జాహా..! సంతకం జాగ్రత్త..!!
x

జాహా..! సంతకం జాగ్రత్త..!!

చల్లదనానికి మారుపేరైన మదనపల్లెలో రాజకీయ వాతావరణం వేడిగా ఉంది. 20 ఏళ్ల క్రితం చేదు అనుభవం రుచి చూసిన టిడిపి అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు.


(ఎస్.ఎస్.వి.భాస్కర్ రావ్)

తిరుపతి: మదనపల్లి అంటే ఆంధ్ర ఊటీ అని పేరు. ఈ చల్లటి ప్రదేశంలో ఎన్నికల సమయంలోనే కాదు.. పరిస్థితులు విభిన్నంగా ఉంటాయి. రాజకీయ వాతావరణం సందడిగా, శత్రుత్వం నివురుగప్పిన నిప్పులా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో అనూహ్య పరిణామాల మధ్య టిడిపి అభ్యర్థిత్వం దక్కించుకున్న మాజీ ఎమ్మెల్యే షేక్ షాజహాన్ బాషా (జాహా) శుక్రవారం మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. 20 సంవత్సరాల క్రితం కూడా ఇదే పరిస్థితి. మొదటిసారి ఎన్నికల బరిలోకి దిగిన నాటి నుంచి రాజకీయ విరోధులు యాదృచ్ఛికంగానే వెన్నంటే ఉంటున్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ, ప్రస్తుతం కూటమి పార్టీల నుంచి కూడా. ఒకసారి గత నేపథ్యాన్ని పరిశీలిద్దాం.

అవి 2004 ఎన్నికలు. కాంగ్రెస్ పార్టీ మంచి ఊపు మీద ఉంది. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రతో సాగుతున్నారు. మదనపల్లి అసెంబ్లీ స్థానం నుంచి మహామహులు టికెట్ రేసులో ఉన్నారు. అందులో ప్రధానంగా మాజీ మున్సిపల్ చైర్మన్లు జి ముజీబ్ హుస్సేన్, బి నరేష్ కుమార్ రెడ్డి, డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, గంగారపు రాందాస్ చౌదరి, సిపి సుబ్బారెడ్డి, రెడ్డివారి సాయి ప్రసాద్ రెడ్డి ఒకరికి ఒకరు తీసిపోని స్థితిలో హోరాహురీగా ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పటివరకు కొంతమందికే పరిచయమైన షేక్ షాజహాన్ బాషా (జహా) అనూహ్యంగా టికెట్ దక్కించుకున్నారు. ఈ విషయం దావానలంలో వ్యాపించడంతో మదనపల్లె ప్రాంత నాయకులు దిమ్మెర పోయారు. అసలు ఎవరు ఈ షాజహాన్ అని వెతుక్కునే పరిస్థితి ఏర్పడింది.

తెర వెనుక..

మదనపల్లి నుంచి టికెట్ ఆశించిన నాయకులందరికీ ఫోన్ టచ్‌లో ఉన్న అప్పటి డిసిసి అధ్యక్షుడు, ప్రస్తుత వైఎస్ఆర్సిపి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులు షాజహాన్‌కు లభించినట్లు సమాచారం. అంతేకాకుండా షాజహాన్‌కు ఢిల్లీ ఇమామ్ ఆశీర్వచనాలు అందిన నేపథ్యంలో టికెట్ దక్కింది. హైదరాబాద్ గాంధీభవన్లో బీఫామ్ తీసుకున్న షాజహాన్ మదనపల్లికి ప్రమాదకర పరిస్థితి చేరుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అందుకు కారణం అతని నుంచి బి ఫామ్ లాక్కోవడానికి కూడా కొందరు ప్రయత్నం చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. తర్వాత..

నామినేషన్ తిరస్కరణ

2004లో నామినేషన్ పత్రాలు అప్పటి మదనపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ రిటర్నింగ్ అధికారి హెచ్ గోపీనాథ్‌కు అందించారు. అదే సమయంలో షాజహాన్‌కు కాంగ్రెస్ పార్టీ అందించిన బీఫామ్ కూడా సమర్పించారు. మరుసటి రోజు పరిశీలించిన ఎలక్షన్ సిబ్బంది షాజహాన్ నామినేషన్ తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. అందుకు ప్రధాన కారణం బీఫాంలో అప్పటి ఏఐసిసి ఆంధ్ర వ్యవహారాల ఇన్చార్జ్ గులాం నబి ఆజాద్ సంతకం లేకపోవడమే. ఎందుకు పెద్ద కథ నడిచినట్లు అప్పట్లో ఈ సంఘటన సంచలనం రేకెత్తించింది. దీంతో తీవ్ర వెధవ గురైన షాజహాన్ భాష ఇంటికి పరిమితమయ్యారు. మదనపల్లి చరిత్రలో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ గుర్తు అభ్యర్థి లేకుండా పోయారు. ఈ పరిస్థితి నివారించడానికి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్, ప్రస్తుత ఏపీఐఐసీ చైర్ పర్సన్ జీ. శమేం అస్లంను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయించారు. కాగా టికెట్ ఆశించి భంగపడిన గంగారపు రాందాస్ చౌదరి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 25 వేల పైచిలుకు ఓట్లు సాధించి తన సత్తా నిరూపించుకున్నారు. ఆ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన దొమ్మలపాటి రమేష్ మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

బి-ఫారమ్ లోగుట్టు ఏంది?

