TCS కు ఎకరం  99 పైసలకే అప్పగించిన చంద్రబాబు సర్కార్
x

TCS కు ఎకరం 99 పైసలకే అప్పగించిన చంద్రబాబు సర్కార్

ఎట్టిపరిస్థితుల్లోను ప్రైవేట్ సంస్థలకు మార్కెట్ ధర కన్నా తక్కువకు ఇవ్వకూడదని స్పష్టంగా ఆదేశాలన్నపుడు 21 ఎకరాలు ఇవ్వడం ఎలా సాధ్యం


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, అధికంగా లాభాలు గడిస్తున్న TCS కంపెనీకి, విశాఖలో రుషికొండ ప్రాంతంలో, 21.16 ఎకరాల విలువైనభూమిని, చట్టవిరుద్ధంగా ఎకరానికి 99 పైసలకు ధారాదత్తం చేయడం జరిగింది. ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమైన ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని మాజీ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి డా ఇఎఎస్ శర్మ కోరుతున్నారు.


వివరాలు:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (Tata Consultancy Services :TCS) కంపెనీకి విశాఖపట్నం నగర ప్రాంతంలో, రుషికొండ దగ్గర 21.16 ఎకరాలభూమిని, సంవత్సరానికి 99 పైసలకుమాత్రమే దీర్ఘకాలిక లీజుకు ఇచ్చినట్టు వార్త చూశాను.

ఆ ప్రాంతంలో TCS కంపెనీ, ఒక IT పరిశ్రమను పెట్టి, 12,000 మందికి ఉద్యోగ అవకాశాలు కలిగిస్తుందని, రాష్ట్ర ఐటి శాఖ మంత్రినారా లోకేష్ గారు తెలియచేసారు. ఈ వార్త ప్రముఖంగా వచ్చింది.

ఈ సందర్భంగా TCS యూనిట్, విశాఖలో 12,000 మంది స్థా నికయువతకు ఉద్యోగ అవకాశాలు తప్పకుండా కలిగిస్తామని, ఎన్ని సంవత్సరాల్లో , అది సాధ్యమవుతుందని ప్రభుత్వానికి రాతపూర్వకంగా హామీ ఇచ్చారో లేదో, ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాలి.

గతంలో, కంపెనీ యజమానులు, పెట్టు బడులు పెడతామని, ఉద్యోగాలు ఇస్తామని, చౌకగా ప్రభుత్వ భూములు తీసుకుని, అదే విధంగా హామీలు నోటిమాట మీద ఇచ్చినా, అటువంటి ఉద్యోగ అవకాశాలు ఈరోజు వరకు, విశాఖ యువతకు ఇవ్వకపోవడం విశాఖ ప్రజలకు తెలుసు.

భూములు మాత్రం ఆ ప్రైవేటు కంపెనీల ఆధీనంలో ఇంకా ఉన్నాయి. విశాఖలో, రుషికొండ లో,భూముల విలువ, రాష్ట్ర రిజిస్ట్రేషన్ శాఖ ప్రచురించిన రేట్ల ప్రకారం, ఒక చదరపుయార్డు కు 30,000 రూపాయలు ఉంది. ఆ రేటుమార్కెట్ ధరతో పోలిస్తే, చాలా తక్కువ.

అయినా, ఆ రేట్ ఆధారంగా తీసుకుంటే, రుషికొండలో, ఒక ఎకరం విలువ సుమారు 15 కోట్ల రూపాయలు ఉంటుంది. అంటే, TCS కు ఇచ్చిన 21.16 ఎకరాలభూమి, సుమారు 320 కోట్ల రూపాయలకు మించి ఉంటుంది.

రాష్ట్ర ప్రభుత్వం 2012 లో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం (GOMs 571 (Revenue) dated 14-9-2012), ప్రభుత్వభూములను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వకూడదు. అటువంటిభూముల వార్షిక లీజు రెంటల్, మార్కెట్ విలువ మీద 10% కన్నా తక్కువ ఉండకూడదు. పైగా అటువంటి లీజు రెంటల్, ప్రతిమూడు సంవత్సరాలకు ఒకసారిమార్కెట్ ధర ఆధారంగా సవరించాలి.

