ఏపీ రాజధాని అమరావతి చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిఘా కెమెరాల మాటున అమరావతి ఉండబోతోంది.


ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలోని పనులు ఊపందుకున్నాయి. డిసెంబరు నుంచి సచివాలయ నిర్మాణం ప్రారంభం కాబోతోంది. ఇటీవల చెన్నై, హైదరాబాద్‌ నుంచి వచ్చిన నిపుణుల బృందం అసంపూర్తి నిర్మాణాలు పూర్తి చేసుకోవచ్చని సర్టిఫికెట్‌ ఇచ్చింది. దీంతో దాదాపు 90 శాతం పూర్తయిన హెచ్‌వోడీలు, కార్యదర్శులు, ఎమ్మెల్యే, మంత్రుల క్వార్టర్లు రెండు నెలల్లో పూర్తి కానున్నాయి. చురుకుగా పనులు జరుగుతున్నాయి. హైకోర్టు పనులు కూడా మొదలవుతున్నాయి. క్యాంపు కార్యాలయాల్లో డ్రైనేజీ కాలువలు మాత్రమే పూర్తి కావాల్సి ఉంది. పెయింట్స్‌ వేస్తే పూర్తవుతాయి. ఈ ప్రాంతాల్లో ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు తిరిగే అవకాశం ఉన్నందున నిఘా కెమెరాలు సచివాలయం నుంచి హైకోర్టు వరకు ఏర్పాటు చేశారు.

విజయవాడ, మంగళగిరి, తాడేపల్లి నుంచి సచివాలయానికి వచ్చే రూట్లలో సీసీ నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి కరకట్ట మీదుగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, మంతెన సత్యనారాయణ రాజు ప్రకృతి వైద్యశాల, సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు మీదుగా సచివాలయం వరకు, ఉండవల్లి, పెనుమాక, కృష్ణాయపాలెం, మందడం మీదుగా సెక్రటేరియట్‌ వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మొత్తం ప్రస్తుతానికి 74 కెమెరాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఈ కెమెరాలు 2016లోనే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తరువాత వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కెమెరాల విషయం కానీ, రోడ్ల మెయింటెనెన్స్‌ విషయం కానీ పట్టించుకోలేదు. ఆ కెమెరాల్లో కొన్ని పాడై రిపేరుకు వచ్చాయి. రిపేరు చేయాల్సిన వాటిని రిపేరు చేయడం, రిపేరు చేసినా పనికి రాని కెమెరాలను మార్చి కొత్తవి బిగించే కార్యక్రమాన్ని చేపట్టారు. కెమెరాలు ఏర్పాటు చేసిన రోడ్ల వెంట విద్యుత్‌ లైట్లు ఏర్పాటు చేశారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు రెండు లైన్లుగా ఉండటం వల్ల రెండు ఒక లైన్‌లోనే ఒకటి పటమటి వైపు, మరొకటి తూర్పు వైపు కెమెరాలు ఉండేలా ఏర్పాటు చేశారు.
సచివాలయం నుంచి గుంటూరు వరకు కూడా రోడ్డు వెంట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. సచివాలయం నుంచి గుంటూరుకు 30 కిలోమీటర్ల దూరం ఉంది. సచివాలయం నుంచి విజయవాడకు 25 కిలో మీటర్ల దూరం ఉంది. విజయవాడ, తాడేపల్లి, మంగళగిరి, గుంటూరు వైపు కెమెరాలు ఏర్పాటు చేస్తే దాదాపు అమరావతి మొత్తం చుట్టేసినట్లేనని చెప్పొచ్చు.
ప్రధానంగా ముఖ్యమంత్రి సచివాలయానికి వచ్చే రెండు రూట్లలోనూ ప్రస్తుతం సీసీ కెమెరాలు ఉన్నాయి. ఈ కెమెరాల్లో రోడ్లపై జరిగే ప్రతి అంశం రికార్డవుతుందని అధికారులు చెబుతున్నారు. ఎక్కడ ఏ సంఘటన జరిగినా వెంటనే తెలుసుకునేందుకు కెమెరాలు నిఘా విభాగం మాదిరి పనిచేస్తాయి.
సచివాలయంలోని గరుడ కంట్రోల్‌ రూము నుంచి నిఘా కెమెరాల ఆపరేటింగ్‌ జరుగుతుంది. మొత్తం సమాచారం కంట్రోల్‌ రూములో ఉంటుంది. గరుడ కంట్రోల్‌ రూము నుంచి పోలీస్‌ అధికారులు, ఇతర టెక్నికల్‌ సిబ్బంది ఈ సీసీ నిఘా కెమెరాల వ్యవహారాన్ని మానిటరింగ్‌ చేస్తారు.
Next Story