ఇది తెలుగువారి ఆత్మగౌరవానికి పుట్టినరోజు..
తెలుగు వారి ఆత్మ గౌరవం కాపాడాలని ఎన్టీ రామారావు ప్రతినబూనిన రోజు ఇది. ఆయన ఏర్పాటుచేసిన టిడిపికి శుక్రవారం 42 పుట్టినరోజు
(ఎస్.ఎస్.వి. భాస్కర్. రావ్)
తిరుపతి: " తెలుగు జనతకు వందనం.. తెలుగు యువతకు అభివందనం. తెలుగు మమతకు అభివాదం. తెలుగు జాతికి శుభాభినందనం. హరిజన గిరిజన దళిత వర్గాలు.. గుడిసెల్లో గూడుల్లో. .. అడవుల్లో మగ్గిపోతుంటే చూసి భరించలేక.. తెలుగు వాడి ఆత్మగౌరవం బతికించడానికి పుట్టిందే తెలుగుదేశం" అని ఎన్టీ రామారావు.. ప్రజల పట్ల తనకున్న మమకారాన్ని అజెండాగా మొదటి ప్రసంగంలోనే ప్రకటించి తన నిజాయితీ చాటుకున్నారు.
దేశ రాజకీయ చరిత్ర పైనే కాదు. ప్రపంచంలోని తెలుగువారి మదిలోనూ చెరగని తన ముద్ర వేసిన సందర్భం అది. రాజకీయాల్లో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన ఎన్టీ రామారావు సరికొత్త చరిత్రకు నాంది పలికారు. తెలుగుదేశం పార్టీ ఏర్పాటై శుక్రవారానికి 42 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. " తెలుగువాడి ఆత్మగౌరవాన్ని పునరుద్ధరిద్దాం" అంటూ వెండితెర హీరో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీకి ఊపిరూదిన రోజు ఇది. ఆ చరిత్రను ఒకసారి స్మరించుకుందాం.
తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రస్థానంలో ఎన్టీ రామారావు తీసుకువచ్చిన చైతన్యం, అజెండా ప్రజల సంక్షేమం కోసం అమలు చేసిన మేనిఫెస్టో కూడా ఒక చారిత్రాత్మక ప్రస్థానమే. ఎన్టీ రామారావు చైతన్య రథం ద్వారా ఆంధ్ర నాట రాజకీయాలను ఒక మలుపు తిప్పారు. ఆ తర్వాత దేశ స్థాయిలో ఆయన నేషనల్ ఫ్రంట్ ఏర్పాటుతో ప్రధాన మంత్రులను ఎంపిక చేసే స్థాయికి ఆంధ్ర రాష్ట్ర కీర్తిని వ్యాపింపజేశారు. అప్పటికే ఆంధ్ర రాష్ట్రం నుంచి ప్రధాన మంత్రులు రాష్ట్రపతులు అయి ఉండవచ్చు గాక. ఒక వ్యక్తి శక్తిగా మారి, దేశ రాజకీయాల్లో కూడా తెలుగువారి ఘనతను, చరితను ప్రతిబింబించిన ఖ్యాతి ఎన్టీ రామారావుకు దక్కుతుందనడం అతిశయోక్తి కాదు.
తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ గమనికపై ఇలాంటి చెరగని సంతకం చేశారు. ఆయన వాడిన వాహనం చైతన్య రథం కూడా జనం మదిలో ఇంకా మెదులుతూనే ఉంది. కాలక్రమంలో మిగతా పార్టీలు బస్సు యాత్రలు సాగించడానికి ఎన్టీఆర్ శ్రీకారం చుట్టిన చైతన్య రథం యాత్ర ప్రేరణగా నిలిచింది.
9 నెలల అవిశ్రాంత పర్యటన
తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీ రామారావుకు దన్నుగా నిలిచిన పెద్ద కుమారుడు నందమూరి హరికృష్ణ.. చైతన్య రథానికి సారధిగా మారారు. తొమ్మిది నెలలపాటు చైతన్య రథంపై విస్తృతంగా సాగించిన పర్యటనతో సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో జనసేన సునామీ సృష్టించిన ఎన్టీ రామారావు సీఎం పీఠంపై కూర్చున్నారు. స్వాతంత్రం తర్వాతి నుంచి అధికారంలో వేళ్ళూనుకున్న కాంగ్రెస్ పార్టీని మొదటిసారి ప్రతిపక్షంలోకి నెట్టిన చైతన్య రథం అది. 42 సంవత్సరాల కిందటి అపూర్వ ఘట్టాన్ని ఒకసారి తరచి చూద్దాం.