ఆ ఉత్తర్వులు ప్రభుత్వం BSO 24 కు అనుగుణంగా ఇవ్వడం జరిగింది. అంటే, TCS కు, రాష్ట్ర ప్రభుత్వం, అతి చవక ధరకు, ప్రభుత్వభూమిని ఇవ్వడం, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు పూర్తిగా వ్యతిరేకమని గుర్తించాలి. అది కాకుండా, 2G స్పెక్ట్రమ్ కేసులో, ఇతర కేసుల్లో , సుప్రీం కోర్టు వారు, ప్రభుత్వభూముల వంటి ప్రకృతి వనరుల విషయంలో, ప్రభుత్వం, ప్రజల ట్రస్టీ గామాత్రమే వ్యవహరించాలని, అటువంటి భూములను, ప్రజా ప్రయోజనాలకుమాత్రమే ఉపయోగించాలని, ఎట్టిపరిస్థితుల్లో ను, ప్రైవేట్ సంస్థలకుమార్కెట్ ధర కన్నా తక్కువ ధరకు ఇవ్వకూడదని స్పష్టముగా, పదే పదే ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

ముఖ్యంగా, సుప్రీం కోర్టు, జగ పాల్ సింగ్ vs పంజాబ్ ప్రభుత్వం [సివిల్ అప్పీల్ No. 1132 / 2011 @ SLP(C) No.3109/2011 arising from Special Leave Petition (Civil) CC No. 19869 of 2010)] ]కేసులో, 2011 జనవరి 28న ఇచ్చిన తీర్పులో, పంచాయతీలలో, మునిసిపాలిటీలలో, ప్రభుత్వభూములను, ప్రైవేటు సంస్థలకు ఇవ్వకూడదని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించడం జరిగింద

మీద సూచించిన విధంగా, ప్రభుత్వం, TCS కంపెనీకి అతి చవక గా 21.16 ఎకరాల విలువైన భూమిని ఇవ్వడం, రాష్ట్ర ప్రభుత్వ విధానాలనే కాకుండా, సుప్రీం కోర్టు వారి ఉత్తర్వులను కూడా ఉల్లంఘించడం అవుతుంది. TCS కంపెనీ, దేశంలో అధికంగా లాభాలు గణించే సంస్థ. ఉదాహరణకు 2024 లో, TCS గణించిన లాభం 62,165 కోట్ల రూపాయలు. అటువంటి అత్యధికమైన లాభాలు గణించే కంపెనీ కి, విలువైన 21.16 ఎకరాల ప్రభుత్వభూమిని, సంవత్సరానికి 99 పైసల లీజుకు ప్రభుత్వం ముట్టచెప్పడం హాస్యాస్పదంగా ఉంది.

అదే భూమిని, ఒక ప్రభుత్వ ఆసుపత్రికో , ప్రభుత్వ విద్యా సంస్థకో, ఒక సంక్షేమ ప్రయోజనం కోసమో, ఇస్తేప్రజలు హర్షించేవారు. ఆభూమిని సుప్రీం కోర్టు వారి ఆదేశాలను ఉల్లంఘిస్తూ , ఒక ప్రైవేటు కంపెనీకి ధారాదత్తం చేయడం చాలా బాధాకరమైన విషయం. ప్రభుత్వ రంగ సంస్థలలో, రాజ్యాంగం కలిగించిన రిజర్వేషన్ వ్యవస్థ కారణంగా, SC/ST/ OBC ప్రజలకు తప్పనిసరిగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.


డాక్టర్మ ఇఎఎస్ శర్మ

ప్రైవేటు కంపెనీలయాజమాన్యాలు అటువంటి రిజర్వేషన్ సౌకర్యం కలిగించరు. గతంలో ఇదే రాష్ట్ర ప్రభుత్వం, టీడీపీ పార్టీఆధ్వర్యంలో, కేంద్రప్రభుత్వ సంస్థల పట్ల, ముఖ్యంగా దేశ భద్రతను నిరంతరం పరిరక్షించే భారత నావికా దళం పట్ల, ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ కార్మికులకు వైద్య సౌకర్యాలు కలిగించే ESI ఆసుపత్రుల పట్ల, రాష్ట్ర ప్రజలకు అండ దండ గా నిలిచే LIC, ఫుడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (FCI) వంటి సంస్థల పట్ల, TCS పట్లచూపించిన ఇటువంటి ఆప్యాయత, ఔదార్యంచూపించకపోవడం, చాలా ఆశ్చర్యకరంగా ఉంది.

