబరు 2023లో చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. దీనిపైన నాటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. చంద్రబాబుకు హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని సుప్రీం కోర్టును కోరింది. దీనిపైన బుధవారం విచారణ జరిపిన జస్టిస్‌ బేలా త్రివేది ధర్మాసనం ఆ బెయిల్‌ రద్దు పిటీషన్‌ను కొటివేస్తూ.. సీఎం చంద్రబాబుకు ఊరటను కలిగిస్తూ తీర్పును వెలువరించింది.
Next Story