రాజకీయ చైతన్యానికి బీజం
1982లో రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే సంఘటనకు బీజం పడింది. సినిమాల్లో తన నటన ద్వారా అశేష అభిమానులను సంపాదించుకున్న నందమూరి తారక రామారావు మార్చి 29వ తేదీ తెలుగుదేశం పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. స్వాతంత్య్రం అనంతరం నుంచి రాష్ట్రంలో దేశంలో అధికరాన్ని అప్రతిహతంగా సాగిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీకి గడ్డు రోజులు ప్రారంభమయ్యాయి. "పదేపదే సీఎంలను మారుస్తూ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోంది. ఈ ఆత్మగౌరవాన్ని పునరుద్ధరిద్దాం" అనే నినాదంతో ఎన్టీ రామారావు ప్రజల్లోకి వెళ్లారు. అప్పటివరకు వేళ్ళూనుకుని ఉన్న కాంగ్రెస్ వటవృక్షం కూలింది. 9 నెలల స్వల్ప వ్యవధిలో ప్రచారం సాగించిన ఎన్టీ రామారావు 22 సీట్లు గెలుచుకొని కాంగ్రెస్ పార్టీని మొదటిసారి ప్రతిపక్షంలోకి నెట్టేశారు. ఇందుకోసం అంతకంటే ముందు సాగించిన ప్రచార ఘట్టాన్ని పరిశీలిస్తే..
అది వాహనం కాదు..
ఓ చైతన్య దీపిక
జీపులో ప్రచారంతో ఇబ్బందిగా ఉందన్న విషయాన్ని గ్రహించి ఎన్టీ రామారావు సాగించిన సమాలోచనల పరంపరలో చైతన్య రథం తెరపైకి వచ్చింది. "ప్రచారం ముమ్మరం చేయాలి. ప్రజలకు మేము కనిపించేలా ఉండాలి. సూచనలు చేయండి బ్రదర్ .. " అని రామకృష్ణ సినీ స్టూడియోలో, ఆ తర్వాత జరిగిన చర్చల్లో ఎన్టీ రామారావు కోరారని చెబుతారు. దక్షిణాది రాష్ట్రాలకు కూడా చలనచిత్ర పరిశ్రమ చెన్నై కేంద్రంగా ఉండేది. ఎన్టీ రామారావుకు ముందు నుంచి తమిళనాడు ఆరాధ్య దైవంగా భావించే ఎంజీ రామచంద్రన్ సినీ హీరో. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఎంజీఆర్ డిఎంకేతో విభేదించారు.
అన్నాడీఎంకే ( ఏఐఏడీఎంకే)ను స్థాపించారు. తన అభిమాన శ్రేణులను నమ్ముకుని, ఎన్నికల్లోకి ప్రచారానికి వాహనంలో వెళ్లారు. రెండుసార్లు ఆయన తమిళనాట విజయదుందుభి మోగించి, సీఎం పీఠాన్ని అధిరోహించారు. రెండు ఎన్నికలకు ఆయన అదే వాహనం వాడారు. 1977 నుంచి ఎంజీ రామచంద్రన్ ఓ వాహనాన్ని వాడకుండా ఇంటి వద్ద షెడ్డులో ఉంచారట. ఇదే విషయం ఇక్కడ రామకృష్ణ సినీ స్టూడియోలో జరుగుతున్న చర్చల్లో ప్రస్తావనకు వచ్చింది. అంతే ‘‘బ్రదర్స్.. అన్న గారికి చెప్పండి. మేము పంపామని. తమ్ముడు వాహనం కావాలంటున్నాడు.. అని నా మాటగా చెప్పండి" అని అనుయాయులను పురమాయించారట.
సానుకూలంగా స్పందించిన ఎంజీఆర్
ఎన్టీఆర్ సందేశాన్ని అందుకున్న ఎం జి రామచంద్రన్ కూడా అత్యంత గౌరవంగా సానుకూలంగా స్పందించారట. తంబి అంద మాదిరి సోల్నాగ (తమ్ముడు ఆ మాటలచెప్పి పంపాడా..!) సరి.. సరి... ఉల్లా ఇరకరాంగో పారుపోంగో (సరే సరే.. లోపల ఉంది వెళ్ళిచూడుపొండి) అన్నారంట. అంటే వాహనం షెడ్డులో ఉంది చూడు పోండి అని సూచించారట. అక్కడున్న రెండు వాహనాల్లో ఒకటి మాత్రమే ఎంపిక చేసి, ఆ విషయాన్ని ఎన్టీ రామారావు కు సమాచారం అందించారట. అంతే ఓ పురాతన కాలం నాటి వాహనం బయటకు వచ్చింది. షెడ్డుకు తీసుకెళ్లి ఇంజన్ మినహా మిగతా మరమ్మతులు, ఏర్పాట్లు చేయించారు. ఇక అసలు కథ మొదలైంది.
