వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎంపికలో సర్వేలు బూటకమని పలువురు రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే అభ్యర్థులను నీళ్ల ప్రాయంగా మార్చేస్తున్నారు.
సర్వేల ఆధారంగా వైఎస్సార్సీపీ టిక్కెట్లు కేటాయిస్తుందని మొదట ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఎన్నికలు మూడు నెలలు ఉన్నవనగానే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించారు. వారానికో జాబితా ప్రకటించారు. ఇప్పటి వరకు 11 జాబితాలు వైఎస్సార్సీపీ విడుదల చేసింది. సుమారు 70 మంది పైన అభ్యర్థుల మార్పు జరిగింది. సిట్టింగ్ లకు కాదని అనేక మంది కొత్త వారికి టిక్కెట్లు కేటాయించారు. సిట్టింగ్ లను చాలా మందిని వేరే నియోజకవర్గాలకు మార్పులు చేశారు.
ఇక్కడ గెలవని వారు అక్కడెలా గెలుస్తారు
స్థానికి నియోజకవర్గంలో గెలవని వారు పక్క నియోజకవర్గంలో ఎలా గెలుస్తారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగింది. ఇప్పటికే ఈ చర్చ కొనసాగుతూనే ఉంది. మంత్రులను సైతం మార్పు చేశారు. ఒక జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేను మరో జిల్లాలోకి మార్చారు. ఉదాహరణకు కొండపి నియోజకర్గ ఇన్ చార్జి వరికూటి అశోక్ బాబును బాపట్ల జిల్లా వేమూరుకు మార్చారు. వేమూరు నుంచి గెలిచిన మేరుగు నాగార్జునను సంతనూతలపాడుకు పంపించారు. పైగా ఆయన మంత్రి కూడా. ఇలా ముక్కూ మొఖం తెలియని నాయకులను ఒకచోట నుంచి మరో చోటుకు మారుస్తూ సర్వేలు ఆధారం అంటే ఎవరైనా నమ్ముతారా? తాను ఎవరిని పోటీలో ఉంచినా గెలుస్తారనే నమ్మకం జగన్ మోహన్ రెడ్డిలో ఉంది.
నిన్నటి అభ్యర్థి రేపటికి మారుతున్నారు
ముందురోజు సమన్వయ కర్తగా నియమించిన వ్యక్తిని మరుసటిరోజు మార్చేస్తున్నారు. ఉదాహరణకు సత్యవేడు ఎమ్మెల్మే కోనేటి ఆదిమూలంను అక్కడి నుంకి తిరుపతి ఎంపీ అభ్యర్థిగా మార్చారు. తిరుపతి సిట్టింగ్ ఎంపీగా ఉన్న డాక్టర్ గురుముర్తిని సత్యవేడు ఎమ్మెల్యేగా మార్చారు. ఆదిమూలం మంత్రి పెద్దిరెడ్డి పోకడను ప్రశ్నించాడని రెండో రోజు ఆదిమూలంను తొలగించి ఎంపీ అభ్యర్థిగా తిరిగి డాక్టర్ గురుముర్తిని ప్రకటించడం విశేషం. అలాగే మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ గా గంజి చిరంజీవిని మొదట సమన్వయ కర్తగా వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. ఆ తరువాత గంజి చిరంజీవిని పక్కన బెట్టి మురుగుడు లావణ్యను సమన్వయ కర్తగా ప్రకటించారు. ఇంకా విచిత్రం ఏమిటంటే అవనిగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ ను మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. అవనిగడ్డకు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ అనే వ్యక్తిని కొత్తగా రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. పది రోజుల తరువాత చంద్రశేఖర్ ను మచిలీపట్నం ఎంపీగా మార్చి సింహాద్రి రమేశ్ బాబును అవనిగడ్డకు మార్చారు. ఇలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
సర్వేలకు విలువుందా?
ఐప్యాక్ సంస్థ ద్వారా సర్వేలు చేయించారు. ఆ సంస్థే కాకుండా మరో నాలుగు సంస్థల ద్వారా కూడా సర్వేలు చేయించారు. ఆ సర్వే రిపోర్టులన్నీ పక్కన బెట్టారు. సర్వేలకు విలువ లేకుండా పోయింది. ఏదైనా సమాచారం కావాలంటే సాక్షి సిబ్బందిని కూడా నమ్మటం లేదు. ఐప్యాక్ వారు ఇచ్చిన సమాచారం మేరకు ముందుకుసాగుతున్నారు. ఐప్యాక్ సంస్థపై జగన్ అంత నమ్మకం పెట్టకున్నారు. సర్వేలు కేవలం అభ్యర్థులను గుర్తించేందుకు మాత్రం ఉపయోగ పడుతుంది. సర్వేల్లో ప్రధానంగా డబ్బు వున్న వారిని చూస్తున్నారు. పైగా కొత్తవారైతే మరీ మంచిదనే భావనలో ఉన్నారు. పాతవారు ఏదో ఒక విషయంలో ప్రశ్నిస్తూ ఉంటారు. కొత్తవారు వినయంతో ఉంటారు. జగన్ వద్ద వినయం ప్రదర్శించే వారైతే చాలనే ఆలోచనలో ఉన్నారు.
జగన్ ఏదనుకుంటే అదే
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏదనుకుంటే అదే అమలు జరుగుతోంది. ఇక్కడ సలహాలు, సూచనలు పనికి రావు, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా సీఎం చెప్పాలని చెప్పింది బయట చెబుతాడు తప్ప ఆయన సొంతంగా ఏ ఒక్కటీ చెప్పడు. పైకి సజ్జల అన్నీ తానవుతున్నాడనేది అపోహ మాత్రమే. జగన్ ప్రత్యేకించి గత ఎన్నికల్లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మాటలు పరిగణలోకి తీసుకున్నాడు తప్ప మరెవరి మాటా వినలేదు. నేను చెప్పినట్లు చేయండని చెప్పేది ఒక్కటే సీఎం జగన్ కు తెలుసు. ఎందుకంటే ఎమ్మెల్యేలు, సమన్వయ కర్తలు, జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్య నాయకులను తాడేపల్లెలోని సీఎం క్యాంపు కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. ఆ సందర్భంగా సీఎం జగన్ ఒక్కరే వేదికపై కూర్చుని మాట్లాడి వారిని అక్కడి నుంచి పంపించారు తప్ప ఒక్కరి అభిప్రాయం కూడా తీసుకోలేదు. అలాగే వాలంటీర్లకు ఉద్భోద చేశారే తప్ప వారి అభిప్రాయలు తీసుకోలేదు.
నేనొక్కడినే..
బటన్ నొక్కి ప్రతి పేద కుటుంబానికి ఆర్థిక సాయం అందించాను. ఒక్కో పేద కుటుంబానికి లక్ష నుంచి ఐదు లక్షల వరకు సాయం అందింది. అలాంటప్పుడు నన్ను కాదని వేరే వారికి ఓటు ఎలా వేస్తారని జగన్ పార్టీ ముఖ్యులను ప్రశ్నిస్తున్నారు. దీంతో నాయకులు ఏమి చెప్పాలో తెలియక తికమక పడుతున్నారు. మనం ఎన్నికల ప్రచారానికి పూర్తి స్థాయిలో వెళితే తప్పకుండా జనం తమను ఆదరిస్తారని, నేను ఎవరిని అభ్యర్థిగా పెట్టినా గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. సభలు ఏపార్టీ పెట్టినా జనం వస్తున్నారు. డబ్బు, మద్యం ఇచ్చినంతకాలం జనం వస్తూనే వుంటారని రాజకీయ మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు.