వైసీపీ శ్రేణులు ఆందోళనలో ఉన్నారు. పోలీసులు రంగంలోకి దిగారు. ఎఫ్‌ఎస్‌ఎల్, ఫోరెన్సిక్ అధికారులు ఆధారాలు సేకరించారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాసానికి భద్రత భయం పట్టుకుంది. జగన్ నివాసానికి సమీపంలో వరుసగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడంతో ఈ అంశం తెరపైకొచ్చింది. దీంతో అటు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఇటు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనలు చెందుతున్నారు. వరుస అగ్ని ప్రమాదాలు ఎందుకు జరిగాయి.. ఎవరు చేశారనే అంశాలు తేలక పోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
తాడేపల్లిలో జగన్‌మోహన్‌రెడ్డి తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అదే ప్రాంగణంలోనే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా ఉంది. పార్టీ సమావేశాలు, మీడియా సమావేశాలు అందులోనే నిర్వహిస్తుంటారు. జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా అధికారంలో ఉన్నప్పుడు దీనిని క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నారు. ఇక్కడ నుంచే అధికారులతో సమీక్ష సమావేశాలు, కేబినెట్ సమావేశాలు వంటి అధికారిక కార్యకలాపాలు నిర్వహించే వారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు తన క్యాంపు క్యార్యాలయం అధికారులు, పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులతో నిత్యం రద్దీగా ఉండేది. భారీ స్థాయిలో బందోబస్తు ఉండేది. దుర్భేద్యమైన ఇనుప కంచెను కూడా తన ఇంటి చుట్టూ రక్షణ కవచంగా ఏర్పాటు చేసుకున్నారు. సీఎం కావడంతో ఇంటి చుట్టూ పోలీసులు పహారా కాసేవారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా నిఘా పెట్టే వారు.
ఎన్నికల్లో తన పార్టీ ఓడి పోవడంతో క్యాంపు కార్యాలయాన్ని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంగా ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు పార్టీ కార్యక్రమాలు మాత్రమే నిర్వహిస్తున్నారు. మరో వైపు గతంలో ఉన్నట్టు ఇప్పుడు బందో బస్తు లేదు. పోలీసు బలగాలు కూడా తగ్గాయి. నిఘా వ్యవస్థ కూడా పెద్దగా లేదు. గతంలో పోలీసుల భద్రత చేతుల్లో ఉండే నివాసం పక్కనే ఉన్న రోడ్డును క్లియర్ చేశారు. యధావిధిగా ట్రాఫిక్ నడుస్తోంది.
కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జగన్ ఉంటున్న ఇంటి ప్రాంతంపై కూటమి శ్రేణులు కన్నేశాయి. దీనికి తోడు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నివాసం తాడేపల్లి మండల పరిధిలోనే ఉండటంతో టీడీపీ శ్రేణులు ఇదే మార్గం గుండా నిత్యం రాకపోకలు చేస్తుంటారు. సచివాలయానికి వెళ్లాలన్నా, సీఎం నివాసానికి వెళ్లాలన్నా, మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి వెళ్లాలన్నా ఈ మార్గం మీదనే ప్రయాణాలు సాగిస్తుంటారు.
మరో వైపు ఇటీవల మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా టీడీపీ శ్రేణులు, లోకేష్ అభిమానులు జగన్ ఇంటి ముందు రోడ్డులో పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టారు. టీడీపీ జెండాలు, లోకేష్ ఫ్లెక్సీలు చేత పట్టుకొని జై టీడీపీ, జై లోకేష్, జై సీబీఎన్ అని నినాదాలు చేసుకుంటూ అటూ ఇటూ తిరిగారు. కార్లు, బైక్‌ల మీద అరుచుకుంటూ చక్కర్లు కొట్టారు. లోకేష్ తాలూకు కాబట్టి.. ఈ తలనొప్పి ఎందుకనుకున్నారో.. ఏమో కానీ ఆ సమయంలో అక్కడున్న పోలీసులు కూడా చోద్యం చూస్తూ ఉండి పోయారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి సంఘటనలు ఇది వరకు కూడా జరిగాయి. తరచుగా టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగానే జగన్ నివాసం ప్రాంతంలో గొడవలు చేస్తున్నారని, జగన్ భద్రతకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారని ఆందోళనలు వైఎస్‌ఆర్‌సీపీలో వ్యక్తం అవుతున్నాయి.
అయితే తాజాగా జగన్ నివాసానికి సమీపంలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం ఆందోళనలకు దారి తీసింది. నివాసం వద్ద రోడ్డు వెంబడి వరుసగా రెండు సార్లు జరగడంతో దీనిని అటు మాజీ సీఎం జగన్, ఇటు వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు సిరియస్‌గానే తీసుకున్నారు. దీని వెనుక కుట్ర కోణం ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వైఎస్‌ఆర్‌సీపీ గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అంకంరెడ్డి నాగనారాయణ మూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. తాడేపల్లి పోలీసుల ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. గుంటూరు జిల్లా అదనపు ఎస్సీ రవికుమార్, మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ, తాడేపల్లి సీఐ కళ్యాణ్‌రాజు ఈ ప్రాంతాన్ని సందర్శించారు. వీరి పర్యవేక్షణలో గుంటూరు జిల్లా ఎఫ్‌ఎస్‌ఎల్ బృందం, ఫోరెన్సిక్ టీమ్‌లు రంగంలోకి దిగాయి. అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఈ వరుస సంఘటనల మీద పోలీసులు ఏ విధమైన నివేదిక ఇస్తారనేదానిపై ఆసక్తి నెలకొంది.
Next Story