తమిళనాట ఎంజీఆర్‌కు
ఏబిఆర్ 7776 తో ప్రభంజనం
ఈ నంబర్ ఏంటి అనుకుంటున్నారా. దానికి ప్రత్యేక చరిత్ర ఉంది. తెలుగు నాట ఆరాధ్య దైవంగా భావించే ఎంజీ రామచంద్రన్ రెండు ఎన్నికల్లో విజయ బావుటా ఎగరవేయడానికి ఆ రాష్ట్రమంతా తిరిగిన వాహనం ఇది. తమిళ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఎంజీ రామచంద్రన్ ఏ బి ఆర్ 7776 వాహనంలో తమిళనాడులో కలియతిరిగారు. విజయం సాధించారు. 1940 కాలంనాటి చెవర్లి కంపెనీకి చెందిన ఆ పురాతన వాహనం జి 24 రకానికి చెందింది. ఆ వాహనాన్ని ఎన్టీ రామారావు వాహనం కొనుగోలు చేశారు.
వాహనంలో ఏర్పాట్లు
ఎంజీఆర్ నుంచి కొనుగోలు చేసిన ఆ వాహనాల్లో కొన్ని మార్పులు చేశారు. రంగు, స్టిక్కరింగ్ లతోపాటు, మైక్ సెట్, వాహనంపై నిలబడితే అందరికీ కనిపించే విధంగా వెలుగులు ఏర్పాటు చేయించారు. వాహనం లోపల కుర్చీ పొడవాటి సోఫా, మరో చిన్న సోఫా, పడుకోవడానికి వచ్చిన మంచం. టాయిలెట్ వంటి సదుపాయాలు కల్పించారు. వాహనం నుంచి టాప్ పైకి ఎక్కడానికి హాలు లాంటి గదిలో నుంచే నిచ్చెన కూడా ఏర్పాటు చేయించారు. ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో వాహనం తిరగడానికి కావలసిన అనుమతులు తీసుకోవడానికి కొన్ని రోజులు పట్టింది. ఈ లాంచనాలన్నీ పూర్తయ్యాయి. అంతే ఇక ఆ రథంతో జన సునామి వచ్చింది ఎలాగంటే.
హరికృష్ణ సారధిగా..
చైతన్య రథం అన్ని హంగులతో 1982 డిసెంబర్ 10వ తేదీన రోడ్డు పైకి వచ్చింది. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు నందమూరి హరికృష్ణ ఈ చైతన్య రథానికి సారధిగా మారారు. బెల్ బాటం ప్యాంటు రెండు జేబులు ఉన్న ఖాకీ చొక్కా ధరించిన ఎన్టీ రామారావు.. వాహనం పైకి ఎక్కి చేయి ఊపడం ఆలస్యం .. ఈలలు, కేరింతలు.. జై ఎన్టీఆర్ నినాదాలు. ఇక ఊపు ప్రారంభమైంది. కదిలిన చైతన్య రథానికి కాకి చొక్కా ధరించిన నందమూరి హరికృష్ణ స్వయంగా వాహన నడుపుతూ కదిలారు. అంతే దాదాపు 75 వేల కిలోమీటర్లకు పైగానే ఉమ్మడి రాష్ట్రమంతా చైతన్య రథం ఊరు ఊరున పర్యటించింది. ఆ రథం తిరగని పల్లె లేదంటే కాదు. చైతన్య రథం వస్తోంది అని తెలిస్తే చాలు. ప్రజలు రోడ్ల వెంబడి రోజులు తరబడి నిరీక్షించిన సందర్భాలు కోకొల్లలు. తిరుపతి గోవిందరాజస్వామి గుడికి సమీపంలోని కోనేరు వద్ద చైతన్య రథం నుంచి మొదటిసారి ఎన్టీ రామారావు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అది ఒక చరిత్ర. రాజకీయ చిత్రపటంలో చెరపలేని ఒక సంతకం.