గతంలో ప్రభుత్వ రంగ సంస్థలకు, టీడీపీ ఆధ్వర్యంలో కేటాయించబడినభూముల వివరాలు, ఆ భూముల విషయంలో, ప్రభుత్వం విధించిన ధరల వివరాలుచూస్తే ఎకరా ధర నాలుగన్నర కోట్ల నుంచి 63 లక్షల దాకా నిర్ణయించారు. ఉదాహరణకు ఎపి పౌర సరఫరాల శాఖకు ఎకరాకు ఒక చోట్ నాలుగు కోట్లకు అందించారు. కర్నూలు జిల్లా తాండ్రపాడు సమీపాన 100 బెడ్ల ఇఎస్ ఐ అసుపత్రికి 5 ఎకరాల భూమి కేటాయిస్తూ ఎకరానికి 61 లక్షలు వసూలు చేశారు. ఇదే ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలనుంచి కూడా ఇలాగే ఎకరాధర రు కోటికి తక్కువ కాకుండా నిర్ణయించారు.

ప్రజలకు నిరంతరం సేవచేసే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు, ప్రభుత్వభూములను ఇవ్వడంలో ఒక విధానం, కేవలం లాభాల కోసం పనిచేసే TCS కు ఇంకొక విధానం అమలు చేయడం రాష్ట్ర ప్రజలు హర్షించరు. ఇటువంటి క్రోనీ క్యాపిటలిజం విధానాలను ప్రభుత్వం చేపట్టడం బాధాకరంగా ఉంది. చవకభూములు, అనుచితమైన రాయితీల కారణంగా, చట్టా లను సడలించే విధానాల వలన, రాష్ట్రానికి వచ్చే పెట్టు బడులు రాష్ట్రానికి కాని, ప్రజలకు కాని దీర్ఘకాలికమైన ప్రయోజనాలు కలిగించలేవు.

ఏ ప్రభుత్వం, కావాల్సిన, నమ్మదగినమౌలిక సదుపాయాలు, చట్టపరమైన పరిపాలనా విధానాలు, లంచగొండితనం లేని, విచక్షణారహితంగా పరిపాలన, అందించగలదో, ఆ ప్రభుత్వమే, ప్రజలకు ఉపయోగపడే పెట్టు బడులు, పరిశ్రమలు, రాష్ట్రానికి రాబట్టగలదు. క్రోనీ క్యాపిటలిజం కారణంగా వచ్చే పెట్టు బడులు రాష్ట్రానికి కాని, ప్రజలకు కాని ఉపయోగపడవు. నా ఉద్దేశంలో, కేవలం చవకభూమికోసం వచ్చే పరిశ్రమలు, రాష్ట్రానికి ఉపయోగపడవు. TCS నోటిమాటగా రాష్ట్ర ప్రభుత్వానికి 12,000 ఉద్యోగాలు విశాఖలో కలిగిస్తా మని చెప్పినా, ప్రస్తుతం అంతర్జా తీయ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా, ఇతర IT కంపెనీ లతోపాటు, ఉద్యోగుల సంఖ్య తగ్గించే దిశలో ఉంది.

అదేకాకుండా, IT రంగం, ఈరోజు Artificial Intelligence (AI) technology సవాళ్లు ఎదుర్కోంటున్నందున అదనపు ఉద్యోగావకాశాలు కలిగించడం సాధ్యం కాకపోవచ్చు.

అదనపు ఉద్యోగావకాశాలు కలిగించడం సాధ్యం కాకపోవచ్చు. ఆ విషయాలను దృష్టిలో పెట్టు కుని, ప్రభుత్వం, నోటమాట కాకుండా, TCS నుంచి రాతపూర్వకంగా ఎన్ని సంవత్సరాలలో 12,000 ఉద్యోగాలు విశాఖలో స్థా నికయువతకు ఇవ్వగలదో వాగ్దా నం ఇమ్మని అడగాలి. సుప్రీం కోర్టు ఉత్తర్వులను దృష్టిలో పెట్టు కుని, ప్రభుత్వం TCS కు రుషికొండలో అంత పెద్ద ఎత్తు న ప్రభుత్వభూమిని ఇచ్చే ప్రతిపాదిక ను వెనక్కి తీసుకోవాలి. TCS కంపెనీ, మార్కెట్ ధరకు ప్రైవేట్, ఇతర ప్రైవేటు కంపెనీల తీరులో, విశాఖలో కావాల్సినభూములను కొనే శక్తిఉన్న సంస్థ. రుషికొండలో ఉన్న ప్రభుత్వభూమిని ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించాలి. అది కూడా పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా ఉపయోగించాలి. ఇప్పుడైనా, ప్రభుత్వం TCS కుభూమిని కేటాయించడంలో తీసుకున్న నిర్ణయాలను మీద సూచించిన విధంగా వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.


(ఈ విషయాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ కు లేఖ ద్వారా తెలియచేయడం జరిగింది)



Read More
Next Story