తమ్ముళ్ల లిక్కర్ సిండికేట్ మీద చంద్రబాబు నాయుడు ఆగ్రహం
తెలుగుదేశం పార్టీలో ఏమి జరుగుతోంది. ఎమ్మెల్యేలు పార్టీ అధినేత మాట ఎందుకు వినలేదు? మద్యం వ్యాపారంలో ఎందుకు జోక్యం చేసుకున్నారు? షాపులన్నీ ఎందుకు దక్కించుకున్నారు? దాదాపు మూడొంతుల షాపులు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల అనుచరులకే ఎందుకు వచ్చాయి? ఇప్పడు రాష్ట్రంలో ఈ అంశపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఈనెల 16 నుంచి నూతన మద్యం షాపులు పనిచేయడం మొదలు పెట్టాయి. ఎక్కువ మంది గతంలో ప్రభుత్వం నిర్వహించిన మద్యం దుకాణాలనే అద్దెలకు తీసుకున్నారు. ప్రభుత్వం గతంలో చెల్లించిన అద్దెలే చెల్లిస్తున్నారు. అక్కడక్కడ ఓనర్లు అద్దెలు పెంచారు. అయినా అవే షాపులు కొనసాగించేందుకు మద్యం వ్యాపారులు నిర్ణయించుకున్నారు.
చంద్రబాబు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?
మద్యం వ్యాపారంలోకి వెళ్లొద్దని ఎంత చెప్పినా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు వినలేదు. నేరుగా వారి అనుచరులకు షాపులు దక్కేలా ఒక్కో షాపుకు పది మంది చేత దరఖాస్తులు చేయించారు. దీంతో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, ఎంపీల అనుచరులకే దక్కాయి. తాను చెప్పినా వినకుండా మద్యం షాపులకు తమ అనుచరుల ద్వారా దరఖస్తులు చేయించడంతో కోపం తెచ్చుకున్న ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి భారీగా పార్టీ ఫండ్ తీసుకోవాలని పార్టీ అధ్యక్షుడిని ఆదేశించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇంటిలిజెన్స్ నుంచి సమాచారం తెప్పించుకున్న తరువాత సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎక్కువ మంది టీడీపీ వారికే షాపులు దక్కినట్లు ఇంటిలిజెన్స్ వారు సీఎంకు సమాచారం ఇచ్చారు. ఒక్కో ఎమ్మెల్యేకు ఎన్ని షాపులు దక్కాయనే విషయాన్ని కూడా ఇంటిలిజెన్స్ వారు వివరంగా సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.
సిండికేట్‌లుగా మారారు
షాపులకు దరఖాస్తులు చేసేటప్పుడు సిండికేట్ అయ్యారు. షాపులు వచ్చిన తరువాత కూడా వ్యాపారులు సిండికేట్ అయ్యారు. ఎందుకు సిండికేట్ అయ్యారంటే వ్యాపారంలో ఒడిదుడుకులు ఉంటాయి. పైగా ఎక్సైజ్ వారి భారీ నుంచి ఎప్పటికప్పుడు తప్పించుకునేందుకు సిండికేట్ ఒక్కటే మార్గమని నిర్ణయించుకున్నారు. ఎక్కువ షాపులు దక్కించుకున్న వారు, తక్కువ షాపులు దక్కించుకున్న వారు ఒక్కటయ్యారు. వచ్చిన లాభాలు సమానంగా పంచుకుందామనే నిర్ణయానికి వచ్చారు. ఎవరైనా సిండికేట్‌లో కలవకుంటే వారికి చుక్కలు చూపిస్తున్నారు. ఉదాహరణకు ప్రకాశం జిల్లా మేడపి గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి షాపు వచ్చింది. అతనిని సిండికేట్‌లో కలవాలని అడిగారు. అందుకు అతను అంగీకరించలేదు. మేడపి షాపు రోజుకు రెండు లక్షలు పైన వ్యాపారం చేస్తుందని, అలాంటప్పుడు నేను ఎందుకు మీతో కలవాలని ఆయన నిరాకరించారు. త్రిపురాంతకం మండలంలోని వారంతా సిండికేట్ అయి మేడపిలో మద్యం షాపు దక్కించుకున్న వ్యక్తికి అద్దెకు రూము దొరకకుండా చేశారు. దీంతో అతనికి ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.
షాపులు ఎక్కడైనా పెట్టకుకోవచ్చు
ఒక్కో మండలానికి మూడు నుంచి ఐదు మద్యం షాపుల వరకు ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ మండలాల్లో జనాభాను బట్టి కొన్ని చోట్ల ఎక్కువ షాపులు కూడా ఉన్నాయి. మండలంలోని ఏ గ్రామంలోనైనా షాపులు పెట్టుకునేందుకు ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ అనుమతి ఇచ్చింది. ఉదాహరణకు గుంటూరు రూరల్ మండలంలోని కాకాని గ్రామానికి షాపు మంజూరు అయింది. అయితే అక్కడ కాకుండా మరో గ్రామంలో షాపు పెట్టుకోవచ్చు. లేదా అన్ని షాపులు మండల కేంద్రంలోనైనా పెట్టుకోవచ్చు. దీంతో మద్యం వ్యాపారులు ఎక్కువగా సిండికేట్ అయ్యారు. సిండికేట్ కావడం వల్ల కాపు సారాను అరికట్టేందుకు కలిసికట్టుగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సముద్ర తీర ప్రాంతాల్లోనూ, అటవీ ప్రాంతాల్లోనూ కాపు సారా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎక్సైజ్ వారు సరిగ్గా పట్టించుకోకపోయినా నేరుగా మద్యం వ్యాపారులు రంగంలోకి దిగి సారా కాచే వారిని ఎదుర్కోవచ్చని పలువురు మద్యం వ్యాపారులు తెలిపారు.
Next Story