రాయచోటి టిడిపిలో నిరసన జ్వాల...అనుకున్నంతా అయ్యింది,
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యేకు టికెట్ దక్కదనే ఊహ నిజమైంది. కడప జిల్లా రాయచోటి మంచి పోటీ చేసి తీరుతానని ఆర్ రమేష్ రెడ్డి తెగేసి చెబుతున్నారు.
(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)
"తొందరపడి ఓ కోయిల ముందే కూసింది" తమ నేతకు టికెట్ దక్కదేమో అనే సందేహంతో.. అప్పటివరకు మోసిన టీడీపీ జెండాలు, బ్యానర్లను శుక్రవారం రాత్రి తెలుగుదేశం నాయకులు దహనం చేసి ఆగ్రహం వెళ్ళగక్కారు. టీడీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధం అవుతున్నారు.
రగులుతున్న రమేష్ రెడ్డి వర్గం
కడప జిల్లా రాయచోటి నియోజకవర్గం టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. అయితే తాజాగా టీడీపీ అధినేత ఈ టికెట్ ను రమేష్ రెడ్డికి కాదని ఏ. రాంప్రసాద్ రెడ్డికి ఇస్తున్నట్లు విజయవాడలో ప్రకటించారు. దీంతో రమేష్ రెడ్డి వర్గం రాయచోటిలో ఆందోళన చేపట్టింది. అయితే ఈ నిర్ణయం ముందుగానే ఊహించిన రమేష్ రెడ్డి, తనకు ఏ పార్టీ టికెట్ ఇచ్చినా, ఇవ్వకున్నా.. పోటీ చేసి తీరతానని ప్రకటించారు.
ఫలించని బుజ్జగింపు
" మీ తమ్ముడు ఆర్..శ్రీనివాసులు రెడ్డికి కడప ఎంపీ టికెట్ ఇచ్చా.. ఆయన సతీమణి మాధవి రెడ్డికి కడప శాసనసభ నియోజకవర్గ కేటాయించా." ప్రభుత్వం ఏర్పడగానే రాజకీయంగా న్యాయం చేస్తా" అని ఆర్ రమేష్ రెడ్డికి స్వయంగా ఫోన్ చేసిన టీడీపీ అధినేత ఎన్. చంద్రబాబు నాయుడు బుజ్జగించేందుకు విఫల యత్నం చేసినట్లు తెలిసింది. అయినప్పటికీ ఆయన అనుచరులు, స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులు లక్కిరెడ్డిపల్లి లో శుక్రవారం రాత్రి టిడిపి జెండాలు, బ్యానర్లను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.
సుదీర్ఘకాలంగా టీడీపీలోనే..
ఉమ్మడి కడప జిల్లా (ప్రస్తుతం అన్నమయ్య జిల్లా) లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గం నుంచి ఆర్ రమేష్ రెడ్డి ఎమ్మెల్యేగా 1999లో ఎన్నికయ్యారు. 2002 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. నియోజకవర్గాలకు పునర్విభజన నేపథ్యంలో 2009లో రాజంపేట పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గం రద్దు చేసి రాయచోటి కేంద్రంగా విలీనం చేశారు. దీంతో రమేష్ రెడ్డి టీడీపీ నుంచి 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు. తన తండ్రి మాజీ ఎమ్మెల్యే ఆర్ రాజగోపాల్ రెడ్డి వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన రమేష్ రెడ్డి పార్టీ కష్టకాలంలోను అండగా నిలిస్తే, అన్యాయం చేస్తారా అంటూ ఆయన అనుచర వర్గం రగిలిపోతోంది.
పోటీ చేయడం ఖాయం
"ఇతర పార్టీల నుంచి వచ్చిన వారినీ చంద్రబాబు నాయుడు నమ్ముతున్నారు" వారు ఇచ్చిన తప్పుడు నివేదికలు పరిగణలోకి తీసుకున్నారు" అన్ని విధాల పార్టీకి వెన్నంటి ఉన్న తనకు అన్యాయం చేశారంటూ టిడిపి మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ రెడ్డి మండిపడ్డారు.
ముందస్తు పర్యటనలు
తనకు టిక్కెట్ దక్కదనే నిర్ణయానికి వచ్చి, కొద్ది రోజులుగా ఆయన గ్రామాల్లో పర్యటించి, ఆత్మీయ సభల ద్వారా అనుచరవర్గం జారిపోకుండా చూసుకునే పనిలోనే ఉన్నారు. ఆయన ఊహించినట్లే తనకు కాకుండా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి రాయచోటి టిడిపి టికెట్ ప్రకటించడంపై రగిలిన ఆయన అనుచరుల్లో ప్రధానంగా సంబేపల్లి మాజీ జెడ్పిటిసి సభ్యుడు నర్సారెడ్డి, మాజీ ఎంపీపీ ఉమామహేశ్వర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కే ప్రభాకర్ రెడ్డి తోపాటు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ పరిస్థితి దిశగా టిడిపి కడప జిల్లా నాయకులను రంగంలోకి దించినట్లు సమాచారం అందింది.
ద్వారకానాథ్ రెడ్డి మౌనవ్రతం
రాయచోటి అసెంబ్లీ స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్ రెడ్డి కూడా టికెట్ ఆశించారు. వైఎస్ఆర్సీపీ లో కీలకమైన రాజ్యసభసభ్యుడు విజయసాయి రెడ్డికి ఈయన స్వయాన బామ్మర్ది కూడా. తానోకటి తలిస్తే దై వం ఒకటి తలచిందన్నట్లు రాయచోటి టిడిపి టికెట్ మండిపల్లి రాంప్రసాద్ కు కేటాయించడంతో మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి మాదిరి కాకుండా ద్వారకానాథ్ రెడ్డి మౌనంగా ఉండడం రాజకీయంగా రాయచోటి ప్రాంతంలో చర్చ సాగుతోంది.
Next Story