ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌పై ప్రముఖ నటుడు ప్రకాష్‌ రాజ్‌ మరో సారి స్పందించారు. తమిళనాడు సీఎం, డిప్యూటీ సీఎంల సమక్షంలో ప్రకాష్‌రాజ్‌ మాట్లాడారు.


తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌ సమానత్వం గురించి మాట్లాడుతుంటే, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారని ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌ అన్నారు. తమిళనాడులో ఒక పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్న ప్రకాష్‌రాజ్‌ మరో సారి ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తీరును తప్పు పట్టారు. శనివారం చెన్నైలో పుస్తక ఆవిష్కరణ సభ జరిగింది. దీనికి ప్రకాష్‌రాజ్‌ హాజరయ్యారు. గమ్మత్తేంటంటే ఇదే కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుమారుడు, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌లు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రకాష్‌ మాట్లాడుతూ ఉదయనిధి స్టాలిన్‌ సమానత్వం గురించి మాట్లాడుతున్నారని అభినందించారు. డిప్యూటీ సీఎం అంటే ఉదియనిధి స్టాలిన్‌ మాదిరిగా ఉండాలని అభినందించారు. తమిళనాడు సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి దిగిన ఫొటోను తన ట్వీటర్‌ వేదికగా పంచుకున్నారు. విత్‌ డిప్యూటీ సీఎం.. జస్ట్‌ ఆస్కింగ్‌ అంటూ పోస్టు పెట్టారు.

ఇదే సమయంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ దానిని పక్కన పెట్టారని, సనాతన ధర్మం అంటూ ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రకాష్‌రాజ్‌ చేసిన వ్యాఖ్యలు అటు తమిళనాడులోను, ఇటు ఆంధ్రప్రదేశ్‌లోను చర్చనీయాంశంగా మారాయి. లడ్డూ వివాదం తెరపైకి వచ్చిన నాటి నుంచి పవన్‌ కళ్యాణ్‌ పరిపాలనను పూర్తిగా పక్కన పెట్టారని, సనాతన ధర్మం, హిందూ ధర్మం పేరుతో మత రాజకీయాలు చేయడానికే తన సమయాన్ని వెచ్చిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరో వైపు తిరుపతి వారాహి డిక్లరేషన్‌ సభలో తమిళనాడు ఉదయనిధి స్టాలిన్‌పై పవన్‌ కళ్యాణ్‌ చేసిన విమర్శలు నేపథ్యంలో ప్రకాష్‌రాజ్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
తిరుపతి లడ్డూ వివాదం మొదలైన నాటి నుంచి ప్రకాష్‌ రాజ్‌ తన ట్వీటర్‌ వేదికగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ వ్యవహార శైలిని ప్రశ్నిస్తూ వచ్చారు. మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలోనే ఇది చోటు చేసుకుంది. విచారణ జరిపించి దోషులను శిక్షించండి. అది చేయకుండా లడ్డూ వివాదాన్ని పెద్దది చేయడం ఏంటని ప్రకాష్‌రాజ్‌ ప్రశ్నించారు. దీనికి సమాధానం చెప్ప లేని పవన్‌ కళ్యాణ్‌ హిందూ ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని ప్రకాష్‌ పేరును ప్రస్తావించి మరి హెచ్చరించారు. మీరు అపార్థం చేసుకున్నట్టున్నారు.. తీరిక సమయంలో నా పోస్టును మరో సారి చదవి అర్థం చేసుకోండి ప్లీజ్‌ అంటూ ప్రకాష్‌ రాజ్‌ మరో ట్వీట్‌ చేశారు. అలా ప్రకాష్‌రాజ్‌ పవన్‌ కళ్యాణ్‌ వ్యవహార శైలిని తన ట్వీటర్ల ద్వారా ప్రశ్నించారు.
Next Story