2004 ఎన్నికలు జరిగే సమయంలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎల్పీ నేతగా ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా డి శ్రీనివాస్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈయన వద్ద నాదెండ్ల మనోహర్ కీలకంగా వ్యవహరించడంతోపాటు నామినేషన్ పత్రాలు కూడా అందరికీ అందించారు. అయితే మదనపల్లి నుంచి టికెట్ ఆశించిన వారిలో ఓ నాయకుడితో అత్యంత సామీప్య సంబంధాలు కలిగిన నాదెండ్ల మనోహర్ వల్లనే ఏఐసీసీ వ్యవహారాల ఇంచార్జ్ గులాబ్ నబి ఆజాద్ సంతకం లేని బీఫామ్ అందించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై అప్పట్లో పిసిసి వర్గాలు విచారణకు ఆదేశించాయి ఇప్పటికి ఆ వ్యవహారం సాగుతూనే ఉంది.. ఇదంతా గతం..! ఆ పరాభవాన్ని దృష్టిలో ఉంచుకున్న పీసీసీ పెద్దలు..

2009: ఎన్నికల్లో మళ్ళీ షాజహాన్ బాషాకు టికెట్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఆయనను సానుభూతి, దివంగత సీఎం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన కార్యక్రమాలు గట్టెక్కించాయి. కొన్ని నెలలకే డాక్టర్ వైయస్సార్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన నేపథ్యంలో రాజకీయ పరిస్థితులు తారుమారయ్యాయి. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిన షాజహాన్ బాషాకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండదండలు లేకుండా పోయాయి. 2014లో ఆయన ఓటమి చెందారు. తర్వాత రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా షాజహాన్ బాషా పోటీ చేశారు. ఆ తర్వాత ఆయన గత ఏడాది యువగళం పాదయాత్ర సాగిస్తున్న నారా లోకేష్ వద్ద టీడీపీలో చేరారు.

తాజా పరిస్థితి..

మదనపల్లి నుంచి టిడిపి టికెట్ కోసం షేక్ షాజహాన్ బాషాతో పాటు మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ కూడా ప్రయత్నించారు. టిడిపి,- బిజెపి- జనసేన కూటమిగా ఏర్పడిన నేపథ్యంలో.. మదనపల్లి సీటును జనసేన ఆశించింది. ఆ పార్టీ రాయలసీమ రీజినల్ కోఆర్డినేటర్‌గా ఉన్న గంగారపు రాందాస్ చౌదరి ఈసారి ఎలాగైనా టికెట్ తగ్గించుకొని పోటీ చేయాలని తహతహలాడారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ నాయకుడిగా ఉన్న నాదెండ్ల మనోహర్ కూడా ఉండడం తనకు కలిసొచ్చే అంశంగా భావించారు. అన్ని సమీకరణలు, వ్యక్తిత్వం బలాబలాలు పరిశీలించుకున్న తర్వాత మదనపల్లి నుంచి టిడిపి అభ్యర్థిగా షాజహాన్‌ను ఆ పార్టీ నుంచి ఎన్ చంద్రబాబు నాయుడు రంగంలోకి దించారు.

టిక్కెట్టు, సీటు ఆశించిన వారిలో మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటీ రమేష్, గంగారపు రామదాస్ చౌదరి తీవ్రంగా విభేదిస్తున్నారు. స్వతంత్రులుగా పోటీ చేసే ఆలోచనలో వారు లేనట్లు తెలుస్తోంది. అయితే టిడిపి అసెంబ్లీ అభ్యర్థికి సహకరించబోమంటున్న వారు... రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి సహకారం అందిస్తామని గతంలో ప్రకటించారు.. ఈ పరిణామాల నేపథ్యంలో..

హడావిడిగా నామినేషన్..

నామినేషన్ దాఖలు చేయడానికి షాజహాన్ బాషా శుక్రవారం మధ్యాహ్నం శుభముహూర్తంగా ఎంచుకున్నారు. బెంగళూరు బస్టాండ్ నుంచి ర్యాలీతో కోలాహలంగా బయలుదేరిన ఆయన చిత్తూరు బస్టాండుకు వచ్చే సమయానికి నామినేషన్ శుభముహూర్తం గడువు తీరుతుందని ఆందోళన చెందారు. అంతే ఒకసారి గా ప్రచార వాహనం నుంచి దిగేసి బైక్‌పై రిటర్నింగ్ అధికారి వద్దకు చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. 2004 ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని బి-ఫార్మ్‌లో సంతకంతో పాటు నామినేషన్ పత్రాలు సరిగా ఉన్నాయో? లేదో..! అనేది ఆయనకే తెలియాలి.

ఏది ఏమైనా ఆయన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అనుకూల శత్రువులు జేబులోనే ఉన్నట్లు యాదృచ్ఛికంగానే 2004 నుంచి ఒకే పక్షానికి చేరుతున్నారు. ప్రత్యర్థులతో కాకుండా మొదట ఆయన సుపక్షంలో వారితోనే పోరాడటం అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది. ఈసారి షాజహాన్ భవిష్యత్తు ఎలా ఉంటుందనేది పోలింగ్ వరకు వేచి చూడాల్సిందే.

Read More
Next Story