బాబూ, తొందరగా తెముల్చు నాయనా!
చంద్రబాబుపై తీవ్ర అసహనంలో చిత్తూరు జిల్లా టీడీపీ ఆశావహులు ఉన్నారు. ఇప్పటివరకు అభ్యర్థులపై క్లారిటీ ఇవ్వకపోవడమే ఇందుకు కారణం.
ఎస్.ఎస్.వి.భాస్కర్ రావ్, తిరుపతి
తాంబూలాలు ఇచ్చేశాం.. తన్నుకు చావండన్నట్టుగా ఉందా చంద్రబాబు తీరు.. హూ కిల్డ్ బాబాయ్..! అంటూ తిరిగితే సరిపోతుందా! అని వాపోతున్నారు చిత్తూరు జిల్లా టీడీపీ ఆశావహులు. ప్రకటించిన ఇంచార్జీలు చివరి వరకు ఉంటారో లేదో స్పష్టత లేదు, అభ్యర్థుల ప్రకటన రాలేదు. దీంతో జిల్లాలో గందరగోళం నెలకొంది. “అభ్యర్థులను ప్రకటించరు. ఏ సీటుకి ఎవరో తేల్చరు. ఇంచార్జీలే అభ్యర్థులవుతారని నమ్మకం లేకపోవడంతో ఏ కార్యక్రమం చేయాలన్న గుంజాటన పడాల్సి వస్తోంది. ఇలా అయితే పార్టీ పరిస్థితి ఏంటి? ” అని చిత్తూరు జిల్లా పార్టీ నేతలు టీడీపీ అధినేత ఎన్. చంద్రబాబు నాయుడుపై రుసరసలాడుతున్నారు.
చిత్తూరు జిల్లాలో జనసేన, టీడీపీ మధ్య పొత్తుల మధ్య ఏకాభిప్రాయం రాలేదు. రేపు బీజేపీ కూడా జత కలిస్తే పరిస్థితి మరింత సంక్లిష్టం అయ్యే అవకాశం ఉంది. చంద్రబాబు రాష్ట్ర, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పి ఉండవచ్చు కానీ సొంత జిల్లా చిత్తూరులో రాజకీయాలను శాసించలేకపోతున్నారా? అనేది ప్రస్తుతం వినిపిస్తున్న మాట. ఇంకో వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రానుంది. అయినా వ్యూహాత్మక ఎత్తులు, సమీకరణలంటూ అధినేత చంద్రబాబు నాన్చుతున్నారనేది వాస్తవం. ఇన్చార్జులుగా ప్రకటించిన వారి పేర్లలో సగం సీట్లలో మొదటి జాబితాలో లేకపోవడం వల్ల గందరగోళం ఏర్పడింది.
ఎందుకీ గందరగోళం
2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి పెద్ద షాకే తగిలింది. జిల్లాలో 14 శాసనసభ స్థానాలు ఉండగా, 13 సీట్లు, రెండు ఎంపీ స్థానాలను కూడా వైసీపీ ఖాతాలో చేరాయి. జిల్లాలో 14 శాసనసభ స్థానాల్లో ఏడు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. మరో ఏడు స్థానాలతో పాటు రెండు పార్లమెంటు స్థానాలకు కూడా పేర్లు ప్రకటించలేదు. పెండింగ్ లో ఉన్న స్థానాల్లో కూడా గందరగోళం నెలకొంది. కుప్పం, చిత్తూరు, పలమనేరు, నగిరి, తంబళ్లపల్లి, జీడి నెల్లూరు, పీలేరు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మొదటి జాబితా ప్రకటించారు. తిరుపతి, మదనపల్లి లో పీటముడి పడింది. సత్యవేడు, చంద్రగిరి, శ్రీకాళహస్తి పూతలపట్టు, పుంగనూరు, చంద్రగిరి నియోజకవర్గాలకు ఇన్చార్జిలను ప్రకటించిన వారి పేరు మాత్రం మొదటి జాబితాలో లేదు. చిత్తూరు, తిరుపతి పార్లమెంటు స్థానాలకు కూడా అభ్యర్థుల ప్రకటన పెండింగ్ లో ఉంది.
