వాలంటర్లను రాజకీయాలకు వాడుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ హైకోర్టు బుధవారం ఈసీఐని ఆదేశించింది.


జి.విజయ కుమార్

వాలంటీర్ల వ్యవస్థను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్న వారిపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని బుధవారం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వాలంటీర్లను రాజకీయాల ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఫిబ్రవరి 1న ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా దృష్టికి సిటిజన్‌ ఫర్‌ డెమోక్రెసీ తీసుకు పోయింది. ఆ ఫిర్యాదులను పరిశీలించిన ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని ఆంధ్రప్రదేశ్‌ ఎలక్షన్‌ కమీషనర్‌కు అదే రోజు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులను సిఇఓ ఫిబ్రవరి 14న జిల్లా కలెక్టర్లకు పంపించారు. ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా ఆదేశాలను కలెక్టర్లకు తెలియ జేయడంలో సిఇఓ నిర్లక్షంగా వ్యవహరించారని, రెండు వారాల తర్వాత ఈ ఉత్తర్వులను కలెక్టర్లకు పంపించారని, ఈ జాప్యానికి తగిన చర్యలు తీసుకోవాలని ఫిబ్రవరి 5న ఏపి హైకోర్టులో సిటిజన్‌ ఫర్‌ డెమోక్రెసీ పిటీషన్‌ను దాఖలు చేసింది. ఈ ఉత్తర్వులు కలెక్టర్లకు లేటుగా అందిన కారణంగా ఫిబ్రవరి 15న వైఎస్‌ఆర్‌సీపీ వాలంటీర్లకు ఒక సమావేశం నిర్వహించి ఎన్నికల ఏజెంట్లుగా ఎలా వ్యవహరించాలో చెప్పిందని ఇది ఇసిఐ స్వతంత్ర ప్రతిపత్తిని దిక్కరించడమే అవుతుందని, స్వేచ్ఛగా ఎన్నికల నిర్వహణకు ఇది సవాలుగా మారిందని, సిఎఫ్‌డి పేర్కొంది. ఈ నేపథ్యంలో విధిలేని పరిస్థితుల్లో సిఇఓ ఉదాసీన వైఖరిని ప్రశ్నిస్తూ ఏపి హైకోర్టులో సిఎఫ్‌డి పిటిషన్‌ దాఖలు చేసింది. బుధవారం పిటిషన్‌పై విచారణ జరిపిన చీఫ్‌ జస్టిస్‌ ధర్మాసనం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఈసిఐని ఆదేశించింది. సిటిజన్‌ ఫర్‌ డెమోక్రెసీ తరఫున ప్రముఖ న్యాయవాది ఎన్‌ అశ్విన్‌కుమార్‌ వాదనలు వినిపించారు.
ఆదేశాల అమల్లో ఈసీఐ విఫలమైతే అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం..సిఎఫ్‌డి
ఏపి హైకోర్టు ఆదేశాలను ఈసీఐ, సీఈఓ ఆంధ్రప్రదేశ్‌ వెంటనే అమలు చేసి నష్ట నివారణ చర్యలు తీసుకుంటారనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నట్లు సిఎఫ్‌డి కార్యదర్శి డాక్టర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్, జాయింట్‌ సెక్రెటరీ వల్లంరెడ్డి లక్ష్మణ్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. చర్యలు తీసుకోవడంలో విఫలం అయితే తిరిగి ఈ విషయంలో అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆ ప్రకటనలో వివరించారు.
Next Story