ధర్మవరం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒంటరయ్యారు. తెలుగుదేశం వారు మంత్రిని విభేదిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో కుమ్మక్కు రాజకీయాలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఎన్నికల వరకు మాత్రమే పార్టీలు. ఆ తరువాత పనులు చేయించుకోవడంలో కానీ, లావాదేవీలు నడపటంలో కానీ కలిసి పనిచేస్తేనే ముందుకు అడుగులు వేస్తామని నాయకులు భావిస్తున్నారు. రాష్ట్ర నేతలను నమ్ముకుంటే తమ వద్ద ఉన్న డబ్బు కాజేసీ చిన్న పని కూడా చేయకుండా కాలం గడుపుతున్నారనే ఆవేదన ఎమ్మెల్యేల్లో ఉంది. అలాంటప్పుడు కోట్లు ఖర్చు పెట్టుకున్న మనం ఎందుకు విరోధులం కావాలనే మాటలు కూడా పలువురు ఎమ్మెల్యేల నోట సన్నిహితుల వద్ద వస్తున్నాయి.
కుమ్మక్కు రాజకీయాలకు తెర తీశారు..
రాష్ట్రంలో ప్రస్తుతం కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయనేందుకు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం ఉదాహరణగా రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. ధర్మవరం వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి యూటూబ్ సబ్ స్క్రైబర్స్ కు సుపరిచితుడు. నియోజకవర్గంలో ఎలాగో ప్రజలకు తెలుసు. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో 2024 ఎన్నికలకు ముందు సుమారు ఏడాది పాటు వీధి వీధి తిరిగారు. ఎన్నో చోట్ల స్థానికులతో మాట్లాడి ఏ ఇల్లు ఏ పార్టీకి అనుకూలంగా ఉందో కూడా గుర్తించారు. వైఎస్సార్సీపీ తరపున ధర్మవరం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వెంకట్రామిరెడ్డి పార్టీలో తప్పిదాలు, పనితీరుపై ఇటీవల చర్చనియాంశ మైన వ్యాఖ్యలు చేశారు. అయినా పార్టీని వీడలేదు. అయితే తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జ్ పరిటాల శ్రీరామ్ తో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారనే చర్చ మొదలైంది. కొన్ని నిర్ణయాలు ఇరువురూ కలిసి తీసుకొంటున్నారని, పార్టీల్లో ఎక్కడ వివాదాలు లేకుండా అడుగులు వేస్తున్నారనే చర్చ పార్టీల నాయకుల్లో ఉంది.
టీడీపీ, బీజేపీ వర్గ రాజకీయాలు
ధర్మవరం నియోజకవర్గంలో తెలుగుదేశం, బీజేపీ వర్గాల మధ్య దాడులు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మైనార్టీ నాయకుడు జమీర్ బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ధర్మవరం పల్లవి సర్కిల్ లో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండగా అటుగా వెళుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, జమీర్ వర్గీయులకు మధ్య గొడవ జరిగింది. ఒక వర్గంపై మరో వర్గం దాడికి తెగబడింది. కొందరికి గాయాలయ్యాయి. అయితే ఇరు వర్గాల్లోని వారు ఎవ్వరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. తమకు తెలియకుండా సమీర్ ను బీజేపీలో ఎలా చేర్చుకుంటారని బీజేపీ వారికి, తెలుగుదేశం పార్టీ వారికి మధ్య కూడా వాగ్వాదం జరిగింది. ఈ దాడుల్లో నాలుగు కార్లు ధ్వంసం అయ్యాయి.
ముదిగుబ్బలో టీడీపీ, బీజేపీ దాడులు
ముదిగుబ్బలో వీరనారాయణ పరస ప్రతి ఏడాది జరుగుతుంది. ఈ సందర్భంగా దేవుడి గుడిలో కొట్టే టెంకాయల అమ్మకానికి వేలంపాట జరుగుతుంది. వేలం పాటలో తెలుగుదేశం పార్టీ వర్గీయుడు ఒకరు టెంకాయల వ్యాపారం దక్కించుకున్నారు. అందులో మాకు వాటా ఉందని, మాకు తెలియకుండా మీరు ఎలా పాట పాడతారని బీజేపీ వారు టెంకాయల కొట్టు వేలం పాడిన వ్యక్తితో గొడవకు దిగారు. మాటా మాటా పెరిగి దాడిచేశారు. దాడికి పాల్పడిన వారు ముదిగుబ్బ ఎపీపీ ఆదినారాయణ యాదవ్ అనుచరులు.
గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికల్లో ఆదినారాయణ ఎంపీపీ అయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైఎస్సార్ సీపీ నుంచి బీజేపీలో చేరారు. మంత్రికి అనుచరునిగా కొనసాగుతున్నారు. గుడి కొబ్బరి కాయల వివాదంలో ఆదినారాయణ అనుచరులు టీడీపీ వారిని కొట్టడంతో ఆగ్రహించిన టీడీపీ కార్యకర్తలు, కొందరు ముఖ్య నాయకులు సంకేపల్లిలో ఎంపీపీ ఆదినారాయణ కార్లను అడ్డగించి అద్దాలు పగుల గొట్టారు. తెలుగుదేశం లోని కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఈ దాడి చేశారు. ముదిగుబ్బ పోవాలంటే ఆదినారాయణ సంకేపల్లి మీదుగా వెళ్లాలి. ముదిగుబ్బ వెళ్లే సమయంలో ఈ దాడి జరిగింది. ఇంత జరిగినా పోలీసులను ఆశ్రయించలేదు.
మంత్రికి రైట్ హ్యాండ్ గా మారి...
కూటమి ప్రభుత్వంలో మంత్రి కావటానికి, ఎమ్మెల్యేగా గెలవటానికి పూర్తి స్థాయిలో పనిచేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులను బీజేపీ విస్మరించిందనే బాధ టీడీపీ వారిలో ఉంది. వైఎస్సార్ సీపీ నుంచి వచ్చిన ఆదినారాయణకు మంత్రి మద్దతు పలకడాన్ని టీడీపీ వారు జీర్ణించుకోలేక పోయారు. టీడీపీ ఇన్ చార్జ్ పరిటాల శ్రీరామ్ కూడా మంత్రితో ఈ విషయం ప్రస్తావించారు. తమ క్యాడర్ తమరిపై ఆగ్రహంగా ఉందని, టీడీపీ వారికి కాకుండా ఎవరెవరికో పనులు చేసి పెట్టడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఎంపీపీ మా పార్టీలో చేరినందున బీజేపీ వాడు అవుతాడని సత్యకుమార్ సమాధానం చెప్పటం టీడీపీ వారికి మరింత ఆగ్రహాన్ని తెప్పించింది.
మంత్రి అండతో ఆదినారాయణ యాదవ్ గిరిజనులకు సంబంధించిన భూములు కూడా ఆక్రమించారనే ఆరోపణలు ఉన్నాయి. పలు సందర్భాల్లో ఆదినారాయణపై కేసులు కూడా నమోదయ్యాయి. మంత్రి ద్వారా తన పనులు చక్క బెట్టుకోవడం, టీడీపీ వారిని దెబ్బతీయడం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని టీడీపీ వారు మంత్రిని హెచ్చరించారు.
మునిసిపల్ కమిషనర్ విషయంలో రచ్చ
ధర్మవరం మునిసిపల్ కమిషనర్ మల్లికార్జున యాదవ్ వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కమిషనర్ గా పనిచేశారు. ఆ తరువాత కూడా ఆయననే కమిషనర్ గా మంత్రి సత్యకుమార్ యాదవ్ కొనసాగేలా చేశారు. ఇది ఏ మాత్రం టీడీపీ వారికి సహించలేదు. వైఎస్సార్సీపీ హయాంలో టీడీపీకి ఎటువంటి పనులు చేయకుండా అవమానించిన మల్లికార్జునను ఎలా కమిషనర్ గా కొనసాగిస్తారని టీడీపీ వారు మంత్రి వద్ద పట్టుబట్టారు. మునిసిపల్ కార్యాలయంలో సమావేశం జరుగుతుండగా మల్లికార్జున సమావేశానికి రావడంతో తెలుగుదేశం పార్టీ వారు మంత్రిని మునిసిపల్ కార్యాలయంలోకి రాకుండా అడ్డుకునేందుకు మునిసిపల్ కార్యాలయం ముందు భైటాయించారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చివరకు తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ పరిటాల శ్రీరామ్ కోర్కె మేరకు కమిసనర్ మల్లికార్జునను బదిలీ చేశారు. ఈ సంఘటన కూడా ఇటీవలే జరిగింది.