సొంత కుటుంబంలోనే ఎదురు ‘గాలి’
జిల్లాలోని నగిరి నుంచి మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు గాలి భాను ప్రకాష్ ను అభ్యర్థిగా ఎన్ చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సొంత పార్టీతోపాటు కుటుంబంలోనే ఆయనకు వ్యతిరేకత ఉంది. ఇక్కడి నుంచి టిడిపి అభ్యర్థిగా గురజాల జగన్మోహన్ కు టికెట్ ఇవ్వడంపై బలిజ సామాజిక వర్గం మండిపడుతోంది. పీలేరులో మాత్రం నల్లారి కుమార్ రెడ్డి సవ్యంగా ప్రచారంలో సాగుతున్నారు.
శ్రీకాళహస్తిలో కటకట...
శ్రీకాళహస్తి నియోజకవర్గం లో కూడా మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు బజ్జల సుధీర్ కుమార్ రెడ్డిని ప్రకటించారు. తొలి జాబితాలో కూడా ఆయన పేరు లేదు. అందుకు ప్రధాన కారణం.. ఈ నియోజకవర్గంలో నుంచి టికెట్ ఆశిస్తున్న, మరొక వర్గం వారు కూడా ఉన్నారు.తమకే టికెట్ ఫిక్స్ అని మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు పావులు కదుపుతున్నారు. ఇటీవల ఆయన ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటికి వెళ్లి వచ్చారు.
బలిజ సామాజికవర్గానికి కీలకమైన శ్రీకాళహస్తిలో అధికార వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పై జనసేన పార్టీ నాయకురాలు వినూత, చంద్రబాబు దంపతులు గత నాలుగేళ్లుగా ఒంటరి పోరు సాగిస్తూ, కేసులకు కూడా వెరవకుండా సాగుతున్నారు. టిడిపి, జనసేన పొత్తు నేపథ్యంలో శ్రీకాళహస్తి నుంచి వినూత టికెట్ ఆశిస్తున్నారు. " మా పార్టీతో పొత్తు కుదిరితే.." టికెట్ కేటాయించాలని బిజెపి కూడా పట్టుబట్టే అవకాశం ఉంది. ఆ పార్టీ అభ్యర్థిగా శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ చైర్మన్ కోలా ఆనంద్ టికెట్ ఆశిస్తున్నారు. మూడు పార్టీల పొత్తు కుదిరే వరకు ఏ పార్టీ ఏ అభ్యర్థి రంగంలో ఉంటారనేది డైలమా ఏర్పడింది.
సత్తెంగ పీటముడి...
సత్యవేడు నియోజకవర్గం అభ్యర్థిని నిర్ణయించడంలో పీటముడి ఏర్పడినట్లు భావిస్తున్నారు. వైసీపీ నుంచి తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆ పార్టీకి రాజీనామా చేసి, టిడిపి టచ్ లోకి వెళ్లి, టికెట్ ఆశిస్తున్న ఆయనకు వ్యతిరేకత ఎక్కువగా ఉంది. టీడీపీ ఇంచార్జిగా ప్రకటించిన హెలెన్ తోపాటు మాజీ ఎమ్మెల్యే తలారి ఆదిత్య, గత ఎన్నికల్లో ఓడిపోయిన జెడి రాజశేఖర్ కూడా టికెట్ రేసులో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలమా లేకుంటే పార్టీలోనే ఉన్న వారికి ఇవ్వాలనేది తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది అంటున్నారు.
బాబుకు అతిపెద్ద సవాల్
చిత్తూరు జిల్లాలో తిరుపతి ఆ తర్వాత మదనపల్లి అసెంబ్లీ స్థానం ఎవరికి? టిడిపినా..? జనసేనా ? ఎవరికి కేటాయించాలని విషయంలో కూడా టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు ఇదిమిద్దంగా తేల్చకపోవడం కూడా ఉత్కంఠకు తెర తీశారు. ఈ రెండు సీట్లు టిడిపికి అత్యంత పెద్ద సవాల్ గా మారినట్లు కనిపిస్తోంది. బలిజ సామాజిక వర్గం అధికంగా ఉన్న ఈ రెండు స్థానాలను తమ పార్టీకి కేటాయించాలని జనసేన నేతలు పట్టుబడుతున్నారు. దీంతో ఈ సీట్ల ఎంపిక ప్రక్రియ ఇంకా ఒక కొలిక్కి రాలేదు.
చంద్రగిరి కోటలో ఎవరు?
