టీసీఎస్ కంపెనీ విశాఖపట్నంలో ప్రారంభానికి రెడీ అవుతోంది. ఈ కంపెనీ నిరుద్యోగులకు వరమని ప్రభుత్వం చెబుతోంది.
టాటా కన్సల్టెన్సీ సర్వీస్ విశాఖపట్నంలో పెట్టేందుకు ఎనిమిదేళ్లు పట్టింది. విభజిత ఆంధ్రప్రదేశ్ లో టీసీఎస్ స్థాపించేందుకు టాటా సర్వీసెస్ ఎంతగానో ప్రయత్నించింది. మొదట అధికారంలో ఉన్న టీడీపీ కూడా కొంత మేర సహకరించింది. కంపెనీ స్థాపనలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం ముందుకు అడుగులు వేయకపోవడంతో టీసీఎస్ వారు కూడా పట్టీపట్టనట్లు ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో టీసీఎస్ వారు కూడా ముందుకు రాలేదు. అందుకే ఆ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఎంతో మంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు వరంగా ఉండే టీసీఎస్ ను గతంలో రెండు ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని చెప్పొచ్చు. తిరిగి ప్రస్తుత ప్రభుత్వం పెట్టుబడి దారులను ఆహ్వానించే పనిలో భాగంగా గతంలో కంపెనీలు పెట్టేందుకు వస్తామన్న వారందరికీ లేఖలు రాయడంతో టీసీఎస్ ఫైల్ కదిలింది.
విశాఖపట్నంలో 2016లో ఐటీ హిల్స్ 2లో డల్లాస్ టెక్నాలజీ సెంటర్ ఎల్ఎల్ పీ కి 7,774 చదరపు మీటర్ల భూమిని అప్పటి ప్రభుత్వం కేటాయించింది. అయితే ఆ సంస్థ కంపెనీ పెట్టేందుకు ముందుకు రాలేదు. దీంతో ఈ భూమిని టీసీఎస్ కు ప్రస్తుత ప్రభుత్వం కేటాయించింది. ఇందులో ప్రస్తుతం మూడు అంతస్తుల భవనం ఉంది. అది 1,400 మంది పనిచేసేందుకు అనువుగా ఉంటుంది. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీసీఎస్ విశాఖపట్నంలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు అనుమతులు జారీ చేసింది. స్థలం కూడా ఇవ్వడంతో ఇక టీసీఎస్ వారు పనులు మొదలు పెట్టడమే తరువాయి.
2025 జనవరి నుంచి టీసీఎస్ కార్యకలాపాలు మొదలు పెట్టేందుకు సిద్ధమైంది. భవనం కూడా రెడీగా ఉండటం వల్ల మొదటి దశలో 2,000 మంది ఉద్యోగులతో కార్యకలాపాలను ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ భవనాన్ని అదనపు రుసుం లేకుండా సబ్ లీజ్‌కు తీసుకునేందుకు మార్గం సుగుమమైంది. దీంతో పనులు వేగంగా జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వీలైనంత వేగంగా పనులు పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభిస్తామని ప్రభుత్వానికి టీసీఎస్ ప్రతినిధులు తెలిపారు.
భవిష్యత్తు విస్తరణ కోసం మరో 1,600 చదరపు మీటర్ల స్థలాన్ని టీసీఎస్‌కు ప్రభుత్వం కేటాయించింది. దీంతో తమ కంపెనీని విస్తరించుకునేందుకు టీసీఎస్ వారికి అవకాశం ఏర్పడింది. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం కావాలన్నా అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇప్పటికే ప్రకటించింది. పైగా పరిశ్రమల శాఖ నుంచి ప్రోత్సాహక మండలి ప్రతిపాదనలు ఆమోదించిందని పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పరిశ్రమల శాఖ నుంచి ప్రోత్సాహకాలు అందిస్తే వారు మరింత ముందుకు అడుగులు వేసే అవకాశం ఉంది.
ఎంతో మంది సాఫ్ట్ వేర్ రంగానికి చెందిన నిరుద్యోగులు ఏపీలో సాఫ్ట్ వేర్ రంగం స్థిరపడాలని కోరుకుంటున్నారు. సుమారు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఇంకా స్కిల్స్ ఉన్న వారి వివరాలు సేకరించే సర్వే జరుగుతోంది. వీరిలో కొందరికి టీసీఎస్ లో అవకాశాలు లభిస్తాయి. ఇటువంటి కంపెనీలు పెట్టే ముందు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లోని తమ వారిలో ఎక్కువ మందికి ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరింది. అందుకు కంపెనీలు కూడా అంగీకరిస్తున్నాయి. అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన కియా కంపెనీ కూడా 80శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇస్తామనే ఒప్పందం కూడా చేసుకుంది. ఇలా చేయడం వల్ల ముందుగా స్థానికులకు అవకాశం ఉంటుంది. ఆ తరువాత వారికి ఇష్టమైన వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవచ్చు.