వక్ఫ్‌ సవరణ చట్టంపై సుప్రీం కోర్టు బుధవారం విచారణ జరిపింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.


మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్‌ సవరణ చట్టం మీద సుప్రీం కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్‌ సవర్‌ చట్టం రాజ్యాంగ విరుద్దమని సుప్రీం కోర్టులో దాదాపు 73కుపైగా పిటీషన్‌లు దాఖలయ్యాయి. వీటిపై బుధవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు వక్ఫ్‌ సవరణ చట్టంపై స్టేకు నిరాకరించింది. అంతేకాకుండా కేంద్రంలోని మోదీ ప్రభుత్వంతో పాటు ఈ కేసులో ప్రతివాదులందరికీ సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. పిటీషనర్లు లేవనెత్తిన అంశాలన్నింటికి జవాబులు చెప్పాలని వారందరికీ సుప్రీం కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

పిటీషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపిస్తూ.. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్‌ సవరణ చట్టం మత స్వేచ్ఛ హక్కుకు భంగం కలిగిస్తుందని, వక్ఫ్‌ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమైనదని, వక్ఫ్‌ అంటే ఇస్లాం మతాచారాలకు అంకితమైందని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రతివాదులైన కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతరుల తరఫున సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. ఈ బిల్లు మీద జాయింట్‌ పార్లమెంట్‌ కమిటీని ఏర్పాటు చేసి, దాని ద్వారా సుదీర్ఘంగా అన్ని వర్గాలతో పాటు చర్చలు జరిపాం. వక్ఫ్‌ అనేది కేవలం చారిటీకి సంబంధించినది మాత్రమే. హిందూ ధార్మిక సంస్థలను కూడా ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి అంటూ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌కుమార్, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. హిందువుల ఆస్తులను హిందువులే నిర్వహిస్తున్నారు కదా. వీటిపైన పార్టమెంటుకు చట్టాలు చేసే అధికారం లేదా? హిందువుల కోసం కూడా పార్లమెంట్‌ చట్టాలు చేస్తుంది కదా. ఢిల్లీ హై కోర్టు కూడా వక్ఫ్‌ బోర్డుకు చెందిన భూమిలోనే ఉందని అంటున్నారు. చారిత్రక, పురవస్తు ఆస్తులను వక్ఫ్‌ ఆస్తులుగా ప్రకటించడానికి వీల్లేదు. సుదీర్ఘకాలంగా ముస్లిం వర్గాల కార్యక్రమాల కోస వాడుతున్న ఆస్తులను డీనోటిఫై చేస్తే అనేక సమస్యలు తలెత్తుతాయి. వక్ఫ్‌ బై యూజర్‌ ఆస్తులను రిజస్టర్‌ చేయడం కష్టం. అయితే ఇది దుర్వినియోగం అయ్యింది. అయితే నిజంగా ముస్లిం ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న వక్ఫ్‌ ఆస్తులు కూడా ఉన్నాయి. అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు విచారణ రేపు కొనసాగుతుండటంతో సుప్రీం కోర్టు ఏ విధంగా తీర్పు వెలువరిస్తుందనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది.
Next Story