తన సొంత ఊరు నారావారిపల్లె అంతర్భాగంగా ఉన్న చంద్రగిరి నియోజకవర్గంపై కూడా ఊహలు షికార్లు చేస్తున్నాయి. టిడిపి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పులివర్తి నానిని చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రకటించారు. నారా లోకేష్ కూడా తన యువగళం పాదయాత్రలో పులివర్తి నాని పేరును ప్రకటించారు. ఆయన పేరు కూడా మొదటి జాబితాలో లేదు. చంద్రగిరి నుంచి డాలర్స్ గ్రూప్ ప్రతినిధి దివాకర్ కూడా టికెట్ రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
పూతలపట్టు ఎవరిదో..?
ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అయిన పోతులపట్టు అభ్యర్థిగా సీనియర్ జర్నలిస్టు డాక్టర్ కలికిరి మురళీమోహన్ పేరును స్వయంగా ఎన్ చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయినా మొదటి జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో, ఇక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే పి రవితో పాటు పారిశ్రామికవేత్త ముత్తు, పౌరసరఫరాల సంస్థ మాజీ డైరెక్టర్ సప్తగిరి ప్రసాద్ కూడా అదృష్ట పరీక్షలో ఉన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకా.. కాయన పుంగనూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా చెల్లా బాబును ప్రకటించారు ఈయన పేరు కూడా మొదటి జాబితాలో లేదు. ఇక్కడ కూడా పార్టీ అభ్యర్థి మారే పరిస్థితి లేకపోలేదు అనే మాట వినిపిస్తోంది.
తేలని పంచాయతీ..
మదనపల్లి నియోజకవర్గం నుంచి కూడా ఏ పార్టీ అభ్యర్థి నిలబడతారనేది ఇంతవరకు తేలలేదు. తిరుపతి తర్వాత మదనపల్లిని తమకు కేటాయించాలని జనసేన పట్టుబడుతోంది. జనసేన నుంచి మదనపల్లి సీటును ఇద్దరు ఆశిస్తున్నారు. వారిలో గంగారపు రాందాస్ చౌదరి గత ఎన్నికల్లో పోటీ చేసి 16 వేల ఓట్లు సాధించారు. ఈయన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహకర్తగా ఉన్న నాదెళ్ల మనోహర్ కు అత్యంత ఆప్తుడు. తెలుగుదేశం పార్టీ కి మొదటినుంచి పెద్దదిక్కుగా ఉన్న రాటకొండ కుటుంబం నుంచి ఒకరు, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, మరో మాజీ ఎమ్మెల్యే షేక్ షాజహాన్ టికెట్ రేసులో ఉన్నారు. ఇక్కడి నుంచి వైయస్ఆర్సీపీ అభ్యర్థిగా షేక్ నిసార్ అహ్మద్ ను ప్రకటించింది. మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ పై అనేక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో టిడిపి అభ్యర్థి రంగంలోకి దించితే షేక్ షాజహాన్ ను టికెట్ వరించే అవకాశం ఉన్నట్టు ఆ పార్టీ స్థానిక నేతలు భావిస్తున్నారు.
ఆరని మంటలు...
తంబళ్లపల్లి నియోజకవర్గ పరిస్థితి మరింత భిన్నంగా ఉంది. మొదటి జాబితాలోని టిడిపి అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు ఎన్ఆర్ఐ డి. జయచంద్రారెడ్డి పేరు ప్రకటించారు. ప్రతిపక్షంలో ఉన్న ఎక్కడ రాజీ పడకుండా కార్యక్రమాలు నిర్వహించిన తనకు టికెట్ ఇవ్వకపోవడంపై బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే జి శంకర్ ఆగ్రహంగా ఉన్నారు. ఆయన మద్దతుదారులు జాబితా ప్రకటించిన నటించి ఇప్పటివరకు నిరసన కార్యక్రమాలు సాగిస్తూనే ఉన్నారు. జి శంకర్ మద్దతుదారులు భారీ సంఖ్యలో ఉండవల్లిలోని చంద్రబాబును నివాసం వద్ద కూడా వెళ్లి ధర్నాలు నిర్వహించారు. నియోజకవర్గంలో ఇంకా మౌన దీక్షలు సాగుతూనే ఉన్నాయి.
జనసేన, టిడిపి మధ్య కూడా రాష్ట్రస్థాయిలో మాదిరిగానే జిల్లాలో కూడా పొత్తు పొడవాల్సిన అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాతే చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో తన పార్టీ పరిస్థితిని చక్కదిద్దుకునే అవకాశం ఉంటుంది మలి విడతలో ప్రకటించే అభ్యర్థుల ఆధారంగా ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందనేది విశ్లేషకుల అంచనా.
Next Story