టీడీపీ, వైఎస్సార్సీపీ కుమ్మక్కైందా?
ధర్మవరంలో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. కానీ టీడీపీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిల మధ్య మాత్రం సయోధ్య ఉంది. అనవసరంగా ఘర్షణలకు పోతే వచ్చేదేమీ లేదని, పైవారు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తే తామే దెబ్బతింటామనే ఆలోచనకు వీరిద్దరూ వచ్చినట్లు సమాచారం. ఎక్కడా వీరు బహిరంగంగా కానీ, అంతర్గతంగా కానీ గొడవలు పడిన సందర్భాలు లేవు. వైఎస్సార్సీపీ అధికారం కోల్పోగానే కేతిరెడ్డి తన కంకర మిల్లులు వేరే వారికి అమ్మేసినట్లు సమాచారం. పరిటాలతో గొడవలు రాకుండా ఉండేందుకే ఆయన వర్గీయులకే అమ్మారనే ప్రచారం సాగుతోంది. ఏ విషయంలో కూడా గొడవలు వద్దని, పనులు ఏవైనా ఉంటే కలిసి కట్టుగా చేసుకొందామనే ఆలోచనలో ఉన్నారని విశ్వసనీయ సమాచారం.
మధ్యలో వచ్చి సీటు కొట్టేశాడు...
మనిద్దరిలో ఎవరు గెలిచినా బాధపడే వాళ్లం కాదు. నువ్వు, నేను ఇద్దరం రాజకీయాల్లో ఎంతో కష్టపడి పనిచేసుకుంటూ వచ్చాం. చివరకు మధ్యలో ఎవడో వచ్చి ఎమ్మెల్యే పదవి కొట్టేశాడు. అందుకు ఇరు పార్టీల్లో ఉన్న మన ఓటర్లే కారణం. కారణం ఏదైనా గెలిచిన సత్యకుమార్ ఆ తరువాత మన గురించి ఆలోచించకుండా ఇష్టానుసారం చేస్తున్నారనే చర్చ కేతిరెడ్డి, పరిటాల మధ్య జరిగినట్లు నియోజకవర్గ ప్రజల్లో చర్చ జరుగుతోంది. కమ్మ, రెడ్డి వర్గీయులు ఇప్పటి వరకు రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు బీసీ వ్యక్తి ఎమ్మెల్యే కావడమే కాకుండా మంత్రి కావడాన్ని వీరు జీర్ణించుకోలేక పోతున్నారని పలువురు బీసీ వర్గాల వారు అంటున్నారు.
బీజేపీ అండతో ఒంటరిగా...
బీజేపీ అండతో సత్యకుమార్ యాదవ్ మంత్రి అయ్యారు. అందులోనూ వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేయడం అంటే ఆషామాషీ కాదు. మంచి పేరు సంపాదించుకోవాలని, అలాగే కూటమి పార్టీలతోనూ సఖ్యతగా ఉండాలనే ఆలోచనలోనే సత్యకుమార్ ఉన్నారు. ఏది కావాలన్నా బీజేపీ పెద్దలతో చెప్పి దానిని సత్యకుమార్ సాకారం చేసుకుంటున్నారనే చర్చ ప్రజల్లో ఉంది. మంత్రి తీసుకుంటున్న నిర్ణయాలన్నీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉంటున్నాయని, ఇలాగే ఉంటే అందరూ బీజేపీలో చేర్చుకునేలా సత్యకుమార్ కుయుక్తులు పన్నుతున్నారని తెలుగుదేశం పార్టీ పెద్దల మధ్య టీడీపీ నియోజకవర్గ నాయకులు వాపోయారని సమాచారం. అయితే ఇవేమీ సత్యకుమార్ పరిగణలోకి తీసుకోకుండా ముందుకు అడుగులు వేస్తున్నారు.